బుధవారం 25 నవంబర్ 2020
Editorial - Oct 21, 2020 , 00:20:42

మన భరోసా పోలీసు

మన భరోసా పోలీసు

శాంతిభద్రతల పరిరక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో రక్షణ, ప్రశాంత జీవనానికి భరోసా కల్పించడం కోసం ప్రాణాలు అర్పిస్తున్నామని, విధి నిర్వహణను ప్రథమ కర్తవ్యంగా ఆచరిస్తున్నామని తెలియజేస్తూ ప్రజల మద్దతు కోసం అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరులను స్మరించుకుంటాం.

లడఖ్‌లోని అక్సాయ్‌చిన్‌ వద్ద సముద్రమట్టానికి 18 వేల అడుగుల ఎత్తున ఉన్న భూభాగం హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతం. 1959 అక్టోబర్‌ 21వ తేదీన లడఖ్‌ సరిహద్దు ప్రాంతంలో కాపలా కాస్తున్న పది మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు తమకంటే ఎక్కువ సంఖ్యాబలం, ఆయుధబలం ఉన్న చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. తమ శక్తికి మించిన పోరాటంలో ప్రాణాలు వదిలిన ఆ పదిమంది పోలీసుల వీరోచిత కృత్యం దేశ ప్రజల్లో విషాదంతోపాటు ఆరాధనాభావాన్ని కలిగించింది. స్వతంత్ర భారతంలో మొట్టమొదటి సైనికుల ప్రాణత్యాగమైనందున నాటినుంచి అక్టోబర్‌ 21వ తేదీని పోలీసు సంస్మరణ దినంగా పాటిస్తున్నాం.

ఈ సంవత్సరం జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం సముచితంగా ఉంది. భారతదేశ సైనికులకు ఎనలేని ఆత్మైస్థెర్యాన్ని కలిగించింది. ముఖ్యమంత్రి అమరుని ఇంటికి వెళ్లి పరామర్శించి ఎల్లకాలం అండగా ఉంటామని భరోసా ఇవ్వడం స్ఫూర్తిదాయకం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుని కుటుంబసభ్యుల్లో ఒకరికి గౌరవప్రదమైన ఉద్యోగంతో పాటు ఐదు కోట్ల రూపాయల సాయం, రాష్ట్ర రాజధానిలో ఇంటిస్థలంతోపాటు పిల్లలకు ఉచిత విద్యను అందజేస్తామని ప్రకటించారు. మొదటి ఘటన తర్వాత 60 ఏండ్లకు గాల్వన్‌ వాలీలో అదే చైనాతో జరిగిన పోరాటంలో అమరుడైన తెలంగాణ వాసి అమరత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇవ్వలేదు. అదే పోరాటంలో అమరులైన మిగతా 19 మందికి కూడా 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి ముఖ్యమంత్రి విశాల దృక్పథాన్ని చాటుకున్నారు.

పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో భాగం గా అనేకరకాలైన అసాంఘిక శక్తులను ఎదుర్కోవలసి వస్తుంది. దోపిడీ దొంగలు, హంతకులు, రాజకీయ, మత, తీవ్రవాద వర్గాలతో పోరాడవలసి వస్తుంది. యుద్ధంలో చనిపోయిన సైనికుల పట్ల ప్రజలు చూపించే సానుభూతి విధినిర్వహణలో చనిపోయిన పోలీసుల మీద కనిపించడం లేదు. పోలీసులు కూడా ప్రజల్లో భాగమే. వారికీ కుటుంబాలున్నాయి. పోలీసుల వల్ల జరిగే ప్రతి చిన్న పొరపాటు ఎంతో విమర్శకు గురవుతుంది, కానీ, పోలీసులు చేసిన మహోన్నత త్యాగాలు మాత్రం తగినంత ప్రశంసను పొందలేకపోతున్నాయి. ప్రజలకోసం పోరాడుతూ తమ ప్రాణాలను ధారపోసిన పోలీసు అమరవీరులను ఈ సంస్మరణ దినం సందర్భంగా స్మరించుకోవడం మన విధి. వారి సేవలను జ్ఞాపకం చేసుకొని, వారి కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటించి, పవిత్రమైన పోలీసు విధినిర్వహణకు మద్దతు తెలుపుదాం. 

తెలంగాణ రాష్ట్ర పోలీసు అమరులకు కూడా హోదాను బట్టి 40 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎక్స్‌గ్రేషియాను పెంచి రాష్ట్ర ప్రభుత్వం తమ పోలీసుల పట్ల సముచిత నిర్ణయం తీసుకున్నది. అభివృద్ధికి శాంతిభద్రతల నిర్వహణ ప్రధా నమని భావించిన ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థకు జవసత్వాలు కల్పించి, రూపురేఖలు మార్చి, దేశంలోనే సాహసోపేతంగా తీర్చిదిద్దారు. డీజీపీ నాయకత్వంలో పోలీసు వ్యవస్థ మెరుగైన ఫలితాలను సాధించింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్లో ప్రజలు పోలీసుల మీద పూలవర్షం కురిపించి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. కరోనా వ్యాధి నివారణకు పోలీసు వ్యవస్థ ప్రదర్శించిన సేవాగుణం ఎనలేనిది. ఆ విధినిర్వహణ క్రమంలో ఏడు వేల మందికిపైగా పోలీసు సిబ్బంది వ్యాధి బారిన పడ్డారు. 50 మందికి పైగా పోలీసు అధికారులు ప్రాణాలను కోల్పోయారు. ఆయా కుటుంబాలను కూడా సముచితరీతిలో ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రాణాలకు ప్రమాదం కలిగే పరిస్థితుల్లోనూ విధినిర్వహణ పట్ల పోలీసులు చూపిన అంకితభావాన్ని ప్రజలు ముక్తకంఠంతో హర్షించారు.

రాష్ట్ర సరిహద్దుల్లో తీవ్రవాదాన్ని అరికట్టడంలో, అంతర్గత భద్రతాచర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అత్యంత సమర్థంగా పనిచేస్తుంది. అంతర్గత అశాంతిని సృష్టించే శక్తులను ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ సాయంతో కూడా నియంత్రించగలిగే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర విభజనకు ముందున్న అనేక అపోహలను పోలీసులు పటాపంచలు చేశారు. నేడు తెలంగాణ వైపు ఏ అసాంఘిక శక్తీ దృష్టి సారించలేనంత సమర్థంగా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వ ఇతోధిక సహకారంతోపాటు పోలీసు వ్యవస్థ నాయకత్వ పటిమ కారణం. నిషేధిత తీవ్రవాద కార్యకలాపాల ఏరివేతను కొన్ని సంఘాలు విమర్శిస్తుంటాయి. మానవహక్కుల విషయంలో ద్వంద్వ విధానం కాకుండా, రెండువైపులా మానవహక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. చట్టబద్ధంగా వ్యవహరించే పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. సమాజంలో శాంతి లేకుంటే ఏమీ లేనట్టే. అంత ప్రాముఖ్యం కలిగిన విధులు నిర్వర్తించే పోలీసు ఉద్యోగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధినాయకత్వం ప్రాధాన్యం ఇస్తుంది. ఆధునిక సవాళ్లను ఆత్మస్తైర్యంతో ఎదుర్కోవడానికి కింది స్థాయి పోలీసులకు సమయానికి పదోన్నతులు ఇవ్వాలి. మెరుగైన వేతనం ఇస్తూ స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. వారికి ఇండ్లు నిర్మించడమే కాకుండా వారి పిల్లలకు రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటుచేయాలి. విధినిర్వహణలో రాజకీయ జోక్యాన్ని నివారించాలి. అలాంటప్పుడు ఇంకా మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. 

(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు)

(నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం)