గురువారం 22 అక్టోబర్ 2020
Editorial - Oct 17, 2020 , 23:39:41

వందేళ్లనాటి వరద పద్యం!

వందేళ్లనాటి వరద పద్యం!

హైదరాబాద్‌ నగరం ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ‘వానముప్పు’నకు గురైంది. ప్రజల జీవితాలను ఈ వరద బురదలో ముంచేసింది. సరిగ్గా ఇలాంటి వరదలే ఈ నగరాన్ని వందేళ్ల క్రితం చుట్టుముట్టాయి. 18-10-1908 నాటి వానలు నాటి భాగ్యనగరాన్ని ఎలా ధ్వంసం చేసాయో సికింద్రాబాద్‌ రెజిమెంట్‌ బజార్‌ నివాసి ‘తొడుపునూరి కొండయ్య’ రికార్డు చేసాడు. ‘హైదరాబాద జలప్రళయ సీసమాలిక’ పేరుతో సీసపద్యాలు రాసి ‘చీకోటి వీరన్న అండ్‌ సన్స్‌' వారు నడిపే ‘దక్కన్‌ సుబోధ ముద్రాక్షరశాల’లో ముద్రించాడు. 64 పాదాలతో, చివర ఒక తేటగీతి పద్యంతో సాగిన ఈ సీసమాలిక నాటి వరదలను కండ్లకు కట్టింది. 

“శ్రీలతో విరివిగా నోలలాడుచునుండు

హైదరాబాదున కమితమైన

యాపదనొందినదది యెట్టులనగ శ్రీ

పర్జన్యు పురిగొల్ప ప్రబలముగను

యుత్తరాంతము హస్తయుదయంబునగు

కార్తెకు మధ్య మేఘముల లావుమెరసి

పుడమిపై ధారగానడి మీర గురిసిన

కతమున జీవనంబక్లేశగాంచి...”

అని నాటి వరద బీభత్స వర్ణనతో మొదలుపెడతాడు. ఆరోజు కూడా నగరానికి పశ్చిమదిశలో ఉన్న చెరువులు తెగడం నగరానికి ప్రమాదకరంగా మారిపోయింది.

‘పశ్చిమిదిశయందు బలమైన చెఱువులు

తెగి ప్రవహించగా దిశలనుండి

బారిన నీరెల్ల బహుగాను ముచికుంద

నదిలోన గలయ పూర్ణప్రవాహమైన

దిరుప్రక్కలైన స్థలంబెల్ల నిండిన

సంగము నుండి దండిగాను”

“... మనుజులందరి గుండె ఝల్లుఝల్లున నీరు పల్లవించి” అంటూ ఆ రోజు కురిసిన వర్షం మనుషుల్ని ఎలా భయభ్రాంతులకు గురిచేసిందో చెప్తున్నాడు. ఇప్పటి వర్షం కూడా అదే ఘటనను తలపించింది.

“చద్రఘాట్‌ వంతెన చెదిరికూలెను కొంత

వంతగల్గిన వారలంతగూడి

నచ్చటచ్చల జారి హెచ్చుగా విలపించి

పోయినవారల పొంకమెంచి”

వంతెనలు కూలడం, జనం మరణించడం కూడా ఆనాడు సంభవించింది.

“కోటదరువాజుగా వాటమౌనగరిలో

గొల్ల ఖిడికీ వీధి కొంతగాను

మొప్పగా నగరికినుత్తర దిశకోట

బైటనుండె ధూలుపేట మొదలు”

ఎక్కడెక్కడి బజార్లు నగరంలో దెబ్బతిన్నాయో కొండయ్య చెప్పుకొచ్చాడు. ఛత్తబజారు, చుడిబజారు, పత్తర్‌ఘట్టి, బేగంబజారు, చౌరాయిఛిల్లా, ముక్త్యారుగంజ్‌, మహరాజ్‌ గంజ్‌, ఫీల్కాన... వంటి అనేక ప్రాంతాలను కవి పేర్కొన్నాడు.

‘ధాన్యరాశులు మిగులదడసినాకాశనమయ్యె

సరుకులెన్నో చాల వరదగలసె

మన్నుమిద్దెలు మేడలన్నింటిపై బారి

యుద్యానవనములునుచితమైన

... శవములుండిన చోట సరుగున వీక్షించి

‘మావారు’కారని మరలువారు

మనవారు వచ్చిరో మరినెటుకేగిరో

యనుచు దిక్కులనెల్ల గనెడువాడు”

ఇవన్నీ ఆనాటి హైదరాబాద్‌ నగర వరద దృశ్యాలు. ఈ  వరదకూ- ఆ వరదకూ పెద్ద తేడా కనిపించడం లేదు. ఇంచుమించు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇపుడు ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేసిందో... ఆనాడూ ఆరవ నిజాం మహబూబ్‌ ఆలీఖాన్‌ ఎలా స్పందించాడో కూడా చెప్పుకొచ్చాడు.

“ఆలీ బహుచింతనొంది

దాడెందమందున ధైర్యమొంది

సరగ యేనుగులను బంపినెంతో ప్రియంబుగా

చెట్లపై బంగ్లాల చేరియున్న

... రప్పించి బలుమంచి తావుల

నుండ జేయించియుయుచితమొప్ప

భోజనాదుల మిగులపొందుగా బెట్టించి

సామానులిప్పించి సరసమొప్ప”

నాటి వరదల నుంచి రక్షించుకునేందుకు ఉస్మానియా  ఆసుపత్రిలోని ఓ చింతచెట్టును ఎక్కి నూరుమందికి పైగా తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ చెట్టు ఇప్పటికీ ఉంది. ఆ సందర్భాన్ని కూడా కొందయ్య నమోదు చేశారు. ఆ చింతచెట్టు దగ్గర ఆనాటి మూసి వరదల శిలాఫలకం ఉండటం గమనించవచ్చు. ఆనాటి జలప్రళయం ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టిందో ఇప్పుడూ అలాంటి పరిస్థితి భాగ్యనగరానికి వచ్చింది. ఇపుడు అందరం మానవత్వంతో స్పందిద్దాం.

ఈ ‘జలప్రళయ సీసమాలిక’ను గుర్తుచేసుకోవాల్సిన సందర్భం రావడం కూడా దురదృష్టమే!

- పి భాస్కరయోగి  ([email protected])


logo