శుక్రవారం 04 డిసెంబర్ 2020
Editorial - Oct 22, 2020 , 06:55:09

ప్రకృతి శోభకు పట్టం

ప్రకృతి శోభకు పట్టం

ప్రాణాధారమైన ప్రకృతి అందానికి ప్రతీక. ఆ ప్రకృతి ప్రతీకయే స్త్రీ. వర్షపు జల్లులతో సత్తువను పెంచుకొని, భువి నిండా పరిచిన

ఆకుపచ్చని తివాచీపై, హొయలొలుకుతున్న రంగురంగుల పూలతో, ఆశ్వయుజానికి అందంగా ముస్తాబైన ప్రకృతి కాంతను స్త్రీలు అదే పూలతో ఆరాధించుకునే పండుగ బతుకమ్మ. భిన్న వర్ణాల పూల బతుకమ్మల చుట్టూ వర్తులాకారంలో మహిళలు ఆడుతూ పాడుతూ తిరుగుతున్నప్పుడు ప్రకృతి మైమరిచిపోతుంది.

ఆశ్వయుజ మాస పాడ్యమి ఎంగిలిపూలు మొదలుకొని చివరిరోజు సద్దుల వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ కాలంలో విరివిగా  దొరికే గన్నేరు, బంతి, చామంతి, కాశీమల్లె, కట్ల పూలు, పట్టుగొండ్లు, గుమ్మడి, ఉద్రాక్ష, గోరింట, దాశన పూలను సేకరించి బతుకమ్మ పేరుస్తారు. ఈ పండుగకు గునుగు, తంగేడు పూలరాణులు. సాయంత్రం ఊరూవాడలు బతుకమ్మ పాటలతో మార్మోగుతాయి. గాజుల సవ్వళ్లు, చప్పట్ల గలగలలు, వినసొంపైన పాటలతో ప్రకృతి పరవశిస్తుంది.

తరతరాలుగా ఆడబిడ్డలు పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న పండుగ ఇది. ఆడబిడ్డలు చిన్ననాటి దోస్తులు, చుట్టాలతో కలిసి తమ సుఖదుఃఖాలను పంచుకునే పాటలను కడతారు. ఆ పాటల్లో సామాజికం, ధార్మికం, శ్రామికం, కుటుంబ బాంధవ్యాలు ఇలా ఎన్నోరకాల అంశాలు కథనాత్మకంగా మేళవించి ఉంటాయి. సంజె వేళ ఇంటిముందర అలికి, ముగ్గేసి పీటమీద బతుకమ్మను పెట్టి ఇంటి ఆడవారందరు ‘ఏమేమి పువ్వొప్పునే  గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ..’ అంటూ పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతారు. కొన్ని చుట్లు తిరిగిన తర్వాత వీధిలో నలుగురు గుమిగూడే చోట, ఆ తర్వాత ఆలయాల ముందు, చివరగా ఊరిచెరువు దగ్గరికి చేరుకుంటారు. స్త్రీలంతా ఆ పూలవాగు దగ్గరికి చేరి వలయాలుగా తిరుగుతూ చప్పట్లతో, బతుకమ్మ పాటలతో అంబరాన్నంటే సంబురాలతో గౌరమ్మను కొలుస్తారు. చివరగా ‘పోయిరా గౌరమ్మ పోయిరావమ్మా యాడాదికోసారి నువ్వొచ్చిపోవమ్మా..’ అని సాగనంపి ఆడపడుచులంతా పసుపు బొట్టు ఇచ్చుకొని, సద్దులు పంచుకొని తింటారు. ఇందులో ఉండే ప్రేమ ఆప్యాయతలు అందరిని కలిసికట్టుగా ఉండేట్లుగా చేస్తాయి. సామాజిక సంబంధాలను గట్టిపడేలా చేసే పండుగ ఇది. మహిళలు తమలో నిబిడీకృతమై ఉన్న కళా నైపుణ్యాలను నలుగురితో పంచుకోవడానికి వేదిక ఈ బతుకమ్మ.

బతుకమ్మ పండుగకు కఠోరమైన నియమా లేవీ లేవు. తమకు దొరికిన పూలనే సిబ్బిలో పేరుస్తారు. రోజూ తమకు అందుబాటులో ఉన్న చేతనైన ఫలహారాలను తీసు కుపోయి పంచుకొని తింటారు. కలిసి ఆడటం, పాడటమే ప్రధా నం. వేర్వేరు ప్రాంతాల్లో పూల పండుగలు జరుపుకోవచ్చు కానీ, తెలంగాణలో బతుకమ్మ వైశిష్ట్యమే వేరు. పువ్వులతో ప్రకృతిని ఆరాధించడం తెలంగాణకే ప్రత్యేకం. ఈ ప్రత్యేకతే మిగతా రాష్ర్టాల్లోకెల్లా తెలంగాణను శిఖరంగా నిలబెట్టింది. తెలంగాణ విశిష్టతను కాపాడలేని వలస పాలకులు బతుకమ్మకు తగిన ప్రాధాన్యం ఇవ్వక అణిచివేయ ప్రయత్నిం చారు. ప్రత్యేకించి హైదరాబాద్‌లో మహిళలు ధైర్యంగా బతుకమ్మ ఆడలేని పరిస్థితి ఉండేది. ఈ దశలో తెలంగాణ జాగృతి ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ప్రకాశమై ఉవ్వెత్తున ఎగిసి పునరుజ్జీవనం పొందింది బతుకమ్మ. 

బతుకమ్మను రాష్ట్ర పండుగగా, తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా ప్రకటించుకొని కొలుచుకోవడం రాష్ట్రం అవతరించడం ద్వారానే సాధ్యమైంది. బతుకమ్మ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బతుకమ్మ.  పడుచులంతా సంబురంగా జరుపుకునే పల్లె పండుగ, పూల పండుగ. ప్రకృతి పండుగ. అవధుల్లేని ఆనందోత్సాహాల కలబోత మన బతుకమ్మ పండుగ.


- డాక్టర్‌ సరోజ వింజామర