శుక్రవారం 23 అక్టోబర్ 2020
Editorial - Oct 01, 2020 , 23:50:50

మహాత్ముడి బాటలో..

మహాత్ముడి బాటలో..

రాజకీయ స్వాతంత్య్రం కన్నా పారిశుద్ధ్యమే ప్రధానమన్నారు మహాత్మా గాంధీ. స్వాతంత్య్రం రావడానికి ముందే ఆయన పరిశుభ్రత ప్రాధాన్యాన్ని వివరించారు. ఇంటిలో ముందు గది మాదిరిగానే మరుగుదొడ్డి కూడా అంత పరిశుభ్రంగా ఉండాలని బోధించారు. సంపూర్ణ పారిశుద్ధ్యం గలదే అసలైన ఆదర్శగ్రామమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సం దర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ నినాదం ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇతర రంగాలలో మాదిరిగానే పారిశుద్ధ్యంలో కూడా ముందంజలో ఉంది. కేసీఆర్‌ నాయకత్వంలో అహింసాయుత ఉద్యమాన్ని సాగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. గ్రామాలను సుసంపన్నం చేయాలన్న కేసీఆర్‌ విధానాలు కూడా గాంధీజీ బోధనలకు అనుగుణమైనవే. ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ ఉద్యమంగా చేపట్టిన స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం కూడా మహాత్ముడి బోధనలకు అనుగుణమైనదే! 

వ్యక్తిగత నివాసాల్లో మరుగుదొడ్డి ఉండటాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం సాగించిన అసాధారణ కృషి అర్థమవుతుం ది. 2014-15లో 11,56,287 మరుగు దొడ్లు మాత్రమే ఉండేవి. కానీ మొదటి ఐదేండ్లలోనే వీటి సంఖ్య 41,90,034కు పెరిగింది. ఈ విధంగా జాతీయ సగటును తెలంగాణ అధిగమించింది. కరోనా వైరస్‌ పేట్రేగిపోతున్న కాలంలో పల్లెల్లో, పట్టణాల్లో పరిశుభ్రతను ఒక ఉద్యమంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుతీసుకుపోయింది. దీం తో వానకాలం వచ్చే వ్యాధులను అరికట్టినట్టయింది. సాధారణంగా ప్రభుత్వాలు ప్రజారోగ్యం కోసం వైద్య రంగంపై దృష్టిసారిస్తుంటా యి. కానీ రోగులకు చికిత్స అందజేయడమే కాదు, అసలు వ్యాధులే రాకుండా నిరోధించాలనేది సీఎం కేసీఆర్‌ విధానం. ఈ క్రమంలోనే ఇంటింటికి మంచినీరు, పరిశుభ్రత ప్రాధాన్యం పొందాయి. 

ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమం అయినా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే విజయవంతం అవుతుంది. అందులోనే పరిశుభ్రతకు సంబంధించిన అంశం కనుక ప్రజలు ముందుకు వస్తేనే సాధ్యమవుతుంది. అందుకే కేటీఆర్‌ ప్రజలను కార్యోన్ముఖులను చేయడంపై దృష్టి పెట్టారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పరిశుభ్రతను ఉద్యమ స్థాయిలో నిర్వహించారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు అనేది వినూత్న కార్యక్రమం. అక్టోబర్‌ రెండు గాంధీ జయంతి లక్ష్యంగా ఎంతో ముందు నుంచే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ, స్థానిక నాయకులను పురికొల్పుతూ, ప్రజలను చైతన్యవంతం చేస్తూ వస్తున్నారు. సాధారణంగా నాయకులు లాంఛనంగా కార్యక్రమాలు చేపడుతూ టీవీ చానెల్స్‌, పత్రికలలో కనిపించడానికి ప్రయత్నిస్తారు. కానీ క్షేత్ర స్థాయి నుంచి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కేటీఆర్‌ ప్రత్యేకత. ప్రజలు కూడా వ్యక్తిగత, నివాస, పరిసరాల పరిశుభ్రతను ఒక సంస్కృతిగా, జీవన విధానంగా మార్చుకోవాలి. అప్పుడే స్వచ్ఛ తెలంగాణ సాధ్యం.


logo