శనివారం 05 డిసెంబర్ 2020
Editorial - Oct 23, 2020 , 01:44:46

కార్మిక పక్షపాతి నర్సన్న

కార్మిక పక్షపాతి నర్సన్న

తెలంగాణ సమాజం మరో అరుదైన నేతను కోల్పోయింది. గంభీరమైన స్వరం, అంతే గంభీరంగా  ఉండే మనిషి.. పేద ప్రజల పెన్నిధి, కార్మిక పక్షపాతి నాయిని నర్సింహారెడ్డి మృతి ఈ గడ్డకు తీరనిలోటు.  తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిస్వార్థ సైనికుడు. హైదరాబాద్‌ నగరంలో పనిచేసే వేల మంది కార్మికులకు ఆయన మార్గదర్శి. కార్మికలోకానికి ఆయన పెద్దన్న. ప్రధానంగా కార్మికుల సమస్యలకు ప్రాధాన్యమిచ్చే నర్సన్న ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. 

కార్మిక నేతగా మొదలైన నాయిని నర్సింహారెడ్డి ఆ తర్వాత రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలోనే వ్యవహరించారు. తొలుత హింద్‌ మజ్దూర్‌ సభ ద్వారా కార్మికుల కోసం పోరాటం చేశారు. జార్జ్‌ ఫెర్నాండెజ్‌ నేతృత్వంలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఆయన జయప్రకాశ్‌ నారాయణ్‌ పిలుపుతో జనతాపార్టీ తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో 18 నెలలపాటు జైలు జీవితం గడిపిన నర్సన్న అనంతరం 1978లో ముషీరాబాద్‌ నుంచి శాసనసభకు పోటీచేసి నాటి ముఖ్యమంత్రి అభ్యర్థి టి. అంజయ్యను ఓడించారు. ఓడిపోయిన అంజయ్య ముఖ్యమంత్రి అయిన సభలో శాసనసభ్యుడిగా వ్యవహరించారు. 1985లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడంటే ముషీరాబాద్‌లోని పేద ప్రజలకు నర్సన్న ఎంత దగ్గరయ్యాడో అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు సభలో అడుగుపెట్టినపుడే నాయిని నర్సింహారెడ్డి కూడా సభలో ప్రవేశించారు. కానీ, టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ముషీరాబాద్‌ నుంచి 2004లో గెలిచేవరకు మంత్రి పదవి రాలేదు. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యుడిగా ఆనాడు రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో తొలిసారి మంత్రి అయ్యారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయిని మలిదశలో కేసీఆర్‌ నాయకత్వాన్ని సంపూర్ణంగా బలపరిచారు. 

2001లో జలదృశ్యంలో గులాబీ జెండా ఎగురవేసిన మరుక్షణం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీని, కేసీఆర్‌ నాయకత్వాన్ని వీడలేదు. 2008, 2009లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఆనాటి పాలకులు తీవ్ర ఇబ్బందులు పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా నాయిని గట్టిగా వ్యతిరేకించారు. ఒకదశలో నాయిని నర్సింహారెడ్డి వేరుకుంపటి పెడుతారంటూ వదంతులు రాగా ఆయన నిర్దంద్వంగా తోసిపుచ్చారు. ఉద్యమసారథి, టీఆర్‌ఎస్‌ పార్టీ అధినాయకుడు కేసీఆర్‌తోనే ఉంటానని, దుష్ప్రచారాలు నమ్మవద్దని కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కేసీఆరే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని, ఆయనతోనే తెలంగాణ సాధ్యమవుతుందని విస్పష్టంగా చెప్పారు. కేసీఆర్‌ను మలిదశ ఉద్యమంలో ఖమ్మం జైలుకు తీసుకెళ్తే ఆయనతో వెళ్లినవారిలో నాయిని కూడా ఉన్నారు. కేసీఆర్‌ ఏ పిలుపు ఇచ్చినా నర్సన్న ముందుండేవారు. తొలి దశ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూసినవాడు కావడంతో అప్పుడు జరిగిన లోటుపాట్లు ఇప్పుడు జరగవద్దని బలంగా కాంక్షించేవారు. ఇదే విషయాన్ని పార్టీ సమావేశాల్లో ప్రస్తావించేవారు. 

నాయిని నర్సన్న తన జీవితకాలంలో ఉన్న ఆస్తిని అమ్ముకోవడమే తప్ప అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. ఎంతటివారు వచ్చినా.. ఏం మాట్లాడాలన్నా అందరిముందే మాట్లాడాలని చెప్పేవారు. తొలి హోంమంత్రిగా, కార్మికశాఖ మంత్రిగా ఉన్నపుడు ఓ పెద్ద కంపెనీ అకస్మాత్తుగా కొందరిని తొలగించడంతో కార్మికులు, ఉద్యోగులు సచివాలయానికి వచ్చారు. మంత్రిగా ఉన్న నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. ఆయన వారి ఎదుటనే కంపెనీ ప్రతినిధులను పిలిపించారు. కంపెనీ ఉన్నతస్థాయి ప్రతినిధి ఒకరు ‘మీతో పర్సనల్‌గా మాట్లాడాలి సర్‌' అని రిక్వెస్ట్‌ చేశారు. దానికి నర్సన్న- ‘ఏం చెప్తవో ఇక్కడనే చెప్పు. నేను నిన్ను పిలిచింది వీళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పమని.. నాతో గుసగుసలు పెట్టేందుకు కాదు. నీలాంటోళ్లను చాలామందిని చూసిన. ముందుగాళ వాళ్లకు జీతాలు ఇచ్చి మాట్లాడు. వాళ్లు రూల్స్‌ ఎగ్గొడితే రూల్‌ ప్రకారం తీసేయండి. అంతేగానీ, ఇష్టం ఉన్నట్టు చేస్తమంటే ఊరుకునేది లేదు’ అంటూ అందరిముందే చెప్పేశాడు. ఆరోజు నేను వార్తల సేకరణ కోసం సచివాలయంలోనే ఉన్న. ఈ ఒక్క సందర్భంలోనే నర్సన్న గురించి చెప్పాలంటే అనేకం ఉన్నాయి. వీఎస్టీ, హెచ్‌ఎంటీ వంటి సంస్థలతోపాటు చాలా సంఘాలకు ఆయన ప్రతినిధిగా, గౌరవాధ్యక్షుడిగా పనిచేశారు. 

ఏ ప్రభుత్వం ఉన్నా.. ప్రభుత్వాల్లో తాను ఉన్నా, లేకపోయినా నాయిని నర్సన్న కార్మిక జన పక్షపాతిగానే వ్యవహరించారు. జీవితంలో మంచి పేరు సంపాదించుకుంటే చాలని చెప్పేవారు. ఏ విషయంపైనైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం నర్సన్న నైజం. భోళా మనిషి. హైదరాబాద్‌ నగరంలో పేదవాళ్లకు ఏ సమస్య వచ్చినా చెప్పుకోడానికి గుర్తుకువచ్చే మొదటిపేర్లలో ఆయనది ఒకటి. 1978లో రమేజాబీ అనే మహిళ, ఆమె భర్త పట్ల పోలీసులు సాగించిన దాష్టీకంపై నాయిని చేసిన పోరాటం ఆ రోజుల్లో చాలా పెద్దది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఉద్యమించాడు. నెలపాటు నగరం అట్టుడికింది. ఎమర్జెన్సీ కాలంలో దుర్మార్గాలకు బలైనవారి తరపున జస్టిస్‌ తార్కుండే కమిషన్‌ ఎదుట గళమెత్తారు. ప్రజాహక్కులను కాలరాయడంపై జస్టిస్‌ భార్గవ కమిటీకి నాయిని ఇచ్చిన నివేదికలు అన్నీ ఇన్నీ కావు. 1970-1980 మధ్య అనేక ప్రజాసమస్యలపై వీరోచిత ఉద్యమాలు చేశారు. భూమయ్య, కిష్టాగౌడ్‌లకు 1974-75ల్లో ఉరిశిక్ష   పడటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేసి వారి ఉరిని రెండుసార్లు తాత్కాలికంగా వాయిదా వేయించారు. 1969 తొలిదశ ఉద్యమంలో 28 సార్లు జైలుకు వెళ్లి      వచ్చారు. నాటి ఎమ్మెల్యే బద్రి                         విశాల్‌ పిట్టితో కార్మికోద్యమాల్లో పాల్గొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే లోకంగా బతికిన నాయిని మృతి ఈ గడ్డకు తీరని బాధ.


- ఓరుగంటి సతీష్‌