శుక్రవారం 23 అక్టోబర్ 2020
Editorial - Oct 01, 2020 , 23:50:50

గాంధీ మార్గం అనుసరణీయం

గాంధీ మార్గం అనుసరణీయం

మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ 1888లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. ఇంగ్లాండ్‌ ఆ సమయంలో ప్రపంచంలోని చాలా దేశాలను ఆక్రమించుకొని వలస ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అన్ని రంగాలలో ఉచ్ఛ దశలో ఉంది. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యంగా కీర్తి ప్రతిష్ఠలతో కొనసాగుతూ ప్రపంచ ప్రజా రాజకీయాలను శాసిస్తూ ఉండేది. వివిధ దేశాలలో జరిగే అనేక పరిణామాలపై నిత్యం లండన్‌ మహానగరంలో చర్చించుకునేవారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న గాంధీజీకి ఈ విషయాలను సన్నిహితంగా గమనించే అవకాశం చిక్కింది.

న్యాయశాస్త్ర విద్యాభ్యాసం తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి మళ్లీ కొద్దికాలంలోనే దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఆయన స్వయంగా వర్ణ వివక్షకు గురయ్యారు. శ్వేతజాతీయులు భూమిపుత్రులైన ఆఫ్రికన్లపై క్రూరంగా వివక్షను ప్రదర్శిస్తున్న పరిస్థితులను నిశితంగా గమనించిన గాంధీజీ దక్షిణాఫ్రికా ప్రజలు, అక్కడ ఉన్న భారతీయుల తరపున అనేక ఉద్యమాలు కొనసాగించి కొంత కృతకృత్యులయ్యారు. ఇదే సమయంలో వివిధ దేశాలలో నిరంతరం సాగుతున్న మారణకాండ, ఆధిపత్య, అహంకార ధోరణులు, మొదటి ప్రపంచ యుద్ధం ఆయనను కలచివేశాయి. 

భారతదేశానికి తిరిగి రాగానే బాపూజీ భారత స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన, కీలక పాత్ర పోషించారు. నాటి సమకాలీన ప్రపంచంలో రాజులకు, నియంతలకు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విభిన్న రూపాలైన ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కొందరు తిరుగుబాట్ల ద్వారా, విప్లవం ద్వారా, గెరిల్లా పోరాటాల ద్వారా తమ ప్రతిఘటనను హింసాయుతంగా, రక్తపాతంతో కొనసాగిస్తున్నారు. హింసాయుత పంథాలో, రక్తధారలతో సాగుతున్న మానవ జాతి చరిత్ర గమనాన్ని మార్చాలని బాపూజీ సంకల్పించారు. నూతన పంథా ద్వారా ప్రజలను సామూహిక శక్తిగా మార్చి ప్రపంచానికి ఆచరణీయమైన ఆదర్శ మార్గాన్ని అందించాలని తలిచారు. అహింసాయుత, శాంతియుత, సత్యంతో కూడిన ఉద్యమానికి పిలుపునిచ్చారు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో దేశవ్యాప్త పర్యటనలతో ముందుకు సాగుతూ, యావత్‌ ప్రజానీకాన్ని చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టారు. ప్రజలను ఏకం చేస్తూ బ్రిటిష్‌ పాలకులు అడుగడుగునా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా సంయమనం పాటించారు. తానిచ్చిన ఉద్యమ కార్యాచరణ ఎప్పుడైనా హింసాత్మక రూపం దాల్చితే తన పిలుపును ఉపసంహరించుకుంటూ జరిగిన తప్పిదానికి తనకు తాను శిక్ష వేసుకుంటూ నిబద్ధతతో ఉద్యమానికి నాయకత్వం వహించారు. 

గాంధీజీ కొత్త మార్గాన్ని ఆచరించి అఖండ భార త ప్రజల శాంతియుత ఉద్యమ పటిమను బ్రిటిష్‌వారికి చాటి చెప్పారు. సామ్రాజ్యవాదులు ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించాల్సిన అనివార్యతను సృష్టించారు. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన అనేక మార్పుల వల్ల బ్రిటిష్‌ వారికంటే కొత్త బలమైన దేశాలు అవతరించాయి. స్వాతంత్య్రం కోసం పరితపిస్తున్న అనేక దేశాలు, జాతులు బాపూజీ పంథాను అనుసరించడం ఆరంభించాయి. అలా ఉద్యమించినవారిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మార్టిన్‌ లూథర్‌కింగ్‌, నెల్సన్‌ మండేలా అగ్రగణ్యులు. ఆ రోజులలో ప్రపంచమంతా బక్క పలచని, అర్ధ నగ్నంగా ఉండే వ్యక్తి ప్రపంచ చరిత్రనే తిరగరాసిండనే మాటను బాపూజీ పట్ల గౌరవంగా, స్తుతి పూర్వకంగా మాట్లాడేవారు. బాపూజీ పరమపదించిన ఐదు దశాబ్దాల తర్వాత ఆయన ఆచరించిన అహింసాయుత విధానాన్నే ఎంచుకొని పద్నాలుగేండ్ల సుదీర్ఘకాలం ఆ మార్గంలో పయనించి ప్రజలను శక్తిగా మలచి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. గాంధీజీ మార్గం అజరామరమని నిరూపించారు. 

మానవజాతికే వరం బాపూజీ మార్గం. ఈ గొప్ప పంథాను శిరోధార్యంగా స్వీకరించాల్సిన మానవులు అందుకు భిన్నంగా ఇప్పటికీ ఘర్షణలకు పాల్పడుతూ రక్తపాతాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మితిమీరిన స్వార్థం అనే జబ్బుకు లోనవుతున్న మానవ సమాజానికి బాపూజీ పరోపకారం అనే దివ్య ఔషధాన్ని అందించారు. దక్షిణాఫ్రికాలో రోగులకు, క్షతగాత్రులకు సేవలందించడంలో ముందున్నారు. పరోపకారంలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు. బాపూజీ ప్రతిచర్య, ఆలోచన మానవాళికి సందేశమే. శ్రమైక జీవన సౌందర్యం, నిరాడంబరత గాంధీజీలో మూర్తీభవించిన మానవత్వానికి ప్రతీకలు. బట్టలు ఉతుక్కోవడం, మరుగుదొడ్లను శుభ్రపర్చుకోవడంతోపాటు మురికివాడలను పరిశుభ్రపరచడం గాంధీజీకి సంతృప్తినిచ్చేది. తమ పనులకు సేవకులపై ఆధారపడటాన్ని గొప్పగా భావించేవారిలో కొందరికి బాపూజీ జీవన విధానం పరివర్తన కలిగించింది. కొందరు ఆయన ఆలోచనలు ఆదర్శాలకు వారసులుగా కాక ఆయన కీర్తిని తమ రాజకీయ సోపానానికి ఉపకరణంగా ఉపయోగించుకుంటూండటం గాంధీజీని ఈ తరం వారు సమగ్రంగా అర్థం చేసుకోలేకపోవడానికి, అనుసరించలేకపోవడానికి కారణమవుతున్నది. 

గాంధీజీ చివరి రోజులలో యువకులుగా, పసివారుగా ఉన్న వాళ్లలో అతికొద్ది మంది దేశంలో అక్కడక్కడా ఇంకా బతికే ఉన్నారు. అలాంటివారిని కలిసి మాట్లాడినప్పుడు వారు ఆవేదనతో మీ తరం చెడిపోతున్నదని గడిచిన కొన్ని దశాబ్దాలుగా సుతిమెత్తని హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. కారణం ఆ తరం వారు గాంధీజీ విలువలను పాటించారు. జీవన విధానాన్ని అనుసరించారు, సామాజిక సేవను బాధ్యతగా కొనసాగించారు. ఈ సుగుణాలు తరాలు మారుతున్నకొద్దీ తరుగుతున్నాయి. ఆ విలువలు కనుమరుగవుతున్నాయి. ప్రస్తుత సంక్షుభిత సమాజానికి గాంధీజీ విచారధార ఆవశ్యం. ప్రభుత్వాలు, సంస్థలు, పౌర సమాజం మేల్కొని యువతరాన్ని గాంధీజీ మార్గానికి మళ్లించాలి. భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా నిలవాలి.

(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి)

సిరికొండ మధుసూదనాచారి


logo