గురువారం 22 అక్టోబర్ 2020
Editorial - Oct 17, 2020 , 23:39:41

మహా సామ్రాజ్యపు ఆనవాలు...

మహా సామ్రాజ్యపు ఆనవాలు...

శాతవాహన రాజ్య పతనానంతరం ఆంధ్రదేశం మొత్తానికి ఏకచ్ఛత్రాధిపత్యం వహించి పరిపాలించిన వారిలో విష్ణుకుండినులు ముఖ్యులు. సుమారు 270 సంవత్సరాలు పరిపాలించిన ఈ రాజులు శాసనాలలో దక్షిణాపథపతి, శ్రీపర్వత స్వామి పాదానుధ్యాత, త్రికూట మలయాధిపతి అనే బిరుదులతో పిలువబడ్డారు. వీళ్లు మొదట అమరాబాదు (మహబూబ్‌నగర్‌) ప్రాంత పాలకులుగా ఉండి రాజ్య విస్తరణలో నిమగ్నులై, కాలక్రమంలో ఇంద్రపురి రాజధానిగా పరిపాలించారు. ఆ తరువాత అమరావతి, బెజవాడలు రాజధానులుగా పరిపాలించారు.

నల్లగొండ జిల్లా రామన్నపేట తాలూకాలోని తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం)లో లభించిన రెండు తామ్ర శాసనాల ఆధారంగా విష్ణుకుండినులు మొదట బౌద్ధమతావలంబకులని, ఆ తర్వాత వైదికమతాన్ని ఆచరించినారని  స్పష్టమవుతున్నది. ఈ తామ్రశాసనాల వల్ల విష్ణుకుండినుల వంశక్రమం తెలియడంతోపాటు వారి శౌర్య ప్రతాపాలు, దైవభక్తి, పరిపాలనా దక్షత వెల్లడవుతున్నాయి. ఈ రెండు శాసనాల వివరాలు...

గోవిందవర్మ ఇంద్రపాల నగర తామ్ర శాసనం

గోవిందవర్మ తన 37వ రాజ్య సంవత్సరంలో (క్రీ.శ. 434) వైశాఖశుద్ధ పౌర్ణమినాడు, తన పట్ట మహిషి పరమమహాదేవి పేర నిర్మితమైన పరమమహాదేవి విహారానికి ఎన్మందల, పేణ్కపర గ్రామాలను దశబలబలి అనే బౌద్ధ పండితుడికి దానమిచ్చి శాసనం వేయించాడు. దశబలబలి గొప్ప పండితుడు. ఇతడు శాసనంలో చతుర్వైశారద్య విశారదుడు, ప్రాణకోటిని ఉద్ధరించడానికి పుణ్య జ్ఞాన సంభారం కలవాడు, బుద్ధితో తెలుసుకోదగిన జ్ఞానాన్నంతా తెలుసుకొన్న విజ్ఞాని అని పేర్కొనబడినాడు.

అదే విధంగా పరమమహాదేవి కట్టించిన బౌద్ధవిహారాన్ని కూడా ప్రశంసించారు. ఈ క్షేత్రం నిర్విరాగ శీల శిక్షాధృతములు మొదలైన గుణాలను అధ్యయనం చేయడానికి, శ్రవణ, చింతన, కీర్తన, భావన, ధ్యాన, సమాధి, సమాపత్తి మొదలైన గుణగణాలతో కూడింది, తల్లిదండ్రుల ఋణాన్ని తీర్చేది, సర్వ ప్రాణులను రక్షించేది, సర్వ విధాలైన దరిద్రాలను, దుఃఖాలను ఉపశమింపచేసేది అని చెప్పబడింది. అలాంటి బౌద్ధ విహారానికి దీప, ధూప, గంధ, పుష్ప, ధ్వజ, పాన, భోజన, శయన, ఆసన, గ్రాస, భైషజ్య, ఖణ్డస్ఫుటిత, శీర్ణ సంస్కారాదుల నిమిత్తం, ద్వావేమదాల, పేణ్కపర గ్రామాలు నిధులు, ఉపనిధులను ధారాపూర్వకంగా దానం చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తున్నది.

విక్రమేంద్ర భట్టారకవర్మ ఇంద్రపాల నగర తామ్రశాసనం

గోవిందవర్మకు నాల్గవ తరం వాడైన విక్రమేంద్ర భట్టారకవర్మ క్రీ.శ. 566లో పరమ మహాదేవి విహారానికి ‘ఇరుండెరో’ అనే గ్రామాన్ని దానంగా ఇచ్చి శాసనం వేయించాడు. పల్లవులకు విష్ణుకుండినులకు చిరకాల వైరం ఉన్నది. పల్లవ సింహవర్మ అధిక సైన్యంతో ఆంధ్రదేశ భూభాగాలపైకి దండెత్తాడు. ఆ సమయంలో విక్రమేంద్ర భట్టారకవర్మ సామంతరాజైన పృథ్వీమూలరాజు సహకారంతో పల్లవ సేనలను, సింహవర్మను ఓడించి విజయం సాధించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మూలరాజు ప్రోత్సాహంతో తన పూర్వికులు నిర్మించిన మహాదేవి విహారానికి ‘ఇరుండెరో’ గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. విక్రమేంద్ర భట్టారకవర్మ 11వ రాజ్య సంవత్సరం కార్తీక మాస కృష్ణపక్ష అష్టమినాడు పరమ మహా విహారానికి నాలుగు దిక్కుల ఉన్న పూజింపదగిన భిక్షు సంఘాల పరిభోగార్థం ఇవ్వబడింది.

ఈ రెండు శాసనాల ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఇంతపెద్ద సామ్రాజ్యం ప్రారంభమై, ఇంద్రపురి రాజధానిగా ఉందన్న విషయం తెలుస్తుంది. విష్ణుకుండిన సామ్రాజ్యం అత్యంత వైభవోపేతంగా వెలుగొంది సుమారు 12 మంది రాజులు 270 సంవత్సరాలు మొత్తం ఆంధ్రదేశాన్ని పరిపాలించారు.

- డా. భిన్నూరి మనోహరి, 9347971177


logo