మంగళవారం 27 అక్టోబర్ 2020
Editorial - Oct 18, 2020 , 23:31:10

ప్రజల పాత్రే ప్రధానం

ప్రజల పాత్రే ప్రధానం

1992 మే 22 వ తేదీన ఢిల్లీలో జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో ప్రధానీ పీవీ నరసింహారావు చేసిన ప్రసంగం ఇది...

ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ఉండాలా?మార్కెట్‌ ఆర్థికవ్యవస్థ ఉండాలా అనే మౌలిక ప్రశ్న ప్రపంచదేశాలను ఎంతోకాలంగా వేధిస్తున్నది. ఇందుకు సంబంధించిన ప్రయోగాలకు మన దేశం కేంద్ర బిందువు అయింది. ప్రధాని పీవీ సారథ్యంలో మన దేశం ఆర్థిక సంస్కరణల వైపు నిర్ణయాత్మకమైన మలుపు తీసుకున్న తర్వాత కూడా ఈ చర్చ ముగిసిపోలేదు. అయితే ఈ అంశంలో పీవీ వైఖరి భిన్నమైనది. ప్రణాళికా, మార్కెట్‌ విధానాల్లో ఏ మార్గాన్ని చేపట్టినా వికేంద్రీకరణ జరపడం, ప్రజలను భాగస్వాములను చేయడమే అసలు లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రణాళి కారచన, ఆచరణ- రెండూ పంచాయతీరాజ్‌ సంస్థకే దత్తం చేయాలని ముఖ్యమంత్రులకు సూచించారు.

నాదృష్టిలో ప్రణాళిక, మార్కెటు యంత్రాంగంలో ఏదైనా ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవాలనేది ప్రశ్న కాదు. ఏ విధంగా అట్టడుగు స్థాయి నుంచి పైవరకు వికేంద్రీకృత వ్యవస్థను శక్తిమంతం చేయడం, అభివృద్ధిలో ప్రజలను వాస్తవంగా భాగస్వాములను చేయడమనేది కీలకమైన ప్రశ్న. విధాన రచన ముఖ్యంగా కీలకమైన అంతరంగ విషయాలైన మానవ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి రంగాలలో సంపూర్ణ దృక్పథాన్ని అభివృద్ధి చేయడంలో ఒక సమీకృతమైన పాత్రను పోషించడమే నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిజమైన సవాలు. రాష్ట్ర ప్రభుత్వాలు, పంచాయతీరాజ్‌ సంస్థలు ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించి మార్గాన్ని అన్వేషించాలి. 

అక్షరాస్యత, కుటుంబ సంక్షేమాలవంటి రెండు ముఖ్య రంగాలను ఉదాహరణగా తీసుకొని నా మనస్సులో ఉన్నదేమిటో విపులీకరించనివ్వండి. కొద్దికాలం క్రితం వయోజన విద్య ప్రభుత్వ బాధ్యతగానే భావించబడింది. సంపూర్ణ అక్షరాస్యతకు మొదట కేరళలోను ఇప్పుడు మరీ వెనుకబడిన ప్రాంతాలలో సైతం ప్రారంభించబడిన ప్రాంతీయమైన కాలపరిమితిగల ప్రజా ఉద్యమాలు ఈ మధ్యకాలంలో సాధించిన విజయాలు ఎనిమిదవ ప్రణాళికా కాలంలో నిరక్షరాస్యతను పూర్తిగా రూపుమాపగలమన్న విశ్వాసాన్ని కలిగించాయి. ఈ ఉద్యమాలు సమాజంలోని అందరు సభ్యులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) స్థానిక ప్రజలు మొదలైనవారందరి సహకారంతో నడిచాయి. ఈ విధంగానే ఎనిమిదవ ప్రణాళికలో కుటుంబ సంక్షేమం, జనాభా నియంత్రణలకు సంబంధించిన వ్యూహం, ప్రణాళికా రచన, ఆచరణ పాలనా విషయాలలో పూర్తి బాధ్యత పంచాయతీరాజ్‌ సంస్థలపై ఉంచుతుంది. ప్రజలను ఈ కార్యక్రమాలలో భాగస్వాములు చేయడంపై ఎక్కువగా ఆధారపడుతున్నది. 

ఈ సందర్భంలో పార్లమెంటు సభ్యులను వారి వారి నియోజకవర్గాలలోని అభివృద్ధి కార్యక్రమాలలో పాత్రధారులను చేయాల్సిన అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పదలచుకున్నాను. ఈ విషయంలో ఫిర్యాదులు రావడం కొనసాగుతున్నది.పార్లమెంటుకు మనం బాధ్యత కలిగి ఉన్నామనే సత్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజాప్రతినిధులుగా పార్లమెంటు సభ్యులు వారి నియోజకవర్గంలోని విషయాలపై సహజంగానే ఆసక్తి కలిగి ఉంటారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, దేశంలోని అభివృద్ధి కార్యక్రమాలలో వారిని పాత్రధారులను చేయుటకై ఒకే విధమైన పద్ధతి అవసరం ఎంతైనా ఉంది. ఫిర్యాదులు పదే పదే రావటం వల్ల ఈ విషయాన్ని ఈ సమావేశంలో లేవనెత్తాల్సి వచ్చింది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రులకు విన్న విస్తున్నాను.


సవాళ్ళను ఎదుర్కొనుట: ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను, 8వ ప్రణాళిక ఈ విధంగా ఎదుర్కోవాలనుకుంటున్నది. ప్రజల సాంఘిక వినిమయ అవసరాలకు చేసే కేటాయింపులలో ఎంతో వెనుకబడి ఉన్నాం. పేదరికం న్యాయమైన అవసరాల నిరాకరణ స్థాయి తగ్గినప్పటికీ ఇంకా ఆమోదించలేనంతగా ఉంది. అక్షరాస్యత ముఖ్యంగా స్త్రీలలో ఇప్పటికీ చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఇంకా ఎక్కువగానే ఉన్న శిశు మరణాలు, తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఆందోళన కలుగజేస్తున్నాయి. పెరుగుతూనే ఉన్న విత్త, బడ్జెట్‌ లోట్లు, తీవ్రమైన చెల్లింపుల సమతుల్యం పరిస్థితి, ద్రవ్యోల్బణం, అంతేకాక ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించి దాన్ని శక్తిమంతంగా, అంతర్జాతీయ పోటీని తట్టుకునేవిధంగా చేయాల్సిన సత్వర ఆవశ్యకతవైపు కూడా మనం దృష్టిసారించాల్సి అవసరం ఉన్నది. అందువల్ల  దాదాపు సంపూర్ణ ఉద్యోగ పరిస్థితిని శతాబ్దాంతం వరకు సాధించాలనే ఆశయంతో, 8వ ప్రణాళిక ఉపాధి కల్పించే కార్యక్రమాలకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నది. ఈ దృష్టితోనే, వేతన- ఉద్యోగ కార్యక్రమాలను ప్రణాళికలో కీలకమైన రంగంగా గుర్తించడం జరిగింది. జనాభా నియంత్రణ, ప్రాథమిక విద్యను సర్వత్రా లభించేలా చేయడం, నిరక్షరాస్యత నిర్మూలన, రక్షిత మంచినీరు సరఫరా చేయటం, మొత్తం జనాభాకు ప్రాథమిక వైద్య సదుపాయాలు, ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించటమే కాకుండా ఎగుమతి కూడా చేయగలిగే విధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం, అభివృద్ధిని ముందుకుతీసుకుపోయేందుకు అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలపర్చడం మొదలగువాటిని ఇతర కీలక రంగాలుగా గుర్తించడం జరిగింది.

ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు ఇంతకుమునుపే గ్రామాలలో వేతన- ఉద్యోగాల గురించి ప్రస్తావించారు. సహజంగానే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినంతవరకు, ఈ విషయం ప్రాధాన్యాన్ని పొందింది. కానీ ఈ చర్య తాత్కాలికమైనది మాత్రమేనని నేను మీకు గుర్తుచేస్తున్నాను. పల్లెటూళ్ళలో ప్రాథమిక విద్య అందరికీ లభ్యం కావటం మొదలుపెట్టి ఉన్నత పాఠశాలల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంటే ఈ వేతన ఉద్యోగాలు ఒకస్థాయిని దాటి కొనసాగించలేము. యువకులు తమకు కూలీ కాకుండా వేరేరకం ఉద్యోగం కావాలని అడిగే రోజు వస్తుంది. నేను ఈనాడు కూలీ పనిచేస్తున్న తరం గురించి మాట్లాడటం లేదు. ఈ తరం వారు తమ వేతనాన్ని సంపాదిస్తూనే ఉంటారు. మనం వాళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. కానీ, రాబోయే తరం వారి తల్లిదండ్రుల వలె కూలీ వేతనంతో సంతృప్తిపడరనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఇతర రకాల ఉద్యోగాలను కోరుతారు. దీనికి మనం సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు చెప్పినదానిని తొమ్మిదవ ప్రణాళిక చేపట్టగలదని నేను అనుకుంటున్నాను. వేతనాన్ని సంపాదించడం వరకు 8వ ప్రణాళిక భద్రంగా ఉంది. ఈ తరం కొనసాగుతూ ఉంటుంది. 15 నుంచి 20 సంవత్సరాల వయస్సు వారి అవసరాలు తీర్చడానికి, వారిని పట్టణాలకు పోకుండా ఆపడానికి నేడు పెద్ద ఎత్తున జరుగుతున్న పట్టణీకరణను ఆపడానికి ఈ సగం విద్యావంతులను గ్రామాల్లోనే ఉండేలా చేసేందుకు మనం 9వ ప్రణాళికలో ఏదైనా మార్గం ఆలోచించాల్సి ఉంది. ఈ మార్గం వారు తమ విలువకు తగినదిగా తమ గౌరవానికి భంగం కలిగించనిదిగా భావించాలి. ఇది వివరంగా చర్చించాల్సిన సామాజిక, ఆర్థికసమస్య.

8వ ప్రణాళిక పెట్టుబడులను వ్యవసాయం అనుబంధరంగాల వైపు మళ్ళిస్తుంది. గత కొన్నేళ్ళుగా వ్యవసాయ రంగపు పెట్టుబడులు తగ్గుతూ వచ్చాయి. వ్యవసాయాభివృద్ధి, తిండి ధాన్యాల భద్రతకు, ఉపాధి కల్పనకు ఎంతో కీలకమైనప్పటికీ ఈ పెట్టుబడి తగ్గుతూ వచ్చింది. భవిష్యత్తులో అభివృద్ధి పునాదులను బలపరచడానికై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగం పెట్టుబడుల వాటాను ఆ విధంగానే కొనసాగించాలని ప్రతిపాదించబడింది. ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేటురంగం వాటాను పెంచడం జరుగుతుంది- విద్యుచ్ఛక్తి సమాచార సాధనాలు, చమురు బొగ్గు, పెట్రో రసాయనాలు, భారీ ఉత్పత్తి సాధనాల పరిశ్రమ వ్యవస్థీకృత వాణిజ్యసేవలు వంటివి ఆర్థిక కార్యకలాపాల్లో కొన్ని మాత్రమే. ప్రైవేటురంగం ఈ బాధ్యతను స్వీకరించి ఈ రంగాల అభివృద్ధికి చాలావరకు తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. 

ముగించే ముందు నేను కొన్ని కొన్ని విషయాలను సమితి దృష్టికి ప్రత్యేకంగా తీసుకొని రాదలిచాను. వేగంగా తరిగిపోతున్న ప్రభుత్వ పొదుపు మొత్తాల గతిని మార్చడానికి ప్రభుత్వ యంత్రాంగ పరిమాణాన్ని తగ్గించడం, ప్రభుత్వ ఖర్చును తగ్గించడం వంటి అనేక చర్యలను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే చేపట్టింది. ప్రభుత్వరంగ ప్రణాళిక అంతరవనరుల ఉత్పత్తికి తోడ్పడేటట్లు కేంద్రీయ ప్రభుత్వరంగ సంస్థలను పునర్నిర్మించడాన్ని కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఇదివరలో చేపట్టనట్లయితే ఇప్పుడు రాష్ర్టాలలో ఈ రకమైన చర్యలను చేపట్టవలసిందిగా నేను ముఖ్యమంత్రులకు విన్నవిస్తున్నాను. 

రాష్ర్టాలలోని ప్రభుత్వరంగ సంస్థలు సాధారణంగా ప్రభుత్వ ఖజానాకు ఏ విధమైన తోడ్పాటుచేయకపోగా, నష్టపరుస్తున్నాయి. ఈ సంస్థలు అందించే సౌకర్యాలకు సరైన ధర నిర్ణయించడం ద్వారా, వీటి కార్యక్రమాల్లో సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వీటిని ఆర్థికంగా తట్టుకొనేలా చేయడం అత్యంత ఆవశ్యకం. ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి ఇతర రంగాలలో లబ్ధిపొందేవారిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత నిర్ణయించడం ద్వారా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడమే కాకుండా ఈ సేవలు ఏ ప్రజానీకానికైతే అత్యంత అవసరమో వారికి చేరేటట్లు చేయవచ్చును.

ఆర్థిక, వాణిజ్య, విత్త రంగాల్లో ఈ మధ్య మొదలుపెట్టిన విధాన మార్పులు శుభారంభాన్ని సూచిస్తున్నాయి. ఈ మార్పులను కొనసాగిస్తూ, సంస్కరణలను త్వరితగతం చేయడం వల్ల 8వ ప్రణాళిక ఆచరణకు వాటినుంచి వచ్చే ప్రయోజనాలు ఉపయోగపడేలా చూడాలి. ధరల పెరుగుదలను అరికట్టేందుకు, చెల్లింపుల సమతుల్య పరిస్థితి మన వైపు మొగ్గుచూపేలా చేసేందుకుగాను ఈ సంస్కరణలతోపాటు ఆర్థి క, విత్త విధానాల అవసరం ఉంది. కేంద్రం గత రెండు వార్షిక బడ్జెట్లు ఈ గమ్యం వైపు పయనించినవి. రాష్ర్టాల్లో ఆర్థిక క్రమశిక్షణ, ధరల అదుపుకై ఇదేవిధమైన చర్యలు తీసుకోవలిసిందిగా ముఖ్యమంత్రులకు నా మనవి. 

పరిపూర్ణ ప్రయత్నంతో సాధించండి: ఒకవైపు విపణి యంత్రాంగం, రెండోవైపు ప్రణాళికపరమైన కార్యక్రమాలు కానీ ఈ రెంటిలో ఏదో ఒకటి అనే ప్రాతిపదిక అని సూచించే ప్రశ్నలు నా మనసులో లేవు. వికేంద్రీకరించిన నిర్మాణాన్ని అట్టడుగు నుంచి పైదాకా బలపరచడమెలా అనేది ప్రశ్న. ఈ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలను పాల్గొనేటట్లు చేయడం ఎలా? వివిధ రంగాల మధ్య పరస్పర సంబంధాలు నెలకొల్పే క్లిషమైన కార్యక్రమానికి విధానమేర్పరచడంలో పాత్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలెలా సాధిస్తాయనేది మననెదిరించే సవాలు. రాష్ట్ర ప్రభుత్వాలు, పంచాయతీరాజ్‌ సంస్థలు పరిపూర్ణ ప్రయత్నంతో దీనిని సాధించాలి.

పల్లెటూళ్ళలో ప్రాథమిక విద్య అందరికీ లభ్యం కావటం మొదలుపెట్టి ఉన్నత పాఠశాలల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంటే ఈ వేతన ఉద్యోగాలు ఒకస్థాయిని దాటి కొనసాగించలేము. యువకులు తమకు కూలీ కాకుండా వేరేరకం ఉద్యోగం కావాలని అడిగే రోజు వస్తుంది. నేను ఈనాడు కూలీ పనిచేస్తున్న తరం గురించి మాట్లాడటం లేదు. ఈ తరం వారు తమ వేతనాన్ని సంపాదిస్తూనే ఉంటారు. మనం వాళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. కానీ, రాబోయే తరం వారి తల్లిదండ్రుల వలె కూలీ వేతనంతో సంతృప్తిపడరనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 

అక్షరాస్యత ముఖ్యంగా స్త్రీలలో ఇప్పటికీ చాలా తక్కువ స్థాయిలో ఉంది.ఇంకా ఎక్కువగానే ఉన్న శిశు మరణాలు, తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఆందోళన కలుగజేస్తున్నాయి. పెరుగుతూనే ఉన్న విత్త, బడ్జెట్‌ లోట్లు,తీవ్రమైన చెల్లింపుల సమతుల్యం పరిస్థితి, ద్రవ్యోల్బణం, అంతేకాక ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించి దాన్ని శక్తిమంతంగా, అంతర్జాతీయ పోటీని తట్టుకునేవిధంగా చేయాల్సిన సత్వర ఆవశ్యకతవైపు కూడా  మనం దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నది. 


logo