వన్య-ప్రాణి పునరుజ్జీవనం

ఉమ్మడి రాష్ట్రంలో దట్టమైన అడవులు కబ్జాల ధాటికి కనుమరుగయ్యాయి. వట వృక్షాలు నేలకొరిగాయి. అభయారణ్యాలు స్మగ్లర్ల ధాటికి భయారణ్యాలుగా మారిపోయాయి. జీవ వైవిధ్యం చెదిరిపోయింది. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. అడవుల పునరుద్ధరణతో ఇప్పుడు పర్యావరణ సమతుల్యత ఏర్పడుతున్నది. వన్య మృగాలకు రక్షణ పెరిగింది. పెద్ద పులులు తెలంగాణ వలసబాట పట్టాయి. ఒకనాడు నిలువ నీడనీయని తెలంగాణ వాటి సురక్షిత స్థావరంగా మారాయి. ఇక కనిపించవేమోనన్న తీరులో అంతరించిన అడవి దున్నలు, తోడేళ్లు తమ సంతతిని పెంచుకుంటున్నాయి. ‘వానలు వాపసు రావాలి.. కోతులు వాపసు పోవాలి’, ‘జంగల్ బచావో.. జంగల్ బడావో ’ అని దూరదృష్టితో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం, అడవుల పునరుద్ధరణతో పచ్చదనం పరిఢవిల్లింది. తగిన ఆవాసాలు లేక అల్లాడిన వన్య ప్రాణులకు తెలంగాణ అడవులు నిలువ నీడనిస్తున్నాయి. బతుకు భరోసానిస్తున్నాయి. అభయారణ్యాలు భయం లేదని వన జంతువులకు అభయమిస్తున్నాయి.
జీవావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతిని మనిషి ఉనికికి కూడా ప్రమాదం సంభవించే విపత్కర పరిస్థితుల్లో 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ (వన్యప్రాణి సంరక్షణ చట్టం) అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రతి అక్టోబర్ మొదటివారంలో 2 నుంచి 8 వరకు దేశమంతటా వన్యప్రాణి వారోత్సవాలు జరుపుతారు. ఈ సారి ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం వన్య ప్రాణి ఉత్స వం జరుపుతున్నది. ‘వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్' స్మగ్లర్ల ఆగడాలను కొంత కట్టడి చేసింది. కానీ చట్టానికి బలమైన కోరలు లేకపోవడం సమస్యగా మారింది. వన్యప్రాణుల కోసం ప్రత్యేక రక్షిత ప్రాంతాలు ఏర్పాటుచేసినా అందులోనూ రక్షణ అంతంత మాత్రమే. అభయారణ్యాలు వన్య ప్రాణులకు ఆశించిన అభయాన్ని ఇవ్వలేకపోతున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 336 వన్యప్రాణుల అభయారణ్యాలున్నాయి. తెలంగాణ మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,14,367 చదరపు కిలోమీటర్లు కాగా అందులో అటవీ విస్తీర్ణం దాదాపు 28,809 చదరపు కిలోమీటర్లు. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 25.19 శాతం వరకు అటవీ భూములుండగా అందులో వన్యప్రాణి రక్షిత ప్రాంతాలు 5,694 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. అభయారణ్యాలు మొత్తం అటవీ విస్తీర్ణంలో 19.76 శాతంగా ఉన్నాయి. జాతీయస్థాయిలో అటవీ భూము లు 23 శాతంగా ఉండగా, తెలంగాణలో అది 25 శాతంగా ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. క్షేత్రస్థాయిలో అసలైన అడవులు 11 శాతం లోపే ఉన్నాయి. మిగతావి కబ్జాలకు గురయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టగానే కేసీఆర్ యుద్ధప్రాతిపదికన పరిస్థితిని సమీక్షించి తెలంగాణకు ‘హరితహారం, జంగల్ బచావో.. జంగల్ బడావో’ కార్యక్రమాలు చేపట్టారు. దీంతో పర్యావరణపరంగా చాలా వేగంగా సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోతులను కట్టడి చేయడం కాదు ముందు మనుషులు చెదరగొట్టిన వాటి ఆవాసాలను పునరుద్ధరించాలి. ప్రకృతిని గౌరవించి అడవులను పెంచాలి. ప్రకృతికి, వన్యప్రాణులకు, మనుషులకు మధ్య తెగిన గొలుసుకట్టు బంధాన్ని పునరుద్ధరించాలి. అప్పుడైతే కోతులు తమ ఆహారాన్ని వెతుక్కుంటూ జనావాసాలను వదిలి అడవులకు తరలిపోతాయి. గతంలో మాదిరిగా పుష్కలంగా వానలు కురుస్తాయి అన్న తీరులో పాలనా యంత్రాంగాన్ని కార్యోన్ముఖులను చేశారు. ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి.
మోడువారిన అడవుల పునరుద్ధరణ కోసం చేపట్టిన ఫారెస్ట్ రిజువెనేషన్ కార్యక్రమంతో అటవీ సంపద పెరుగుతున్నది. బీడు వారిన భూములు మళ్లీ పచ్చబడుతున్నాయి. తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద అటవీశాఖ చేపట్టిన ‘రిజువెనేషన్ ఆఫ్ డీగ్రేడెడ్ ఫారెస్ట్' కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఇప్పటికే 2.64 లక్షల హెక్టార్లలో అడవులకు జీవం పోసి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. వచ్చే ఐదేండ్లలో 10 లక్షల హెక్టార్ల క్షీణించిన అటవీ భూములలో దట్టమైన అడవుల పెంపకానికి బృహత్తర ప్రణాళికను రూపొందించారు. మన రాష్ట్రంలో కనుమరుగయ్యాయనుకున్న వన్యమృగాలు తిరిగి వలస వస్తున్నాయి. అంతరించిపోతాయనుకున్న వన్యప్రాణులు మళ్లీ ఊపిరి పోసుకుంటున్నాయి.
మ్యాడం మధుసూదన్
తాజావార్తలు
- నీవి ఎల్లప్పుడూ సాస్తీ వ్యాఖ్యలే: తాప్సీపై కంగన ఫైర్
- అక్షర్.. ఆ సన్‌గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు