గురువారం 04 మార్చి 2021
Editorial - Oct 05, 2020 , 23:52:59

విజ్ఞతలేని విమర్శలు

విజ్ఞతలేని విమర్శలు

రాజు గారి గుర్రం రానురాను గాడిద అయ్యిందని సామెత. బీజేపీ రాష్ట్ర విభాగం పరిస్థితి ఇదేవిధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న చౌకబారు విమర్శలు ఆ పార్టీని మరింత దిగజారుస్తున్నాయి. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నది. కనుక రాష్ర్టానికి లబ్ధి చేకూర్చే పనులు అనేకం చేయవచ్చు. కానీ తమ బాధ్యతను విస్మరించి అర్థంపర్థం లేని ఆరోపణలు చేయ డం వల్ల ఫలితం ఏముంటుంది? కాంగ్రెస్‌ బలహీనంగా ఉండి, ఆ పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్న నేపథ్యంలో ఆ స్థానంలోకి తాము రావచ్చుననే ఆశ బీజేపీ నేతలకు పుట్టి ఉండవచ్చు. కానీ అం దుకోసం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తేనే ప్రజలు మెచ్చుకుంటారు. కాంగ్రెస్‌ ఏ విధంగా భ్రష్టుపట్టి పోయిందో కండ్లా రా చూసి కూడా మళ్ళా ఆ నాయకుల మాదిరిగానే వ్యవహరించడం వల్ల బీజేపీ నేతలు అభాసుపాలవుతున్నారే తప్ప వారికి ఒరిగేదేమీ లేదు. 

తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి కారణాల్లో నీటి సమస్య ప్రధానమైనది. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్‌ అసాధారణమైన వేగంతో కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టును పూర్తిచేయడమే కాకుండా, చెరువులను పునరుద్ధరించారు. ఇంత వేగంగా నీటి ప్రాజెక్టులు ఏ కాలంలోనైనా, ఎక్కడైనా జరిగినట్టు చరిత్రలో దాఖలాలున్నాయా? స్వయంగా ప్రధాని మోదీయే కేసీఆర్‌ చిత్తశుద్ధిని ప్రశంసించారు. కేసీఆర్‌ ఎన్నిసార్లు కలిసినా తెలంగాణ అభివృద్ధినే కోరుతారని, నీటి గురించి చాలా ఉద్వేగంగా ఉంటారని, తెలంగాణకు నీళ్లు తేవడమే ఆయన జీవిత లక్ష్యమని స్వయంగా ప్రధాని మెచ్చుకున్న మాట వాస్తవం కాదా! రాష్ట్ర ప్రభుత్వ విజయాలను ఎందరు కేంద్ర మంత్రులు ప్రశంసించలేదు! ఈ అనుకూల పరిస్థితుల్లో కూడా రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం చేత నీటి పంపకాలు చేయించేందుకు తమ వంతు ఒత్తిడి ఎందుకు తేవడం లేదు? నీటి సమస్యలను పరిష్కరించవలసిన రాజ్యాంగ బాధ్యత కేంద్రంపైనే కదా ఉన్నది! ఈ వాస్తవాన్ని గుర్తించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అడ్డమైన విమర్శలు చేయడమేమిటి? 

మహారాష్ట్ర నాయకులు ఏ పార్టీ వారైనా తమ రాష్ట్రం గురించి మాట్లాడతారు. కర్ణాటక నాయకులు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం గళమెత్తుతారు. కానీ మన రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం లోక్‌సభలో మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు నోరెత్తరు? తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టకుండా జాగ్రత్తగా నడిపి రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్‌దే. రాష్ర్టావతరణ తర్వాత గత ఆరేండ్లలో ఒక ఇంజినీరులా, ఒక ఆర్థిక- సామాజికవేత్తలా, పరిపాలనాదక్షుడిగా ఆయన సాగిస్తున్న అభివృద్ధి అసాధారణమైంది కనుకనే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బురదజల్లే రాజకీయాలు జరపడం వల్ల ప్రజలు అసహ్యించుకుంటారు. బీజేపీ నాయకులు ఇప్పటికైనా విజ్ఞతతో రాష్ర్టాభివృద్ధి కోసం అధికారపక్షంతో కలిసి కృషి చేయడానికి ముందుకురావాలి.

VIDEOS

తాజావార్తలు


logo