శుక్రవారం 23 అక్టోబర్ 2020
Editorial - Oct 01, 2020 , 23:50:48

స్వచ్ఛతకు స్ఫూర్తి మన గాంధీజీ

స్వచ్ఛతకు స్ఫూర్తి మన గాంధీజీ

సత్యం అహింస సిద్ధాంతాలతో వాటిని ఆయుధాలుగా మలచి భారత జాతీయోద్యమాన్ని మహోజ్వలంగా నడిపినవాడు మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ. మహాత్మాగాంధీ తన రాజకీయ ఆర్థిక సిద్ధాంతాలనే కాకుండా ‘స్వచ్ఛత’ సిద్ధాంతాన్ని కూడా మనకు ప్రసాదించాడు. నేడు అక్టోబర్‌ 2 గాంధీ 151వ జయంతి. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛతకు ఇచ్చిన విలువ, స్ఫూర్తిని మరొక్కసారి మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది.

మనం అనేక విషయాలను సామాన్యంగా, అతి సాధారణమైనవిగా చేస్తుంటాం. మన ఇంట్లోని చెత్తను చక్కగా చీపురుతో ఊడ్చి పక్క ఇంటి ముందు వాకిట్లో పారవేస్తూ ఉంటాం. మన పక్కింటివారు కూడా అలా చేస్తే మన ఇంటి ముందు కూడా చెత్త ఉంటుంది. అందరూ అలాచేస్తే అందరి ఇండ్లముందు చెత్త పేరుకుపోతుంది. శుభ్రత అంటే పరిసరాల శుభ్రతతోపాటు మానసిక, శారీరక శుభ్రత కూడా అవసరం అని గాంధీ ఆనాడే గుర్తించారు. అందుకే సమాజంలోని అన్ని రంగాల్లో స్వచ్ఛతను ఆశించారు. అందులో పరిసరాల పరిశుభ్రతతోపాటు, రాజకీయరంగంలో కూడా స్వచ్ఛత ఉండాలని కోరుకున్నారు. అందుకే ఆయన ఏడు మహాపాతకాలలో నీతి నియమాలు లేని రాజకీయాలను కూడా నిరసించారు.

గాంధీజీ పరిసరాల శుభ్రతకు ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. చీపురు పట్టి పరిసరాల పరిశుభ్రతకు పూనుకున్నారు. చంపారన్‌ యాత్రలో ఆ గ్రామంలోని చెత్తాచెదారాన్ని మురికికాల్వలను చూసి చాలా బాధపడ్డారు. పరిశుభ్రమైన పరిసరాలు మనుషులకు రోగాలు రాకుండా చేస్తాయని, దానివల్ల ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం వర్తిస్తుందని, మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యకరమైన మెదడుతో ఆలోచిస్తారని ఆయన తాత్త్విక సామాజిక దృష్టితో విశ్లేషించారు. ఆ రోజు నుంచి ప్రజలకు దేశ స్వాతంత్య్రం ఎంత ముఖ్యమో, పారిశుద్ధ్యం కూడా అంతే ముఖ్యమని ప్రకటించారు. గాంధీజీ చంపారన్‌తోపాటు దేశంలోని చాలా గ్రామాలలోపారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ప్లేగు లాంటి అంటువ్యాధులు వ్యాపించినప్పుడు దానికి ప్రధాన కారణం పారిశుద్ధ్య లోపం అని గుర్తించారు. పరిశుభ్రంగా ఉండకపోవడం బట్టలు సరిగా ఉతకకుండా వాటిని మళ్లీ మళ్లీ తొడుక్కోవడం కూడా ఒక కారణంగా ఆయన గమనించారు.

 ‘మీరు బట్టలు సరిగ్గా ఉతికి తొడుక్కోవాలి’ అని తనతోపాటే ఉన్న భార్య కస్తూర్బాగాంధీ ద్వారా పల్లెలోని మహిళలకు చెప్పించారు. ఆ మహిళలు కస్తూర్బాగాంధీకి వేసిన ప్రశ్న గాంధీని మరొక విధంగా ఆలోచింపచేసింది. కస్తూర్బా గాంధీ ఇచ్చిన సలహాలు విన్న ఆ మహిళ తమ గుడిసెలోకి ఆమెను తీసుకెళ్లి తనకు ఉన్నది ఒకటే చీర అని, దాన్ని శుభ్రంగా ఉతికి మార్చుకోవాలంటే మరొక చీర లేదని తన అసహాయతను వ్యక్తం చేసింది. పేదవారి అపరిశుభ్రతకు పేదరికం కూడా కారణమని గాంధీజీ ఆనాడే గమనించారు. పేదరికం కంటే మించిన శత్రువు లేదని ఆయన అన్నారు. దక్షిణాఫ్రికాలో పరిశుభ్రత గురించి గాంధీ ఒక న్యాయవాదిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేశారు. సుమారు 70 కేసులలో ఒకటి మాత్రం ఓడిపోయారు. దక్షిణాఫ్రికాలో మలమూత్రాలను చేతులతో ఎత్తిపోసే కార్మికుల ఇండ్లను మునిసిపాలిటీవారు కూల్చివేయడానికి పూనుకున్నారు. మునిసిపాలిటీవారు ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచడానికి ఆయన కృషి చేశారు. దానివల్ల ఒక న్యాయవాదిగా ఆయనకు ఆదాయం కూడా లభించింది. వందేండ్ల క్రితమే గాంధీజీ పరిశుభ్రత, స్వచ్ఛత పట్ల చేసిన కృషి నేటి స్వచ్ఛ తెలంగాణకు, స్వచ్ఛ హైదరాబాద్‌కు స్ఫూర్తినిచ్చింది.

ప్రకృతి ప్రతి జీవి అవసరాలను తీరుస్తుంది వాటి కోరికలను అత్యాశలను తీర్చదని మహాత్మాగాంధీ అన్నారు. ఆయన స్వచ్ఛతకు ప్రాధాన్యమిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. గతంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో కూడా పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక డంపింగ్‌ యార్డ్‌ ఉండేలా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో ఇంటింటికీ తడి, పొడి చెత్తలను వేరు వేరుగా సేకరించేందుకు రెండు భిన్న రంగుల చెత్తబుట్టలను సరఫరా చేశారు. ఈ స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించటంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవను చూపింది. ఈ నేపథ్యంలోనే.. ఈ గాంధీ జయంతి నుంచి స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు పూనుకోవటం ముదావహం. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతకు కూడా పెద్ద పీట వేయటం హర్షణీయం, అనుసరణీయం. ఈ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరం కంకణబద్ధులమై కదులుదాం. అందరం సహకరిద్దాం! గాంధీ చూపిన మార్గంలో ఆయన స్వచ్ఛ ఆశయాల స్ఫూర్తితో పనిచేద్దాం.

బండారు రామ్మోహనరావు 


logo