శుక్రవారం 04 డిసెంబర్ 2020
Editorial - Oct 25, 2020 , 02:11:49

ఖట్వాంగుడి కథ వింటారా..

ఖట్వాంగుడి కథ వింటారా..

భగవంతుడు వాచ్యుడు- నామి. భగవంతుని నామం వాచకం. వాచ్యవాచకాలు అభిన్నాలైనా వాచ్యం కన్నా వాచకమే మిన్న అని భక్తిశాస్త్ర నిర్ణయం. భగవంతునికి అపచారం చేస్తే ఆయన నామాన్ని ఆశ్రయించి ఆ దోషం తొలగించుకోవచ్చు. భాగవత పురాణానికి ప్రాథమిక సాధనం నామస్మరణ-కీర్తన.


‘నామసంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం, ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరింపరమ్‌'- ఇది భాగవత పురాణం చివరి శ్లోకం. ‘హరి నామ సంకీర్తనంతో పాపాలన్నీ పటాపంచలవుతాయి. ప్రణామంతో తాపాలన్నీ తొలగిపోతాయి. అట్టి పరమపురుషుడు శ్రీహరికి నమస్సుమాంజలులు’ అని శ్లోకానికి అర్థం. ఈ సిద్ధాంతానికి భాగవతం, షష్ఠస్కంధంలోని ‘అజామిళోపాఖ్యానం’ దృష్టాంతం. ఈ స్కంధాన్ని ఆంధ్రీకరించింది ఏర్చూరి సింగయ. ఓరుగల్లు మండలంలోని ఏర్చూరు ఇతని స్వగ్రామం. గ్రామనామమే గృహనామ(ఇంటిపేరు)మయింది. సింగయకవి పోతనకు ప్రియశిష్యుడు. బమ్మెరవారికి వీరాభిమాని. ఈ కింది ఉత్పలమాలను అమ్లాన(వాడని) అక్షరసుమమాలగా పోతనకు అర్పించి భక్తితో తన గురుదక్షిణ సమర్పించుకున్నాడు సింగయ-


ఉ. ‘ఎమ్మెలు సెప్పనేల? జగమెన్నగ బన్నగరాజ శాయికిన్‌

సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు సేసినవాని భక్తిలో

నమ్మినవాని భాగవత నైష్ఠికుడై తగువాని బేర్మితో

బమ్మెరపోతరాజు కవిపట్టపురాజు దలంచి మ్రొక్కెదన్‌.’

‘మొగమిచ్చకాలు- మొహమాటపు మాటలు కాదు, జగమంతా మెచ్చగా పన్నగపతి(శేషుని) పానుపుపై పవళించే పద్మనాభునికి తన విశేష వాక్య సంపదలనే అశేష ఆభరణాలుగా అర్పించుకొన్నవాడు, నిర్భరభక్తి విశిష్టుడు, నిశ్చల భాగవత నిష్ఠాగరిష్ఠుడు, కవిరాజులకు పట్టపు రాజయిన బమ్మెర పోతరాజును స్మరించి, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని పద్యభావం.


ఎంత పతితుడైనా, పాతకుడైనా అంతిమ సమయంలో భగవంతుని నామం చింతించినవాడు పాపదూరుడై పరిశుద్ధుడవుతాడు. పురుషోత్తముని పొందుతాడు. ఇది అలౌకికమైన భాగవత ధర్మం. పాపాన్నేకాక పాపవాసన(సంస్కారం)ను కూడా సమూలంగా పెకలించివేసే సర్వోత్తమ ప్రాయశ్చిత్తం. మూర్తీభవించిన భక్తియోగమే హరినామ కీర్తనం. భగవదనుగ్రహం అధికార, అనధికారాలను పరికించదు. పూతన, కుబ్జలను కూడా తరింపజేసింది. అచ్యుతుని వలె అచ్యుత నామం కూడా అనుగ్రహమూర్తి!


శుకబ్రహ్మ పరీక్షిత్తుతో అన్నాడు- రాజా! ఈ విషయంలో సత్పురుషుల సదాచారమే ప్రమాణం. విధి-నిషేధాలు విధించే శాస్ర్తాలకు అతీతులై, నిర్గుణబ్రహ్మయందు నిష్ఠకలిగిన శిష్టులు కూడా హరికీర్తనమంటే ఎంతో ఇష్టపడతారు- చెవులు కోసుకుంటారు. కాన, నీవు కూడా నామకీర్తనతో నరజన్మను సఫలం చేసుకో. భాగవతం వలె మనశ్శుద్ధి కలిగించే మరొక పురాణం లేదు. ఇందు నామకీర్తనమే ప్రధానం. ఇది సాధకులకూ, సిద్ధులకూ కూడా సమానంగా సేవింపదగింది. నీవు హరిభక్తుడవు, శ్రవణపాత్రుడవు కాన దీనిని నీకు వినిపిస్తా. శ్రద్ధగా శ్రవణం చేసి శ్రేయస్సు సాధించుకో. రాజా! జీవితకాలమంతా వ్యర్థంగా వెచ్చించి, చావుకోరల్లో చిక్కుకున్న ఈ చివరిగడియల్లో చేసేదేముందని చింతపడమాక. ‘వరం ముహూర్తం జ్వలితం న చ ధూమాయితం చిరం’- పరమార్థ చింతన లేని పెక్కేండ్ల జీవితం వలన ప్రయోజనమేముంది? పురుషార్థంతో కూడిన కాలం ముహూర్తమైనా (48 నిమిషాలు) ముక్తిసాధకమవుతుంది. రాజా! ‘యేడు దినంబుల ముక్తిం గూడగ నేరీతివచ్చు?’ అని ప్రశ్నించావు గదా! పూర్వకాలంలోని ఒక ఇతివృత్తం వివరిస్తా, విను.


శ్లో.‘ఖట్వాంగో నామ రాజర్షిః జ్ఞాత్వేయత్తా మిహాయుషః, ముహూర్తాత్సర్వముత్సృజ్య గతవానభయం హరిమ్‌'

సీ. కౌరవేశ్వర! తొల్లి ఖట్వాంగుడను విభుం

డిల నేడు దీవుల నేలుచుండి


శక్రాది దివిజులు సంగ్రామభూముల

నుగ్రదానవులకు నోడివచ్చి

తమకు దోడడిగిన ధరనుండి దివికేగి

దానవ విభుల నందఱ వధింప

వరమిత్తుమనుచు దేవతలు సంభాషింప

‘జీవితకాలంబు సెప్పుడిదియ

ఆ. వరము నాకు నొండు వరమొల్ల’ ననవుడు

‘నాయు వొక ముహూర్తమంత తడవు

గల’ దటంచు బలుక గగనయానమున న

మ్మానవేశ్వరుండు మహికి వచ్చి.

ఓ కౌరవనాథా! పూర్వకాలంలో ఖట్వాంగుడను మహారాజు ఏడు ద్వీపాల భూమండలాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతుండేవాడు. ఇంద్రాది దేవతలు యుద్ధంలో ఉద్దండులైన దానవ వీరుల చేతుల్లో ఓడిపోయి ఖట్వాంగుని సహాయాన్ని అర్థించారు. అతడు అంగీకరించి భువినుండి దివికేగి దానవ సంహారం చేశాడు. దేవతలు సంతసించి వరం వేడుకోమన్నారు. ‘నాకింకా ఆయుర్దాయమెంత ఉందో చెప్పండి, ఇది తప్ప నాకు మరో వరం అక్కరలేదు’ అని అనగా వారు ‘ఒక ముహూర్తకాలం మాత్రమే ఉంది’ అన్నారు. వెంటనే ఆ మహారాజు విమానమెక్కి అతిశీఘ్రంగా భూమి మీద వచ్చిపడ్డాడు.

కం.‘గిరులంబోలెడి కరులను

హరులం దన ప్రాణదయితలైమనియెడి సుం

దరులను హితవరులను బుధ

వరులను వర్జించి గాఢ వైరాగ్యమునన్‌.’

భువికి రాగానే ఖట్వాంగ చక్రవర్తి కొండలవంటి ఏనుగులను, గుఱ్ఱాలను, ప్రాణాధిక ప్రియతమలైన సుందరీమణులను, శ్రేష్ఠులైన తన శ్రేయోభిలాషులను, ప్రకాండ పండితులను- ఇలా సర్వస్వాన్నీ ప్రగాఢ వైరాగ్యంతో తత్‌క్షణమే త్యజించాడు.

క.‘గోవింద నామకీర్తన

గావించి భయంబుదక్కి ఖట్వాంగ ధరి

త్రీ విభుడు సూరగొనియెను

గైవల్యము దొల్లి రెండు గడియలలోనన్‌'

రాజా! సర్వసంగ పరిత్యాగి అయిన ఖట్వాంగ రాజర్షి మృత్యభయాన్ని వీడి గోవిందనామ సంకీర్తన గావిస్తూ ఒక ముహూర్తంలోనే కైవల్యాన్ని- ముక్తిని పొందగలిగాడు. కనుక, రాజా! నీకు ఏడు రోజుల తర్వాత గదా చావు. ఈలోపు పరలోకసాధకమైన, పరమ మంగళకరమైన మోక్షమును సాధించుకోవచ్చుగదా- అన్నాడు శుకయోగి.


మూలంలోని ముప్పదిరెండు అక్షరాల శ్లోకభావాన్ని ఒక సీసపద్యం, రెండు కందమాకందాలలో అందంగా ఆమోదయుతంగా, విశ్లేషణాత్మకంగా విషయాన్ని విస్తరించి విశదీకరించాడు అమాత్యుడు. స్వర్గం రజోగుణ ప్రధానమైన భోగభూమి. అక్కడ పుణ్యఫల భోగానికే తప్ప కర్మయోగానికి తావులేదు. అందువలన మోక్షసాధనకు అవకాశం లేదు. అందుకే రాజర్షి ఖట్వాంగుడు కర్మభూమి అయిన భూలోకానికి దిగి వచ్చాడు. ‘వర్జించి గాఢ వైరాగ్యమునన్‌'- ఇక్కడ త్యాగం, వైరాగ్యం అని రెండు పదాలు. అంతఃకరణంలో ప్రియతముడైన పరమాత్మకంటే ఇతరమైన (ప్రాపంచిక) ‘వాసన’ లేకుండుటే వైరాగ్యం! తనకి, పరమాత్మకి మధ్య అడ్డుగా ఏదున్నా దాన్ని వదలగలగడమే త్యాగం! ఇష్టదైవానికి ప్రియమైనది, ఆయన ప్రసన్నతకు కారణమైనది చెయ్యడమే భక్తి! సృష్టిలో సత్య-అసత్యాలను విమర్శించి తెలుసుకొనుటే జ్ఞానం! పదార్థాన్ని వదలడం త్యాగం. పదార్థం మీద ఆసక్తిని విడిచిపెట్టడం వైరాగ్యం. త్యాగం స్థూలమైన శారీరిక క్రియ. వైరాగ్యం సూక్ష్మమైన మానసిక క్రియ. 

ఖట్వాంగుడు సర్వమునూ మనసా త్యజించి మాధవ కీర్తనగావించి కైవల్యం సాధించాడు. స్వరూప విస్మృతి వలన ఆత్మజీవభావం పొంది సంసార చక్రంలో పరిభ్రమిస్తోంది. రజ్జు (తాడు) జ్ఞానం లేనప్పుడే రజ్జువులో సర్పం కనిపిస్తుంది. స్వాత్మజ్ఞానం లేనందుకే ఆత్మలో జీవభావం. ఈ జీవత్వం అవిద్యాకల్పితం. అవిద్య అనిర్వచనీయం. జీవభావం తొలగుటే మోక్షం. ‘స్వరూపప్రతిష్ఠా చితిశక్తేః కైవల్యం’ (యోగదర్శనం)- జీవభావ నివృత్తి ద్వారా ఆత్మను స్వరూపంలో ప్రతిష్ఠించుటే కైవల్యం.


- తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ

98668 36006 

తాజావార్తలు