పటిమలేని నాయకత్వం

ఏది నాసిరకం, ఏది నాసిరకం కాదు అన్న మీమాంస అనవసరం. అది దైనందిన పరిపాలనలో, ప్రజల అనుభవాలలోస్పష్టమవుతున్నది. నిర్వచనాలు, వివరణల కంటె ముఖ్యం ఉదాహరణలు. ఈ రోజు దేశంలో అత్యుత్తమ పాలనకు అన్నిటికంటె మించిన ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం. కరోనా కష్టాలను, నష్టాలను ఎదుర్కోవలసి వచ్చినా తెలంగాణ రాష్ట్రం వెనుకంజ వేయలేదు, తలవొగ్గలేదు. ప్రజారంజక పాలనను యథాతథంగా కొనసాగిస్తూ నిరంతర అభివృద్ధి కార్యక్రమాలకు, నిరాటంక, నిర్విఘ్న సంక్షేమ పథకాలకు ఎప్పటివలెనె ప్రాధాన్యం ఇచ్చింది.
ఆసఫ్జాహీ రాచరిక వ్యవస్థ, బ్రిటిష్ పాలన అవశేషంగా మిగిలిన, అనేక అక్రమాలకు మూల కారణమవుతున్న రెవె న్యూ చట్టాన్ని అభ్యుదయ సాధనంగా రూపొంది స్తూ, ప్రజాస్వామ్య పరిధిలో కేసీఆర్ ప్రభుత్వం కీలకమైన సవరణలు, మార్పులు చేసినప్పుడు శాసనసభలో, బయట వ్యతిరేకత, నిరసన, విమర్శలు ఏవీ వ్యక్తం కాలేదు. కేసీఆర్ అపూర్వ విజ్ఞత ఫలితంగా మారుతున్న రెవెన్యూ చట్టాన్ని తెలంగాణ జ నావళి గుండె విప్పి ఆహ్వానించింది. తన హర్షామోదాలను ప్రకటించింది. ఉజ్వల భవిష్యత్తుకు, వ్యవసాయ విప్లవానికి ద్వారాలు తెరుచుకుంటున్నాయని రాష్ట్ర ప్రజలు సంబురాలు జరుపుకొన్నారు.
ఇక్కడ రెవెన్యూ చట్టంలో సంస్కరణలు జరుగుతున్నప్పుడు అక్కడ ఢిల్లీలో మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులను బయటికి నెట్టి వ్యవసాయం బిల్లులకు, లేబర్ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయిచింది. దేశమంతటా ఈ బిల్లులకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన ప్రకటితమైంది. ఈ నిరసనకు పరాకాష్ఠ అన్నట్లు బీజేపీ పాలక కూటమి నుంచి సీనియర్ భాగస్వామి శిరోమణి అకాలీదళ్ బైబై చెప్పి బయటకు వచ్చింది. ఇదివరకే శివసేన బీజేపీ బంధనాలు తెంచుకొని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నది. కంగనా హంగామాతో శివసేనను తిప్పలు పెట్టే దుస్థితికి బీజేపీ దిగజారింది. ముప్ఫై ఏండ్ల కిందట దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి పీవీ ఆర్థిక సంస్కరణలతో మూల ఆర్థిక సిద్ధాంతాలను, విధానాలను మార్చినప్పుడు దేశ ప్రజలు ఆనందించారు గాని ఆందోళనకు గురి కాలేదు.
మోదీజీ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దేశ ప్రజలు ఉద్రిక్తతకు, ఆందోళనకు గురవుతున్నారు-విమర్శల అగ్గి రగుల్కొంటున్నది. మోదీజీ ప్రభుత్వం నోట్లను రద్దు చేసినప్పుడు, ‘ఒకే దేశం ఒకే పన్ను’ నినాదంతో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు, పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చినప్పుడు, ఇటీవల వ్యవసాయ బిల్లులను, లేబర్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు దేశమంతటా నిరసన జ్వాలలు రగుల్కొని ప్రతిఘటన ఉద్యమాలు చెలరేగాయి. ఉద్దేశాలు సరైనవైనప్పుడు ఉద్యమాల అవసరం ఏర్పడదు. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం చర్యల పట్ల నిరసనగా ఉద్యమాలు చెలరేగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. మరోవంక ఇదే ఆరేండ్లలో కేసీఆర్ ప్రభుత్వ చర్యల పట్ల ప్రజామోదం వెల్లువగా ప్రవహించని రోజు లేదంటే అత్యుక్తి కాదు.
ఈ మధ్య ప్రధాని మోదీజీ ఐరాసకు ఒక వీడియో సందేశం ఇచ్చారు. భారత్‌లోని 135 కోట్ల మంది ప్రజలకు అంతర్జాతీయస్థాయిలో తగిన గుర్తింపు లభించడం లేదన్నది ఆయన ఆవేదన తాత్పర్యం. జనాభా దృష్ట్యా ఒక దేశానికి అంతర్జాతీయ ప్రాధాన్యం లభించాలంటే మనదేశం కంటె ముందు కమ్యూనిస్టు చైనా వచ్చి నిలుస్తుంది. యూఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఇటలీ, సింగపూర్ వంటివి జనాభా చాలా తక్కువగా ఉన్న దేశాలైనప్పటికీ అంతర్జాతీయస్థాయిలో ప్రాముఖ్యం పొందుతున్నాయి.
73 ఏండ్ల కిందట స్వాతంత్య్రం లభించినప్పుడు భారత్ జనాభా కేవలం 33 కోట్లే! అప్పుడు 33 కోట్ల భారతదేశం అంతర్జాతీయ రంగంలో పొందిన విలువ, గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యం ఇప్పటి 135 కోట్ల భారతదేశం పొందడం లేదు. ఎందువల్ల? అప్పుడు జవహర్లాల్ నాయకత్వంలో దేశం ఉండగా సోవియట్ యూనియన్ అధినేతలు కృశ్చేవ్, బుల్గానిన్ స్వయంగా ఈ దేశం వచ్చి జమ్ము కాశ్మీర్ భారత్ అంతర్భాగమని ప్రకటించారు. ఈ రోజు ఎందరు, ఎవరు ఆ విధంగా ప్రకటించగలుగుతున్నారు? అప్పుడు దేశానికి నేతృత్వం వహించింది బ్రిటిష్ పాలనలో పదకొండేండ్లు జైలు శిక్షలు అనుభవించిన స్వాతంత్య్ర సమర సేనాని, అక్షరాల గాంధేయవాది, సచ్చాసమాజ్వాది, నిక్కమైన ప్రజాతంత్ర వాది జవహర్లాల్-ఆయన నాయకత్వం నాసిరకం కాదు, ఇదీ తేడా. ఈ మధ్య మోదీజీ శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్షతో మాట్లాడినారు. శ్రీలంకలో అల్పసంఖ్యాక వర్గానికి (అక్కడి తమిళులకు) రక్షణ కల్పించాలని మోదీజీ శ్రీలంక ప్రధానికి సలహా ఇచ్చారు. ‘మీ దేశంలో మీరు ఏం చేస్తున్నారు?’ అని మహింద ప్రశ్నిస్తే మోదీజీ ఏమంటారు?
గాంధీజీ 150వ జయంతి సందర్భాన ఎన్నో కార్యక్రమాలు అమలుచేయబోతున్నామని మోదీ జీ ప్రభుత్వం ఏడాది కిందట ప్రకటించింది. ఈ ఏడాది కాలంలో ఏం చేశారో తెలియదు. ప్రముఖ తెలుగు సంపాదకుడు ఒకాయన ‘నువు గాంధేయ జర్నలిస్టువు’ అని అన్నారు. నేను ఉబ్బిపోలేదు. ఒక ప్రముఖ తెలుగు వారపత్రికలో ఆరేండ్లు నేను ప్రతివారం ‘గాంధీశకం’ నిరంతరంగా రాసినప్పు డు (అదంతా ఒక వేయి పేజీల గ్రంథమవుతుంది) ఎందరో పెద్దలు అభినందించారు. నేను పొంగిపోలేదు, కండ్లు పైకి పోలేదు. ఈ వేయి పేజీల గ్రంథం ప్రచురణకు (ముద్రణకు) రూ.5 లక్షల సహాయం కోసం వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాను. ఈ సహాయం అందించే ఆర్థిక స్తోమత రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సమాధానం వచ్చింది. శ్రీమంతుడినైతే నేనే రాష్ట్ర ప్రభుత్వానికి సహాయపడేవాడిని కదా అని ఫీలయ్యాను. ఏడాది కిందట హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ సారస్వత సంస్థ గాంధీజీపై ఒక చిన్న పుస్తకం రాసివ్వమని కోరింది. సంతోషంతో రాసిచ్చాను. పుస్తకం ఆవిష్కరణ హైదరాబాద్‌లో ఒక విద్యార్థుల సభలో జరిగింది. ఆ రోజు నా ఆనందం అర్ణవమైంది. నిజంగా ఈ యువతరానికి గాంధీజీ సందేశం అందాలనుకున్నా ను. అన్నివైపులా కంచు కాగడా పట్టి వెతికాను. గాంధీజీ స్ఫూర్తి తో వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి కోసం వ్యావసాయిక విప్లవానికి, గ్రామీణ వికాసానికి ప్రాధా న్యం ఇస్తూ. ఎట్టకేలకు ఆ మహనీయు డు కనిపించారు. ఆయనెవరో మీకు తెలుసు.
దేవులపల్లి ప్రభాకరరావు
తాజావార్తలు
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అల్లం నారాయణ కృతజ్ఞతలు
- గోల్కొండ కోటకు కొత్త సోయగం.. సౌండ్ అండ్ లైట్ షో
- రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్
- ఎడ్లబండ్లపై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు..
- బెంగాల్ పోరు : నందిగ్రాం బరిలో దీదీపై సువేందు అధికారి పోటీ!
- వాణీదేవి గెలుపే లక్ష్యంగా డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం
- అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ పనితీరుపై సమీక్ష
- పైలట్‌పై పిల్లి దాడి.. విమానం అత్యవసర లాండింగ్
- ఇంజినీరింగ్ విద్యార్థులకు భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలు అవసరం: వెంకయ్యనాయుడు
- ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానని ముఖాన్నే మార్చేసుకున్నాడు