సోమవారం 30 నవంబర్ 2020
Editorial - Oct 22, 2020 , 06:55:07

ధార్మిక ఆకాంక్షలకే ప్రాధాన్యం

ధార్మిక ఆకాంక్షలకే ప్రాధాన్యం

పదవ అధ్యాయం కొనసాగింపు...

ఐ.ఏ.నం.5లో 1992 నవంబర్‌ 25న సుప్రీంకోర్టుకు సమర్పించినది: 1) సేకరించిన భూమిలో కరసేవ పునఃప్రారంభానికి పిలుపునిచ్చినందువల్ల ఏర్పడిన పరిస్థితిని రాష్ట్రప్రభుత్వం తీవ్రమైనది గానూ, ఆందోళనకరమైనదిగానూ భావిస్తోంది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘింపబడకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్రప్రభుత్వం తనదేనని అంగీకరించటమేగాదు తనదేనని తెలుసు కూడా. 2) అయితే అందుకు కేంద్రప్రభుత్వం సూచించిన మార్గం ప్రయోజనకరం కాబోదు. ఎందువల్లనంటే దానిని అనుసరించేట్లయితే బలగాలను వాడవలసి వస్తుంది. 2.77 ఎకరాల జాగాలోకి జనం పోగవ్వటాన్ని, కరసేవకు ప్రవాహంగా వచ్చిపడటాన్ని నివారించేందుకు, ఆ ప్రాంతంలో నిర్మాణ యంత్రాల కదలికల్ని నిలిపివేయటం అనేది కేవలం పోలీసు, పారామిలిటరీ దళాల వల్లనే జరుగుతుంది. 3) 1990లో ఇటువంటి స్థితే ఏర్పడినప్పుడు ప్రభుత్వం పీఏసీ, పారామిలిటరీ దళాలను రంగంలోకి దించినప్పటికీ ఫలితం లేకపోయింది. సరయూ వంతెనపై కరసేవకుల రాకను అడ్డుకుంటున్నా, వివాదంలో ఉన్న కట్టడప్రాంతంలోకి, అసలు యూపీలోకే ప్రజలు ప్రవేశించకుండా కట్టడి చేసినా జనం ఎలాగోలా ప్రవేశించారు. వివాదంలో ఉన్న కట్టడం దగ్గరకు చేరుకున్నారు. తత్ఫలితంగా ఎందరో అసువులు బాసారు. ఎందరో గాయాలపాలయ్యారు. విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారు.

4) చర్చల ద్వారానూ, అనునయపూర్వకంగా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభించగలదని, కేంద్రం సూచించే బలగాల వాడకమో మరొకటో ఒకవేళ చేపట్టవలసి వస్తే అది చిట్టచివరి ప్రత్యామ్నాయం కాగలదని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తున్నది. 5) తొలుత చర్చలపైనా, అనునయపూర్వక చర్యలపైన దృష్టిని కేంద్రీకరింప చేయాలన్నదే రాష్ట్రప్రభుత్వ దృఢ విశ్వాసం. 6) కనుక ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వీహెచ్‌పీ నాయకులతోనూ, ధర్మ సంసద్‌ నేతలతోనూ సరాసరి సంప్రదింపులు జరుపాలనుకుంటున్నది.  అలా చేసి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించకుండా ప్రజల ధార్మిక ఆకాంక్షలు నెరవేరేట్లు చూడవలసి ఉన్నది. ఇదంతా జరిగి తిరిగి ఫలితాన్ని కోర్టుకు తెలియజేసేందుకు రాష్ట్రప్రభుత్వానికి కనీసం ఒక వారమైనా సమయం కావలసి ఉంటుంది. 7) న్యాయ వ్యవస్థ హుందాతనాన్ని కాపాడేందుకు, దేశంలో శాంతినీ, సామరస్యాన్నీ నిలిపేందుకే రాష్ట్రప్రభుత్వం అటువంటి ప్రశంసనీయమైన గమ్యాన్ని చేరుకునేందుకే ఆ వారం గడువు సవినయంగా కోరటం.

ఐ.ఏ.నం.5లో 1992 నవంబర్‌ 27న సుప్రీంకోర్టుకు సమర్పించినది: ..వివిధ పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. ప్రతిస్పందన ఆశాజనకంగా ఉంది. పార్లమెంటు సభ్యులు, శ్రీరామ్‌  కర్‌సేవా సమితిలో ప్రముఖులు అయిన స్వామి చిన్మయానంద్‌జీ లేఖ దానిని నిర్ధారిస్తుంది.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)