బుధవారం 02 డిసెంబర్ 2020
Editorial - Oct 23, 2020 , 01:47:47

చేనేతన్నకు పండుగ బతుకు

చేనేతన్నకు పండుగ బతుకు

బతుకమ్మ.. తెలంగాణలో ప్రజలందరినీ సంతోషపరిచే పండుగ. ముఖ్యంగా ఆడపడుచులకు ఇది ప్రత్యేక పండుగ. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా బతుకమ్మ చీరెలు అందజేస్తున్నది. ఈ కార్యక్రమం అటు నేతన్నలకు ఉపాధిని కూడా కల్పిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో

బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా

ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది.

బతుకమ్మ పండుగ, దసరా సందర్భంగా కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా సంబురాలు, కుటుంబ కోలాహలాలు, కలయికలుంటాయి. ఈసారి కరోనా మహమ్మారి వల్ల ఆ శోభ కొంత తగ్గినా ఆనందం, ఉత్సాహం మాత్రం అందరిలో ఉంటుంది. తెలంగాణకు ప్రత్యేకమైన సాంస్కృతిక పండుగ ఇది. రంగురంగుల పూలతో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ ఆడపడుచులు చప్పట్లు కొడుతూ వలయం గా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉన్నది. 

ఈ పండుగ వానకాలపు చివరలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగురంగుల్లో ఆరుబయళ్లలో పూసి ఉంటాయి. గునుగు పూలు, తంగేడు పూలు, బంతి, చేమంతి, నందివర్ధనం వంటి పూలు అందరినీ ఆకట్టుకుంటాయి. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. అలాగే జొన్నపంట కోతకు సిధ్ధంగా తలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. అందరి జీవితాల్లోకి సంతోషం తెచ్చే బతుకమ్మ తెలంగాణ స్వరాష్ట్రంలో బడుగు చేనేత కార్మికుల జీవితాల్లో కూడా వెలుగులు నింపింది. 

సిరిసిల్ల ప్రాంతంలో చేనేత వృత్తిపై ఆధారపడిన వారి సంఖ్య చాలా ఎక్కువ. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాల్లో ఒక నూతన పథకం ద్వారా వారికి ఉపాధి కల్పించడానికి పెద్దపీట వేసింది నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. బతుకమ్మ చీరెలతో వారికి ఎం తో ఆసరాగా నిలిచింది. గతంలో సిరిసిల్ల ప్రాంతంలో మరమగ్గాలపై నేస్తున్న గుడ్డలపై లాభాలు అంతంతమాత్రంగానే ఉండేటివి. చాలీచాలని కూలీ కారణంగా ఆర్థిక పరిస్థితులు దెబ్బతినేవి. చేసేందుకు ఉపాధి లేక సిరిసిల్ల నేతన్నలు ఇతర ప్రాంతాలకు ఏండ్ల తరబడి వలస వెళ్లేవారు. తల్లో చోట, కొడుకో చోట, పండుగ ప బ్బాలకు మాత్రమే సిరిసిల్లకు వచ్చేవాళ్లు. ఈ వాస్తవ జీవితాలను గమనించిన ప్రభుత్వం చేనేత కా ర్మికులకు సరైన జీవన విధానం కోసం ఒక భరోసా కల్పించాలని నిర్ణయించుకున్నది. అందులో భాగంగానే బతుకమ్మ పండుగ సందర్భంగా చీరెల పథకాన్ని అమల్లోకి తెచ్చిందని కార్మికులు సంబురపడుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు చూడాలని తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయమయ్యిందనవచ్చు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సి రిసిల్ల ప్రాంతంలోని కార్మికులు, యజమానుల ముఖాల్లో వెల్లివిరుస్తున్న ఆనందం.


- చిటికెన కిరణ్‌కుమార్‌