అందోల్, మే 8 :
కన్న తల్లితండ్రులను జీవిత చరమాంకంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సొంత పిల్లలే వారిని గాలికోదిలేస్తున్న నేటి రోజుల్లో, అనారోగ్యంతో మంచాన పడిన అత్తకు సొంత బిడ్డలా, కన్న తల్లిలా అన్నీ తానై పడుకున్నచోటే సపర్యాలు చేస్తున్నది ఓ కొడలు. ఒకటి, రెండు నెలలు కాదు, ఏకంగా 20 ఏండ్లుగా సేవలు చేస్తున్నది. కూర్చున్న చోటుకే భోజనం అందిస్తూ, రోజువారి కార్యక్రమాలు సైతం ఒంటిచెత్తో చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది సంగారెడ్డి జిల్లా మండల కేంద్రం వట్పల్లికి చెందిన లక్ష్మి. అత్తమామ, అమ్మానాన్నలను పట్టించుకోకుండా అనాథ శరణాలయాలకు పంపుతూ, జీవిత చరమాంకంలో వారికి నరకయాతనకు గురిచేస్తున్న నేటి ఆధునిక యుగంలో సైతం ఆమె సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. నేడు మదర్స్ డే సందర్భంగా ఆ మాతృమూర్తి అత్తకు అందిస్తున్న సేవలపై అందిస్తున్న ప్రత్యేక కథనం.
అమ్మగా లాలిస్తూ, అక్క, చెల్లిగా అనుబంధాన్ని పంచుతూ భార్యగా బాధ్యతలను నిర్వర్తిస్తూ.. కోడలిగా అమ్మ స్థానంలో ఉండి అత్తకు అన్నీ తానై ఇంట్లో పరిపూర్ణమైన పాత్రను నిర్వహిస్తున్నది ఈ అమ్మ. అమ్మ అనేది రెండక్షరాల అమృతం. దేవుడు సృష్టించిన జీవులన్నింటిలోనూ ఏ విషయంలోలైనా బేధాలు ఉండవచ్చు. కానీ, అమ్మ ప్రేమలో వ్యత్యాసం ఉండదని నిరూపిస్తూ కడుపున పుట్టిన పిల్లలతో పాటు మంచాననడిన అత్తకు సైతం సమాన ప్రేమను పంచుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రానికి చెందిన 75 ఏండ్ల సత్తమ్మ ఇరవై ఏండ్ల క్రితం ఇంట్లో కిందపడి కాలు విరిగింది. ఆ తర్వాత ఇతర అనారోగ్య సమస్యలతో ఆమె మంచానికే పరిమితమయ్యింది. దీంతో కోడలు లక్ష్మి ఆ రోజు నుంచి అత్తను తన పిల్లలతో పాటు సమానంగా చూస్తూ స్నానం చేయించడం దగ్గర నుంచి రాత్రి భోజనం చేసి పడుకునే వరకు అన్ని పనులు తానే నిర్వహిస్తున్నది. ఆస్తులు పంచలేదనే కోపమో.. లేకా వృద్ధాప్యంలో సేవలు చేయడం భారమై కన్న తల్లులను రోడ్లపై, వృద్ధాశ్రమంలో వదిలేస్తున్న కోడుకులు, కోడళ్లు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, అత్తను అమ్మలా చూసుకుంటున్న ఈ కోడలు ఎందరికో ఆదర్శ మూర్తిగా నిలుస్తున్నది.
అత్తకు సేవచేయడం అదృష్టంగా భావిస్తున్నా..
అత్త మామలకు, అమ్మానాన్నలకు సేవచేసే భాగ్యం కలగడం నా అదృష్టం. వాళ్లు మనకు జన్మనిచ్చి ఆ జన్మాంతం మన ఎదుగుదలకు ఎంతో కృషి చేసి, మనం ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు వారి సర్వశక్తులు దారపోస్తారు. అలాంటి వారిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవడం మన కర్తవ్యం. మా అత్త 20 ఏండ్ల క్రింతం మంచానికి పరిమతమైంది. ఆ రోజు నుంచి ఆమెకు అన్నీ తానై సేవచేస్తున్నా. ఏ రోజు కూడా ఆమెను బరువుగా భావించలేదు. ఓ బాధ్యతగా సేవ చేసున్నా.
లక్ష్మి, గృహిణి, వట్పల్లి