గురువారం 03 డిసెంబర్ 2020
Editorial - Oct 04, 2020 , 00:47:22

ఇదే పరమహంస తత్తం

ఇదే పరమహంస తత్తం

శౌనకాది మహర్షులు మహనీయ గుణ గరిష్ఠులు. ఉగ్రశ్రవ సూతుడు సకల పురాణ వ్యాఖ్యాన వరిష్ఠుడు. మహర్షుల కథా శ్రవణ కుతూహలం కడు విశిష్టం. సూతుడు వారిని మెచ్చి వ్యాఖ్యారంభంలో తన గురువైన శుకుని సర్వాత్మ భావాన్ని ప్రకాశింపచేస్తూ ప్రణమిల్లుతున్నాడు-

మ. ‘సముడై యెవ్వడు ముక్తకర్మచయుడై సన్న్యాసియై యొంటి బో

వ మహా ప్రీతి నొహో కుమార! యనుచున్‌ వ్యాసుండు చీరంగ వృ

క్షములుందన్మయతం బ్రతిధ్వనులు సక్కం జేసే మున్నట్టి భూ

తమయున్‌ మ్రొక్కెద బాదరాయణి దపోధన్యాగ్రణిన్‌ ధీమణిన్‌.’

ఈ మత్తేభ వృత్తం ‘యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం...’ అన్న మూల శ్లోకానికి పోతన్న మహాకవి వెలయించిన చాల విధేయమైన యదార్థ అనువాదం. ‘సముడై’ అన్న ఎత్తుగడ ఈ మత్తేభానికి ఏడుగడ. మిగతా పద్యమంతా ముచ్చటైన ఈ మూడక్షరాలకి ఇచ్చిన ప్రసన్న గంభీరమైన వివరణ. ‘నిర్దోషం హి సమం బ్రహ్హ’ అని గీత. ‘సమాత్మా సమ్మితః సమః’ అని విష్ణు సహస్రం. సమత్వం బ్రహ్మ లక్షణం. విషమత్వం ప్రకృతి లక్షణం. శుకుడు సముడు. బ్రహ్మరూపుడు. అనగా బ్రాహ్మీస్థితిని పొందినవాడు. సర్వభూతాలలో ‘సమ’ (బ్రహ్మ) దర్శనం చేస్తూ సంచరించేవాడు. శుకముని అవనిపై ఆవిర్భవించగానే ప్రవృత్తి (కర్మమార్గం)లో విరక్తుడై నివృత్తి (జ్ఞానమార్గం) లో అనురక్తుడయ్యాడు. జన్మసన్న్యాసి కనుక కర్మసంస్కారాలని స్వీకరించలేదు. వికారాలు- అశుభ వాసనలు ఉంటే అవి సమసిపోవటానికి సంస్కారాలు కావాలి. వికారాలు లేనివానికి సంస్కారాలెందుకు? శుకుడు విరాగియై పితృదేవుని (వ్యాసుని) కూడా పరిత్యజించి ఏకాకిగా కీకారణ్యంలోకి వెళ్లిపోతున్నాడు. ఆ వియోగదుఃఖం వ్యాసునికి దుస్సహం కాగా ఆయన వెంటపడి తగని వాత్సల్యంతో ‘ఓ కుమారా’ ‘శుకా’ అని గొంతెత్తి పెద్దగా పిలుస్తుంటే, చిట్టడవిలోని చెట్లన్నీ కూడా శుకభావంతో తన్మయత్వం పొంది ప్రత్యుత్తరరూపంగా ‘ఓ కుమారా!’ అంటూ చక్కగా ప్రతిధ్వనించాయి. అరణ్యమంతా శుకమయమయింది. ‘నేను నీకు కొడుకునైనప్పుడు నీవు మాత్రం నాకెందుకు కొడుకువు కావు?’ అని శుకుడు ప్రతి(మారు) ప్రశ్న వేసినట్లు పాదపాలన్నీ (చెట్లన్నీ) ప్రతిధ్వనించాయి. ‘కస్యకే పితృపుత్త్రాద్యా మోహ ఏవ హి కారణం’- (ఎవడికెవడు కొడుకు? ఎవడికెవడు తండ్రి? ఈ మాయా బంధాలు మొహమయాలు కావా?) ఈ సత్యాన్ని విస్మరించి ఎందుకిలా మోహపడుతున్నావు? అని శుకుడు తన తండ్రియొక్క మోహపాశం ఛేదించటానికి తాను మాట్లాడక ఇలా చెట్ల చేత చెప్పించాడు. సర్వప్రాణులలో ఏకకాలంలో ప్రవేశింప జాలిన మహిమగల సర్వాత్మ స్వరూపుడు, తపోధనులలో అగ్రణి, ధీమంతులలో చింతామణి వంటి బాదరాయణి (శుక) బ్రహ్మకు నేను నమస్కరిస్తున్నా- అన్నాడు సూతుడు.

వ్యాసుని తపోభూమి బాదరం. అనగా బదరీ (రేగు) వృక్షాల సమూహాలతో నిండి ఉండేది. కాన ఆయనకు ‘బాదరాయణుడు’ అని పేరు. ఆయన కుమారుడు ‘బాదరాయణి’, శుకుడు. ఇక్కడ ‘బాదరాయణి’ శబ్దప్రయోగం సాభిప్రాయం. శుకుడు వ్యాసుని తపఃఫలం. తనయుని మహిమ తండ్రి వలన అని సూచన. “వ్యాసాయ విష్ణురూపాయ”- విష్ణంశ సంభూతుడైన పారాశరు(వ్యాసు)నికి పామర జనులకు వలె పుత్ర వియోగ భయ దుఃఖం ఉంటుందా? అంటే- ‘నాయం ప్రాకృతికో మోహః’- పారాశరునికి కలిగింది ప్రాకృతిక-ప్రాపంచిక మొహం కాదని వ్యాఖ్యాత విశ్వనాథ చక్రవర్తి వివరించాడు. జడములైన వృక్షాలలో ప్రవేశించి తండ్రిని సమాధానపరచిన శుకబ్రహ్మ చేతనుడనైన నాలోను, అలాగే ప్రతి భాగవత ప్రవక్తయందును సన్నిధానం చేయుగాక అని ఆశీఃపూర్వక మంగళాశాసనం!

పరీక్షిత్తు మహర్షులకు రెండు ప్రశ్నలు సంధించాడు. సర్వజీవుల సాధారణ కర్తవ్యం ఏమిటో చెప్పమన్నాడు. చావు దగ్గర పడ్డ నావంటి వాని కర్తవ్యం ఏమిటో బోధించమన్నాడు. ఉత్తరానందనుని ప్రశ్నలకు తగిన ప్రత్యుత్తరం కొఱకు మునుల సమాలోచనం సాగుతున్న సమయంలో దైవయోగం వల్ల అచ్చటికి శుకయోగీంద్రుడు వేంచేశాడు. పరిపక్వమైన శిష్యుని వెదుకుతూ గురువే వస్తాడు. ఇది భాగవతంలోని భవ్య విశేషం. పండు పక్వమైతే సరి, చిలుక స్వయంగా వచ్చినట్లు. వికసించిన కమలాన్ని తుమ్మెద వెదుకుతూ వచ్చినట్లు. సద్గురు స్వరూపం సర్వత్ర వ్యాపకం! సచ్ఛిష్యుడే అపురూపం! భాగవతంలో వ్యాసుడు నాలుగు శ్లోకాల్లో శుకుని స్వరూప స్వభావాలను వర్ణించాడు. తెలుగు శుకుడు ఎలా ఉన్నాడు? సూతుడు చెప్తున్నాడు-


సీ.‘ప్రతి నిమేషము బరబ్రహ్మంబు నీక్షించి

మరి జొక్కి వెలుపల మఱచువాడు

కమలంబు మీద భృంగముల కైవడి మోము

పై నెఱపిన కేశపటలివాడు

గిఱి వ్రాసిమాయ నంగీకరించని భంగి

వసనంబు గట్టక వచ్చువాడు

సంగిగాడని వెంట జాటు భూతములు నా

బాలుర హాస శబ్దములవాడు’


తే. ‘మహితపదజాను జంఘోరు మధ్యహస్త

బాహువక్షోగళానన ఫాలకర్ణ

నాసికా గండమస్తక నయన యుగళు

డైన యవధూతమూర్తి వాడరుగుదెంచె.

ప్రతిక్షణం లోనున్న పరబ్రహ్మను దర్శిస్తూ పరవశించిన హృదయంతో బాహ్య ప్రపంచాన్ని మరచినవాడు. అనగా అంతర్ముఖుడు, ఆత్మారాముడు. బ్రహ్మదృష్టేగాని మాయిక నామరూప దృష్టి లేనివాడు. ఇదే పరమహంసతత్వం. నీరక్షీర వివేకం. హంస నీరు విడిచి పాలు గ్రహిస్తుంది. పరమహంస జడత్వం వదలి సర్వత్ర చైతన్యం గ్రహిస్తాడు. ఇది నిర్గుణ నిష్ఠకు పరాకాష్ఠ! ‘నిజలాభతుష్టః’ అన్న మూలానికిది పెంపు. కమలం మీద మూగు తుమ్మెదల వలె ముఖముపై ముసురుతున్న ముంగురులు కలవాడు- ‘వికీర్ణకేశం’. గీత గీసి చెప్పినట్లు అనగా నిర్దంద్వంగా మాయిక ప్రపంచం లేదని నమ్మి, మాయను తిరస్కరించినట్లు ఒంటి మీద వస్త్రం లేనివాడు- ‘దిగంబరః’. పరిహసిస్తూ వెంటబడి వస్తున్న పిల్లల నవ్వు- ‘వీడు సంసారాపక్తుడు కాడు, సర్వసంగ పరిత్యాగియైన మహాయోగి’ అని చాటుతున్నట్లు ఉన్నదిట- ‘వృతశ్చబాలైః’, సహజ, సుందర, సుకుమార, సౌష్ఠవం కల్గిన కర, చరణ, కంఠ, ముఖ, నేత్ర, కర్ణ, నాసికాది అంగ-ప్రత్యంగాలతో అలరారుతున్న ఒక అవధూత మూర్తి అచ్చటికి అనుకోకుండా విచ్చేశాడు.

ఈ సీస పద్యపు కూర్చులో పోతన మహాకవి చూపిన నేర్పు చాల గొప్పది. మూలంలోని అల్పాక్షర సంస్కృత సమాసాలను తెలుగులో ఆలంకారికంగా విస్తరించి విశదీకరించిన విధం అద్భుతం. మహిమను గుర్తించలేక లోకులు పిచ్చవాడని తిరస్కరించేది అవధూత వేషం. శుకుడు ఎంత గూఢుడో లోకానికి అంత మూఢుడు. అక్షరుడు కాన ‘అ’, వరణీయుడు కాన ‘వ’, సంసార బంధాన్ని విదిలించి కొట్టినవాడు కనుక ‘ధూ’, తత్తమసి మొదలైన మహావాక్యాలకు లక్ష్యభూతుడు కనుక ‘తః’- ఇలా అవధూత శబ్దాన్ని ఉపనిషత్తు వ్యాఖ్యానించింది.

ఆ. ‘అమ్మహాత్ము షోడశాబ్ద వయోరూప

గమన గుణ విలాస కౌశలములు

ముక్తి కాంత సూచి మోహిత యగునన

నితర కాంత లెల్లనేమి సెప్ప.’

ఆ మహాత్ముడు పదహారేళ్ల పడుచువాడు. ఆ పరువం పరికిస్తే, ఆ సుందరరూపం తిలకిస్తే, ఆ గంభీర గమనం గమనిస్తే, ఆ గుణ విశేషాలు గణిస్తే, ఆ చాతుర్య విలాస విభ్రమాలు విశ్లేషిస్తే ముక్తికాంత సైతం ముచ్చటపడి మోహించగా ఇతర కాంతల సంగతి విడిగా చెప్పాలా? మూలంలో ‘స్త్రీణాం మనోజ్ఞం రుచిరం స్మయేన’ (మందహాసాలతో మగువలను మురిపించువాడు) అని మాత్రమే ఉండగా అమాత్యుడు మగువలతో ముక్తికాంతను కూడా చేర్చి మూలానికి మెఱుగులు దిద్ది ముక్తిని భక్తిరాగ రంజితం చేశాడు. భక్తకవి పోతన తప్ప మరొకడు ఇలా వ్రాయగలడా?

భక్తిజ్ఞానాల అర్ధనారీశ్వరుడు శుకుడు. పైకి జ్ఞాని, లోన భక్తుడు. ఎంత జ్ఞానమో అంత భక్తి! కనుకనే ముక్తికాంత తనంత తానుగా వలచి వచ్చింది. ముక్తి భక్తికి పదదాసి!


- తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ

98668 36006