గురువారం 22 అక్టోబర్ 2020
Editorial - Oct 17, 2020 , 23:39:41

ప్రతి శ్వాసా...ఓ వరమే!

ప్రతి శ్వాసా...ఓ వరమే!

సీ.‘క్షితిపతి! నీ ప్రశ్న సిద్ధంబు మంచిది యాత్మవేత్తలు మెత్తురఖిల శుభద మాకర్ణనీయంబు లయుత సంఖ్యలు గల వందు ముఖ్యంబిది యఖిల వరము గృహములలోపల గృహమేధులగు నరు లాత్మ తత్తము లేశమైన నెఱుగ రంగనారతుల నిద్రాసక్తి జనురాత్రి పోవు కుటుంబార్థ బుద్ధి నహము’ ఆ. ‘పశుకళత్ర పుత్త్ర బాంధన దేహాది సంఘమెల్ల దమకు సత్యమనుచు గాపురములు సేసి కడపట జత్తురు కనియు గానరంత్యకాల సరణి.’

నైమిశారణ్యంలో పురాణ వ్యాఖ్యాన పీఠం మీద విరాజిల్లుతున్న సూతముని శౌనకాది మహర్షులతో అన్నాడు- సాధక శిరోమణి అయిన పరీక్షిత్తు బోధక చూడామణి అయిన శుకమునికి ఆత్మనివేదన (శరణాగతి) గావిస్తూ- మహాత్మా! మరణశీలి అయిన మానవ మాతృని, అందునా మరణం ముంచుకొచ్చిన వాని ముఖ్యకర్తవ్యం ఏమిటో ఆనతివ్వండని అర్థించాడు. వాస్తవానికి మానవ జీవిత గమ్యానికి సంబంధించిన మౌలికమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు ఆనందించిన ఆచార్యుడు అంతేవాసి (శిష్యు)ని అభినందిస్తూ ఇలా అన్నాడు-

రాజా! మిక్కిలి సమంజసమైన సర్వోత్తమ ప్రశ్న అడిగావు. ఆత్మవేత్తలు దీనిని అన్ని విధాల అంగీకరించి అభినందిస్తారు. ఈ సత్సంగ సభలో ఆసీనులై ఉన్న బ్రహ్మవేత్తలందరికీ ఇది సమ్మతం. నీకేగాక లోకానికి కూడా ఇది సకల శుభాలు సమకూర్చేది. వేయేల, ఇది మోక్షహేతువు. విశ్వమానవాళికి వినదగిన విషయాలు వేనవేలుగా ఉన్నాయి. వానిలో నేను వివరించబోయేది అతి వరిష్ఠం. అందుకే అందరికీ వరణీయం (కోరతగినది) కూడా. 

సంసారంలో నిండా మునిగిన గృహస్థులకు కంసారి (కృష్ణ) తత్తం- ఆత్మత్తం కించిత్తు కూడా అవగతమయ్యే అవకాశం లేదు. రాత్రంతా రమణుల రతులతోను, నిద్రతోను గడిచిపోతోంది. పగలంతా కుటుంబ పోషణకై ధనసంపాదనతో సరిపోతోంది. ఇలా తెలియకుండానే ఆయుస్సు తరగిపోతోందని ముందుగా తెల్సుకోవాలి. ప్రతిక్షణం సద్వినియోగమయ్యే విధంగా చేసుకోవాలి. పాడిపశువులను, పెళ్లాం పిల్లలను వారికి అనుబంధంగా ఉన్న బంధువర్గాన్ని, ఈ బంధాలన్నిటికి మూలబంధమైన తన తనువును, మనువును... నిత్యము, సత్యమని నమ్మి కాపురాలు కొనసాగిస్తూ కడకు కన్నుమూసి కాటికి చేరుతున్నారు. ఈ కాపురుషులు (మూఢమానవులు) అంత్యకాల దుర్గతి (పశ్యన్నపి న పశ్యతి) ‘కనియు కానరు’- గమనిస్తూ కూడా గ్రహింపు లేకుండా గడియ-గడియ గడిపేస్తున్నారు. తనదనుకుని పట్టుకు కూర్చున్న ఈ పరివారమంతా కలసికట్టుగా కూడా అనివార్యమైన తన మరణాన్ని వారించలేదన్న వాస్తవాన్ని ఈ వింత మనిషి విస్మరిస్తున్నాడు. ఈ విస్మరణమే విషమరణం! నిజానికి ప్రతి వ్యక్తికి పరమార్థపరంగా సత్యజ్ఞానాలే తల్లిదండ్రులు. దయాధర్మాలే సఖా(మిత్ర)సోదరులు. శాంతి, క్షమాగుణాలే పత్నీపుత్రులు- (షడేతే మమబాంధవాః) ఈ ఆఱుగురే శాశ్వత బంధువులని శాస్త్రవచనం. చితిమంటలో తనువు ఆహుతి అయినా తన వెంటనంటి వచ్చే ఆత్మబంధువులు.

పై సీసం వ్యాసవిధేయంగా, మూలానుసారిగా సాగిన ముచ్చటైన పద్యం. పోతన మహాకవి అద్భుత యథాక్షరానువాద పాటవానికి ఇదొక మచ్చుతునక. మైకంలో జోగుతున్న లోకం కళ్లు తెరిపించే ‘కనియుగానరంత్యకాల సరణి’ అనే సూక్తి రూప ‘మహావాక్య’మే మణిపూసగా అమరిన అక్షర మౌక్తిక (ముత్యాల) మాలా విశేషం ఈ సీసం.

క. ‘కావున సర్వాత్మకుడు మ

హావిభవుడు విష్ణుడీశుడాకర్ణింపన్‌

సేవింపను వర్ణింపను

భావింపను భావ్యుడభవ భాజికి నధిపా.’

అందువలన రాజేంద్రా! పునర్జన్మ లేని కైవల్యపదవిని కోరేవానికి సర్వప్రాణులందూ ఆత్మరూపంగా అలరువాడు, మహావిభూతి వైభవంతో విరాజిల్లువాడు, విశ్వరూపుడు, విశ్వేశ్వరుడు, జిష్ణువు (జయశీలి) అయిన మహావిష్ణువే వినడానికి, వర్ణించడానికి యోగ్యుడు. భావించి సేవించడానికి భావ్యుడు- అర్హుడు. జ్ఞానమార్గంలోని శ్రవణ, మనన, నిధిధ్యాసలే భక్తిమార్గంలో శ్రవణ, కీర్తన, స్మరణలు. కథాశ్రవణం, గుణలీలా కీర్తనం, నామస్మరణం- నవవిధ భక్తి అనే భవ్య భవనానికి మూలస్తంభాలు, ముక్తికి నిధానాలు. ఈ మూడు పరస్పర పూరకాలు, నిర్వాహకాలు. కనుక, వీటినే చర్వితచర్వణంగా, మార్చిమార్చి చేస్తూ ఉండాలని తాత్పర్యం.

శ్లో. ‘ఏతావాన్‌ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మపరినిష్ఠయా, జన్మలాభః పరః పుంసా మంతే నారాయణ స్మృతిః’

ఆ. ‘జనులకెల్ల శుభము సాంఖ్యయోగము దాని

వలన ధర్మనిష్ఠ వలన నయిన

నంత్యకాలమందు హరిచింత సేయుట

పుట్టువులకు ఫలము భూవరేంద్రా!‘

యోగీంద్రుడు త్యాగీంద్రునితో అంటున్నాడు- ఓ నృపేంద్రా! సాంఖ్యయోగం సర్వజనులకు శ్రేయస్సు(ముక్తి) కల్గించేది. ఆ సాంఖ్యం వలనగాని, స్వధర్మానుష్ఠాన రూప కర్మయోగం చేతగాని అంత్యకాలంలో- అంతిమక్షణంలో ఆదిదేవుడు, అనంతుడు అయిన అచ్యుతుని- శ్రీహరిని స్మరిస్తూ దేహం వదలాలి. ‘ఏతావానేవ జన్మనఃలాభః’- అంతిమ జన్మకు ఇంతకుమించిన మరో మంచి ఫలం లేదు.

మూలంలో ‘సాంఖ్యయోగాభ్యాం స్వధర్మపరినిష్ఠయా’ అని ఉంది. సాంఖ్యమనగా ఆత్మ- అనాత్మ వివేకం. యోగమంటే పతంజలి ప్రవచించిన యమ, నియమాది అష్టాంగ యోగం. స్వధర్మపరినిష్ఠ అనగా విహితకర్మాచరణ. పోతన్న ఎందుకో పాతంజలాన్ని పరిహరించి జ్ఞాన, కర్మయోగాలనే పరిగ్రహించాడు. గీత కూడా ‘లోకేస్మిన్‌ ద్వివిధా నిష్ఠా’ అంటూ ఈ రెంటినే ఉపదేశించింది. భగవద్గీత ఎలా జీవించాలో తెలియచెప్పగా భాగవతం ఎలా మరణించాలో తేటపరిచిందని పెద్దలమాట. ‘జంతూనాం నరజన్మ దుర్లభం’- దుర్లభమైన నరజన్మకు లక్ష్యమేమిటి? ‘చదివి చదివి చదివి చావంగనేటికి? చావులేని చదువు చదువ వలయు’ అన్న న్యాయాన చక్కని చావు చావడమే లక్ష్యం. ఆహా! చావుకు కూడా చక్కదనమా? అంటే, మరల పుట్టకుండా చేసేదే చక్కని చావు. అయితే ‘అనాయాసేన మరణం’ అంటారే, అదేనా? అంటే అదికాదు. 

ఇప్పటికి అనాయాసంగా మరణించినా మరల ఆయాసంతో కూడిన జన్మ ఉండనే ఉన్నది కదా! కనుక, అనాయాస మరణమంటే ‘దేహాంతే తవసాయుజ్యం’ అనగా జన్మరాహిత్యం పొందడమని అర్థం. మరణశీలుడైన మనిషికి అదెలా సాధ్యం? ఇదే భాగవత సంహిత బోధించే హితం! ‘సమ్యక్‌ హితం యావదతి’- మంచి హితం పలికేదేగా సంహిత అంటే. ఏమిటా హితం? ‘అంత్యకాలమందు హరిచింత సేయుట’- అంతిమక్షణంలో అచ్యుతస్మరణం! ఓహో! ఇంతేగదా, ఎంత సులభం! అయినా దానికింకా చాలా సమయం ఉందిగా అని ఏమరపాటు చెందుతాడు పామరజనుడు. అంత్యకాలమంటే? అది ఎప్పుడో ఎవరికైనా ఎఱుకా? ఉత్తర క్షణ (తరువాతి క్షణం) నాదేనని వాదించగల దక్షిణామూర్తి (దక్షతగలవాడు) ఇంతవరకు పుడమి (భూమి) మీద పుట్టలేదు. అంత్యకాలమంటే ఎప్పుడో కాదు, బయటకు పోయే ప్రతి శ్వాస అంత్యకాలమే! ప్రతిక్షణం వస్తూ పోతూ ఉండే శ్వాస మీదా ఆశ? నట్టేట ముంచదా? తెరచి ఉన్న నవరంథ్రాల నరదేహమనే పంజరంలో ప్రాణమనే పక్షి తుర్రుమంటూ ఎగిరిపోవడం ఆశ్చర్యమా? తిష్ఠ వేసుకొని నిష్ఠగా నిలచి ఉండడం ఆశ్చమా? కనుక, నిత్యం నిరంతరం నామస్మరణం అభ్యసించాలి- ‘తస్మాత్‌ సర్వేషు కాలేషు మానుస్మర యుధ్య చ’ కర్తవ్య కర్మను కూడా ఆచరించాలి. ఈ అభ్యాస పాటవంతోనే అంతిమక్షణంలో కూడా అనంతుని స్మరణ సాధ్యమవుతుంది. మనిషి మనసులో నిరంతరం దేన్ని స్మరిస్తాడో దానిలోనే తన్మయుడవుతాడు. ‘భ్రమరకీట’ న్యాయరీత్యా- దానివలెనే రూపొందుతాడు. ఇది సనాతన రహస్యమని శాట్యాయనీయ ఉపనిషద్వాణి.

జింకపిల్లను స్మరిస్తూ మరణించిన భరతచక్రవర్తి జింకగా జన్మించాడు. పత్నీస్మరణ చేస్తూ ప్రాణం విడిచిన పురంజన ప్రభువు పురంధ్రి (స్త్రీ)గా పుట్టాడు. సర్వ ఉపనిషత్తుల సారమైన గీతలో కూడా పరమాత్మ పార్థునికి- ‘మనుష్యుడు అవసానదశలో ఏఏ భావాలను స్మరిస్తూ మరణిస్తాడో, మఱుజన్మలో ఆయాస్వరూపాలనే పొందుతాడు. ఇలా, అంత్యకాల భావనే దేహాంతరప్రాప్తికి కారణం కనుక, సర్వకాలసర్వావస్థలలో- ‘మామనుస్మర యుధ్యచ‘- నన్నే స్మరిస్తూ స్వధర్మాన్ని ఆచరిస్తూ మరణించిన నన్నే పొందగలవు. అందేమాత్రం సందేహం లేదు’ అని ఉద్బోధించాడు. అయితే, జీవితాంతం నామస్మరణ చేసి అంత్యకాలంలో ప్రారబ్ధ ప్రాబల్యం వలన మనసు పడిపోగా భగవత్‌స్మరణకు నోచుకోని మందభాగ్యుల గతి ఏమిటి? అంటే, అట్టివారి బదులు తానే స్మరించి వారిని తనలో చేర్చుకుంటానని పరమాత్మ ప్రతిజ్ఞాపూర్వక అభయప్రదానం చేశాడు- ‘అహంస్మరామిమద్భక్తం నయామి పరమాంగతిమ్‌'. అలా చెయ్యకపోతే నాకంటే కృతఘ్నుడు ఉంటాడా అని వాసుదేవ భగవానుడు వాపోయాడు కూడా!

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ

98668 36006 


logo