మంగళవారం 01 డిసెంబర్ 2020
Editorial - Oct 26, 2020 , 23:16:07

పేదోడి బ్రహ్మాస్త్రం ‘ధరణి’

పేదోడి బ్రహ్మాస్త్రం ‘ధరణి’

పేదలకు ఆస్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా అలాగే పేదల బ్రహ్మాస్త్రంగా ఈ ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దడమే కేసీఆర్‌ అభిమతం. ఐదేండ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం కాదు, ఐదుతరాల అభివృద్ధి కోసమే నా తాపత్రయం అనే కేసీఆర్‌ మాటలకు, తను చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాకుండా ఇటువంటి రెవెన్యూ సంస్కరణలు, ‘ధరణి’లే సాక్షం.

నాటి ద్వాపర యుగం నుంచి నేటి కలియుగం దాకా ఈ ధరణిపై గుత్తాధిపత్యానికి ఎన్నో మారణ హోమాలు. ద్వాపర యుగంలో ఈ భూమిపై ఆధిపత్యానికి పాండవ, కౌరవ కురుక్షేత్ర రణరంగం  నుంచి, నేటి కలియుగంలో ప్రపంచ  యుద్ధాలు, దాయాది దేశాల మధ్య యుద్ధాల వరకు అన్నీ ఈ ధరణిపై గుత్తాధిపత్యం కోసమే. పంచభూతాల్లో ఒకటైన ఈ నేలపై ఆధిపత్యం అన్ని ఆధిపత్యాల్లో కెల్లా గొప్ప దిగా భావించడమే ఈ యుద్ధాలకు పునాది. ఇటువంటి ప్రధాన వనరు అయిన భూమి కోసం పటిష్ఠమైన చట్టాలు లేకపోవడం గత పాలకుల వైఫల్యా నికి నిదర్శనం.

నేడు మన దేశంలో జరిగే మరణాల్లో ఎక్కువ రోడ్డు ప్రమాదాల కారణంగా ఉంటుండగా ఆ తర్వాత మాత్రం ఆస్తి తగాదాలతో జరిగే హత్యలు, ఆత్మ హత్యలే. ఈ గొడవల్లో శాశ్వత వికలాంగులు కూడా ఎక్కువే. అటువంటి ఈ చట్టాలను పునర్‌వ్యవస్థీకరించి ఎటువంటి సమస్యలు లేకుండా పారదర్శకతతో ప్రజల జీవితాలను గుణాత్మక అభివృద్ధి దిశలో నడిపేవిధంగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న సాహసోపేత, విప్లవాత్మక నిర్ణయం రెవెన్యూ చట్ట ప్రక్షాళన. ఇందులో భాగంగానే ఈ నెల 29న ప్రారంభం కాబోతున్న ధరణి పోర్టల్‌.

నిన్నటివరకు భూ కబ్జాలు, అక్రమ కేసులు, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, భూ హత్యలతో రక్తపు మరకలతో నిండిన తెలంగాణ ధరణిని నూతన రెవెన్యూ చట్టం పాప ప్రక్షాళన చేయనున్నది. బీడు భూములతో బోసిపోయిన ఈ తెలంగాణ ధరణిని కాళేశ్వరం నీటితో తడిపి ముద్దచేసి పునీతం చేసిన తెలంగాణ కన్న బిడ్డ కేసీఆర్‌. ఈ భూమి నాదంటే నాదని భూదేవిని చెరబట్టి కోర్టుల చుట్టూ తిప్పే రోజులకు స్వస్తి పలుకుతూ పటిష్టమైన చట్టం, సౌలభ్యాలతో వస్తున్నది ఈ ధరణి. తెలంగాణలో 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూమి ఉంది, సుమారు ఒక కోటి అరవై లక్షల ఎకరాలు వ్యవసాయ భూమైతే, దాదాపు 67 లక్షల ఎకరాల్లో అటవీ భూమి ఉంది, మిగిలినవి ప్రభుత్వ భూమి, గ్రామ కంఠాలు, పట్టణాల కింద ప్రజా ఉమ్మడి ఆస్తుల కింద నమోదై ఉన్నవి. ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల ప్రక్రియ సామాన్యుడికి ఒక పజిల్‌ లాంటిది. 

అవినీతి, బాధ్యత రాహిత్యం వల్ల రెవెన్యూ రికార్డులను ఎవరికీ అర్థం కాని బ్రహ్మ పదార్థంలా మార్చేశారు. భూ చట్టాలు ఎన్ని ఉన్నా పేదలు, సామాన్య జనాలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. రైతులకు సామాన్య ప్రజలకు భూ కష్టాలు తొలిగించాలన్న ఉద్దేశంతో కేసీఆర్‌ అవినీతి రహిత సరళమైన కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశ పెట్టారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఐటీని, రెవెన్యూను అనుసంధానం చేసి ధరణి పోర్టల్‌ను   విప్లవాత్మక రెవెన్యూ సంస్కరణలో భాగంగా రూపొందించారు.

కేంద్రం పరిధిలోని భూచట్టాలు మినహా రాష్ట్ర భూ చట్టాల పరిధిలోని అంశాలన్నింటినీ ఇది పరిష్కరిస్తుంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలన్నీ ధరణి పోర్టల్‌లో నమోదు కానున్నాయి. ప్రస్తుతం సేకరిస్తున్న వివరాలన్నీ పోర్టల్‌కు అనుసంధానం అవుతాయి. తద్వారా భవిష్యత్‌లో క్రయవిక్రయాలు సులభంగా జరుగుతాయి. అంతే కాకుం డా వ్యవసాయేతర ఆస్తులు, కుటుంబం వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉంటే పంపకాల సమయంలో గొడవలకు ఆస్కారం ఉండదు. కుటుంబం ఇచ్చే డిక్లరేషన్‌తో పంపకాలు సులువుగా జరుగుతాయి. తద్వారా ఆ ఆస్తికి ప్రభుత్వం రక్షణగా ఉంటుంది, రికార్డులన్నీ డిజిటలైజ్‌ కావడంతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించే అవకాశం ఉండదు. కులం వివరాలు సేకరించడం ద్వారా సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వానికి స్పష్టత ఉంటుంది. సబ్సిడీలు వంటివి ఏ ఇంటికి చేరుతున్నా యో తెలుస్తుంది. కరెంటు, నల్లా కనెక్షన్ల వివరాలు తెలుసుకోవడం ద్వారా కనెక్షన్లు లేనివారికి వాటినందించే వీలుంటుంది. గృహ అవసరాల కోసం అనుమతి తీసుకొని కమర్షియల్‌గా వాడటం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణా లు బయటపడుతాయి, ఏ గ్రామం/ పట్టణంలో అవసరాలు ఏమిటి? భవిష్యత్తులో ఎంత అవసరం పడొ చ్చు వంటి వివరాలపై ఓ అంచనా వస్తుంది. దానికి అనుగుణంగా వసతుల కల్పన జరుగుతుంది.

ఇలా అన్నీ ఒకేచోట, ఒకే గొడుగు కిందకు భూ సంబంధ శాఖలు రావడంతో పాటు ధరణి వేదికగా భూము ల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, టైటిల్‌ జారీ చేస్తారు. ఇలా పేదలకు ఆస్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా అలాగే పేదల బ్రహ్మాస్త్రంగా ఈ ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దడమే కేసీఆర్‌ అభిమతం. ఐదేండ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం కాదు, ఐదుతరాల అభివృద్ధి కోసమే నా తాపత్రయం అనే కేసీఆర్‌ మాటలకు, తను చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాకుండా ఇటువంటి రెవెన్యూ సంస్కరణలు, ‘ధరణి’లే సాక్షం. 29 న ప్రారంభం కాబోతున్న ధరణి పేదో డి బ్రహ్మాస్త్రం కాబోతున్నది. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచి మన తెలంగా ణ గౌరవాన్ని నలుదిశలా చాటబోతున్నది.

కాసర్ల నాగేందర్‌రెడ్డి