గురువారం 03 డిసెంబర్ 2020
Editorial - Oct 22, 2020 , 06:55:09

విశ్వసనీయతే ప్రధానాంశం

విశ్వసనీయతే ప్రధానాంశం

‘ఓరివారీ.. సైకిల్‌ మంచిగ సగవెట్టురా.. మొన్ననే చేపిస్తి పంచర్‌ మళ్లాయే.. నీ సైకిల్‌కినా వారెత్తూ’, ‘అయితమాయె గనీ ఓటెవరికేస్తున్నవ్‌ ఈ తాప’, ‘పోరగాండ్లు కొందరు రఘన్నకేద్దామంటుర్రు గదనె’, ‘సరే.. గా పోరగాండ్లకేమెరుకనే’, ‘మరెవ్వరికేద్దామంటవ్‌?’, ‘ఇంకెవ్వరికేస్తవే కేసీఆర్‌ సారుకే ఎయ్యాలె, నెలనెలా పింఛన్లు ఇయ్యవట్టె, రైతులకు రైతుబంధు ఇయ్యవట్టె, రైతు సచ్చిపోతే ఐదు లచ్చల రూపాల బీమా పైసలియ్యవట్టె, కాల్వల నిండ నీల్లు వారియ్యవట్టె.. ఇంతకాలం ఎవలు పట్టించుకునిరి ఇవన్ని’, ‘మరి పింఛన్లకెల్లి పదారువందలు ఢిల్లీ సర్కారోళ్లే ఇస్తుర్రట గదనే, మొన్నొక పిల్ల కన్నారంలకెల్లి వచ్చి చెప్పవట్టె’, ‘మా చెప్పింది తియ్‌.. అంతా ఉత్త ముచ్చటే’

ఓటర్ల మనోగతం తెలుసుకోవడానికి దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగి మండలం సుతార్‌పల్లి ఊరుకు వెళ్లాను. ఓ పంచర్‌ షాప్‌, దాని పక్కన ఓ పెద్ద గద్దె, ఆ గద్దె మీద ఓ పది మంది వృద్ధులు దుబ్బాక ఎన్నిక గురించే మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాలు అంతా ఉత్తయేననే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉన్నది. కాంగ్రెస్‌ పార్టీ ఏ మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆ పార్టీ దెబ్బతినడం వల్ల తాము లాభపడుతామని బీజేపీ ఆశ పడుతున్నది. బీజేపీ బాగానే కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నది. కానీ సోషల్‌ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తుంటే అవి ఫేక్‌ న్యూస్‌ అనేది వెంటనే తెలిసిపోతున్నది. బీజేపీ అబద్ధాల ప్రచారం లేకుంటే కొత్త ఓటర్లు కొందరు ఆకర్షితులయ్యేవారే. ఇప్పటికీ బీజేపీకి ఏమైనా ఓట్లు పడుతాయంటే కొత్త ఓటర్లవే. కానీ ప్రజల్లో పునాది ఏ మాత్రం ఉన్నట్టు కనిపించడం లేదని అక్కడి విద్యావంతుడు ఒకరు చెప్పారు. నియోజకవర్గంలో ఏ వర్గం వారిని అడిగినా కేసీఆర్‌ పరిపాలనే ప్రధానాంశంగా ఉందని తెలిసిపోతున్నది. వ్యవసాయం, కులవృత్తులు మొదలుకొని వివిధ రంగాల్లో సామాజికాభివృద్ధికి కేసీఆర్‌ చేస్తున్న కృషి ఓటర్లపై బలమైన ముద్ర వేసినట్టు కనిపిస్తున్నది. కేసీఆర్‌ స్థాయిని ఎదుర్కొనే పరిస్థితి మిగతా పక్షాల్లో కనిపించడం లేదు. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతను పెంచి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం ప్రతిపక్షాల్లో కనిపిస్తున్నది. కానీ అది ఫలితాన్నిస్తుందా అనేది అనుమానంగానే ఉన్నది.

అధికార పార్టీ ఎంత బలంగా ఉందనేది 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. వరంగల్‌ లోక్‌సభకు ఉప ఎన్నిక వచ్చినప్పుడూ ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాలో విపరీతమైన అబద్ధాలను ప్రచారం చేశాయి. కానీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ 4,59,092 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావు 45,682 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019లో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక విషయానికి వస్తే, కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి (ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య) టీఆర్‌ఎస్‌ హవాలో కొట్టుకుపోయారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43,358 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక లోక్‌సభ సభ్యత్వానికి సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయడంతో జరిగిన మెదక్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి 3,61,277 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2016లో మెదక్‌ జిల్లాలోని నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఇట్లా రాష్ట్ర ఆవిర్భావానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ ఎక్కడా గెలువలేకపోయాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది కనుక ఇక్కడ బలపడుతామని కొందరు బీజేపీ అభిమానులు భావిస్తున్నారు. కానీ బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాతనే, వరంగల్‌, మెదక్‌ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితిలో, ఇప్పుడు దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందని కొందరు ఆ పార్టీ అభిమానులే నమ్మ డం లేదు. సోషల్‌ మీడియాలో అబద్ధాలు ప్రచారాలు చేయడం వల్ల బీజేపీకి ఉన్న కొద్దిపాటి ప్రతిష్ఠ కూడా దెబ్బతిన్నది. బీజేపీ ఎప్పుడు చేసే పొరపాటే మళ్లీ మళ్లీ చేస్తున్నది. ప్రజలకేం కావాలో, ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందించాలో తెలిసినవాడు కేసీఆర్‌. ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్‌నే విశ్వసించడానికి కారణం ఆయన నిజాయితీని ప్రజలు నమ్మడమే. దుబ్బాకలో కూడా టీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ విశ్వసనీయతే ప్రధానమైన అనుకూలాంశంగా కనిపిస్తున్నది.

బీజేపీ బలగం విషయానికి వస్తే, ఈ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ప్రచారం చేసేదంతా బడికి వెళ్లే పిలగాండ్లే. బీజేపీ బలగం వాళ్లే. కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన తర్వాత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్‌ యువత మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కానీ సోషల్‌ మీడియా ద్వారా సాగుతున్న విద్వేష ప్రచారం అనుకూలత కన్నా, వ్యతిరేకతనే ఎక్కువ సృష్టిస్తున్నది. ‘గంగా జమునా తెహజీబ్‌'కు ప్రతీక అయిన తెలంగాణ సమాజంలో విభజన రాజకీయాలకు ఎన్నడూ చోటులేదు. బండి సంజయ్‌ కరీంనగర్‌లో ఎంపీగా గెలువడానికి కారణాలు ఏమిటనే చర్చ ఎట్లున్నా, ఇప్పుడు అదే కరీంనగర్‌లో బీజేపీ బలహీనంగా ఉందనేది వాస్తవం. ఎంపీగా గెలిచినా బండి సంజయ్‌ కరీంనగర్‌కు ఏం చేశాడని ఇప్పుడు బీజేపీ కార్యకర్తలే అడుగుతుండటం కొసమెరుపు.

సుతార్‌పూర్‌ పంచర్‌ షాప్‌ దగ్గర తాతల మధ్య జరిగిన చర్చ ఒక ఉదాహరణ. నియోజకవర్గంలో ఎక్కడ చర్చలు విన్నా టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం వారిపై బలంగా ఉన్నది.


[email protected]