బుధవారం 02 డిసెంబర్ 2020
Editorial - Oct 21, 2020 , 00:20:45

బతుకు గాథల గేయాలు

బతుకు గాథల గేయాలు

తెలంగాణకు విశిష్టమైన సంస్కృతి, సంప్రదాయం ఉన్నది. తెలంగాణ కీర్తిని దశదిశలా చాటేది, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేది బతుకమ్మ. ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఈసడింపులకు, వివక్షకు గురైంది. ఈ పరిస్థితుల్లో బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఘనత తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట్ల కవితకే దక్కింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా, తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ కానుకగా చీరను అందించడం విశేషం.

సాధారణంగా ప్రతి పండుగను వ్యక్తిగతంగా వారివారి ఇండ్లల్లో కుటుంబంతో కలిసి జరుపుకొంటారు. బతకమ్మ పండుగ మాత్రం ఊరి ఆడపడుచులంతా కులమతాలకతీతంగా, సామూహికంగా నిర్వహించుకుంటారు. ఈ పండుగ  ఆట పాటల్లో ఆడపడుచులు తమ బాధలను, సంతోషాలను పంచుకుంటారు. ఈ పాటలు కుటుంబ విశేషాలు, అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల అనురాగం, వదిన మరదలు విసుర్లతో తమ అనుబంధ బాంధవ్యాలను ప్రతిబింబించేవిగా ఉంటాయి. ఉదాహరణకు- ‘ఇద్దరక్క చెల్లెండ్లు కోల్‌/ ఒక్కూరికిచ్చే కోల్‌/ ఒక్కడే మాయన్న కోల్‌ /వచ్చన్న పోడాయె కోల్‌/ ఎటొద్దు చెల్లెలా కోల్‌..’ ఈ పాట చెల్లికి, అన్నకు మధ్య ఉన్న ప్రేమానురాగాలను తెలియజేస్తుంది. ‘కొంటె కొడవలి చిక్కె/ కొంటెద్దు చిక్కె/ మూలవాసం చిక్కె/ ముసలెద్దు చిక్కె/ ఇంకేమి కావాలి ఇంటాడ బిడ్డ..’ ఈ పాటలో ఆడపడుచు పెండ్లి చేసుకొని వెళ్లిపోతుందనే బాధలో వదిన విసిరే విసురులను చూడవచ్చు.‘మీ ఇంటి వెనకాల ఉయ్యాలో/ మా ఇంటి వెనకాల ఉయ్యాలో/ ఏమేమి పాదు లు పెడదాము ఉయ్యాలో/మా ఇంటి వెనకాల ఉయ్యాలో/ గన్నేరు పాదులు పెడదాము ఉయ్యాలో..’ ఈ పాటలో ప్రకృతిపై ఉన్న మక్కువను తెలియజేస్తారు. ఇలా ప్రతి పాట తేలికైన భావనలతో సుకుమారత్వాన్ని చాటి చెప్పేవిగా ఉంటా యి. ఈ పండుగ నేపథ్యాన్ని వివరించే అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి.. ‘చోళ దేశాన్ని ధర్మాంగుడనే రాజు పరిపాలించేవాడు. అతని భార్య సత్యవతి. వారికి నూరుగురు కొడుకులు. వారు యుద్ధంలో చనిపోవటంతో వారు  అడవులకు వెళ్లి సంతానం కోసం లక్ష్మీదేవిని ఉద్దేశించి తపస్సు చేశారు. లక్ష్మీదేవి ప్రత్యక్షమై వరమడగమంటే ఆమెనే తమ కూతురిగా జన్మించమని కోరారు. వాళ్లకు జన్మించిన లక్ష్మీదేవిని మును లు చూసి ‘బతుకమ్మ’ అని పేరు పెట్టి దీవిం చారట. యవ్వన వతి అయిన బతుకమ్మను చక్రంగుడు పేరు ఉన్న శ్రీమహా విష్ణువు పెండ్లాడి సంతానం పొందినట్లు గాథలున్నాయి.

మరొక కథ... ‘గౌరి మహిషాసురుని చంపి న తర్వాత (ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు) అలసటతో మూర్ఛపోయింది.ఆమెను మేల్కొ ల్పడానికి స్త్రీలంతా గుమిగూడి పాటలు పాడా రు. సరిగ్గా 10వ రోజున ఆమె మూర్ఛ నుంచి తేరుకొని స్పృహలోకి వచ్చింది. మూర్ఛలో ఉన్న ఆమెను తిరిగి బతుకమ్మ అని పాడితే బతికింది కనుక ఆ పది రోజులు పండు గ జరుపుకొంటారు. తంగేడు పూల ప్రాధాన్యాన్ని తెలిపే ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. ‘పూర్వం ఒక పల్లెలోని కుటుంబంలో జన్మించిన ఓ ఆడబిడ్డ తన మంచితనంతో అందరి తలలో నాలుకలా ఉండేది. ఆ అమ్మాయికి యుక్త వయస్సు రాగానే పెండ్లి చేసి అత్తవారింటికి పంపారు. ఈ అమ్మాయి అంటే ఆమె వదినకు ఈర్ష్యగా ఉండేది. పండుగకు తల్లి గారింటికి వచ్చి న ఆ అమ్మాయికి, వదినకు తరచుగా గొడవలు జరిగేవి. ఒకసారి చెరువు గట్టు వద్ద స్నానాల అనంతరం ఆ అమ్మాయికి తెలియక వదిన చీర కట్టుకున్నది. ఇది సహించని వదిన ఆ అమ్మాయి గొంతు నులిమి చెరువులో పడేసి వెళ్తుంది. మరణించిన ఆ అమ్మాయి తన భర్త కలలో కనిపించి చెరువుకు దగ్గరలోని తంగేడు చెట్టు వద్ద తాను ఉన్నానని, తనను ఇంటి కి తీసురకెళ్లమని కోరింది. అప్పటినుంచి ఆ అమ్మాయి చనిపోయిన చోట గల తంగేడు చెట్టుకు ప్రజలు పూజలు చేయసాగారు.’ అలా కాలక్రమంలో తంగేడు పూల తో బతుకమ్మను పేర్చడం సంప్రదాయమైందంటారు.

భాద్రపద శుద్ధ బహుళ పంచమి రోజున పుట్టమన్నును తెచ్చి తడిపి ఒక చిన్న పీటమీద చతురస్రాకారంలో అంతరాలను పేర్చుతూ చివరికి గుడి గోపురం వలె చేస్తారు. దీన్నే బొడ్డెమ్మ అంటారు. మొదటిరోజు నుంచి 9వ రోజు వరకు పలురకాల పిండివంటలు, ప్రసాదాలు తిని ఆనందంగా గడుపుతారు. బంగారు తెలంగాణ నిర్మించు కునే క్రమంలో మనం బతుకమ్మ సాక్షిగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ఎలుగెత్తి చాటుదాం.