శుక్రవారం 23 అక్టోబర్ 2020
Editorial - Oct 01, 2020 , 23:50:48

రాష్ట్రపతి పాలనపై సందిగ్ధం

రాష్ట్రపతి పాలనపై సందిగ్ధం

  • తొమ్మిదవ అధ్యాయం కొనసాగింపు..

కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చేముందు ప్రముఖంగా చేసే ఆలోచనలోకి అది చొరబడుతుందనేది కాదనేందుకు వీలులేని నిజం. దీని వివరణ కోసం ఓ విషయాన్ని మీకు గుర్తుచేస్తాను; కట్టడాన్ని కూల్చివేసిన తర్వాత నాలుగు బీజేపీ పాలిత రాష్ర్టాలలో ప్రభుత్వాలను రద్దు చేసినప్పుడు, మధ్యప్రదేశ్‌ హైకోర్టు రాష్ట్రపతి పాలన విధింపును అంగీకరించక రద్దుచేసిన రాష్ట్ర అసెంబ్లీని, ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వును నిరాకరించింది. కనుక పైన ఉదహరించిన గవర్నరు లేఖ భారత ప్రభుత్వానికి అందేనాటి స్థితిని తిరిగి సాధ్యమైనంత దగ్గరగా జ్ఞప్తికి తెచ్చుకోవాల్సి ఉంది. అప్పుడే ఆ పరిస్థితుల్లో అధ్యక్ష పాలన విధించకపోవటం సబబా కాదా అని ఎవరైనా తేల్చగలిగేది. ఆ పరిస్థితుల్లో అది సబబే; సమర్థనీయమే. ఆ విషయంలో కచ్చితంగా అదే కీలకం. అయితే కేంద్ర ప్రభు త్వం ఆ రోజుల్లోని స్థితిని అలా అంచనాలు వేసేందుకు భూమి క ఏమిటి? తప్పకుండా కొన్ని గీటురాళ్లు ఉండే ఉంటాయి. అవేమంటే:

1) మొట్టమొదటిగా అక్కడి సాధారణ వాతావరణం- ప్రభుత్వం తన సొంత వనరుల ద్వారా అంటే కేంద్ర రాష్ట్రస్థాయిల్లో ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించినటువంటిది. 2) ప్రసారమాధ్యమం ద్వారా, జనసామాన్యం ద్వారా, వీధిలోని వ్యక్తి ద్వారా వెనువెంటనే ఉద్రిక్తత తలెత్తగల తావుల్లోని నగరవాసుల, గ్రామీణుల సాధారణ జీవితాల ద్వారా మదింపు చేసిన సాధారణ ప్రజల ఆశంసలు. 3) అయోధ్య సమస్యపై న్యాయస్థానాల్లో, సుప్రీంకోర్టుతో సహా అన్ని కేసుల్లో తీర్పు కోరిన సందర్భాల్లో రేకెత్తించిన వైఖరులు. 4) జాతీయ సమైక్యతా మండలి వంటి సంస్థలలో ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు, సభ్యులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చే సందర్భాలలోనూ ప్రకటితమయ్యే ఆలోచనా ధోరణి ఏదైనా ఉంటే అది. 5) సమయాన్ని బట్టి, వ్యూహాన్ని బట్టి పథకరచననూ ఆచరణీయ అంశాలనూ విపులంగా పరిశీలించటం. 6) కీలకమైన తేదీకి అతి చేరువలో అందిన గవర్నరు లేఖను దృష్టిలో వుంచుకొని సరైన నిర్ణయాన్ని తీసుకోగల ప్రభుత్వపు దమ్ము.

ప్రవర్ధమానమయ్యే ఏ పరిస్థితుల్లో అయినా అంచనా వేసేందుకు ప్రభుత్వానికి అందుబాటులో ఉండే ప్రధానమైన ఉత్పాదకాలు ఇవే. అంతేగానీ వదంతులు, దురభిప్రాయాలు, ఊహలు, చెప్పుడు మాటలు కానేకావు. ఉదాహరణకు జాతీయ సమైక్యతా మండలిలో దేశంలోని అన్ని రాజకీయపక్షాలకు చెందిన నాయకులతోపాటు కొందరు గౌరవనీయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మండలికి ఆ కీలకరోజుల్లో, ఆ కీలక సమయంలో పరిస్థితి తీవ్రత అనుభవైకవేద్యమే. అది 1992 నవంబరు 2న, 23న జరిగిన సమావేశాల్లో విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ సమావేశాల్లోని చర్చల సరళిని బట్టి, ప్రకటించిన అభిప్రాయాలననుసరించీ ఉత్తరప్రదేశ్‌లో అధ్యక్షపాలన విధించరాదనే ఒక కచ్చితమైన అభిప్రాయం వెల్లడైందని నేను భావించాను. ఇలా ఒక నిశ్చితమైన అభిప్రాయం వెల్లడయ్యాక, భారత ప్రభుత్వం దానిని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది. ఈ విషయంలో జాతీయ సమైక్యతా మండలి అభిప్రాయాన్ని ఆమోదించకపోవటానికి కారణాలు లేకపోగా అధ్యక్ష పాలన విధిస్తే బాబ్రీ కట్టడానికి ముప్పువాటిల్లే ప్రమాదమున్నదనే గవర్నరు స్పష్టమైన హెచ్చరిక రూపంలో ప్రతికూల సూచన కూడా అధ్యక్షుని, ప్రధాని ముందున్న విషయం.

పైన ఉదహరించిన రెండు అంశాలను యూపీలోని బీజేపీ ప్రభుత్వం మీద నమ్మకం లేదనే ఆత్మశ్రయభావనాపరమైన కారణంతో తేలికగా కొట్టిపారేసేందుకు వీలు లేదు. అటువంటి ధోరణి రాజకీయ పక్షపాత వైఖరిగా ముద్ర వేయబడి అందరూ దానిని ఖండించటం జరుగుతుంది. ఇక వ్యూహరచన విషయానికొస్తే ఆ సమయంలో యూపీలో కేంద్రం కాలుమోపేందుకు కూడా స్థలం లేదనే విషయం అందరెరిగిందే. అటువంటి నిస్సహాయస్థితిలో కయ్యానికి కాలు దువ్వుతూ, ఉద్దేశపూర్వకంగా ప్రతిఘటించే రాష్ట్ర ప్రభుత్వ పాలన గల చోట అత్యంత కీలకమైన రాష్ట్రపతి పాలన విధించటం అనే చర్యను చేపట్టడం కేంద్రానికి సాధ్యపడే విషయం కాదు. సరిగ్గా అటువంటి సమయంలో సుప్రీంకోర్టులో దావా నడుపుతున్న ఒక వర్గం వారు కేంద్ర ప్రభుత్వాన్ని అయోధ్యలోని ఆస్తికి రిసీవరుగా నియమించమని కోరారు. (బాబ్రీ కట్టడము దాని చుట్టూ కొంత భూ భాగం). ఆ పరిస్థితులలో అది ప్రయోజనకరమైన చర్యే అయ్యుండేది. కేంద్రానికి ఎంతగానో అవసరమైన పట్టు లభించి ఉండేది. అది కట్టడానికి భద్రతను చేకూర్చటంతోపాటు కేంద్రానికి ఇతర ఐచ్ఛికాలలో దేనిని ఎంచుకోవాలి అని ఆలోచించుకునేదానికి సమయం లభించి వుండేది. పైగా 356 అధికరణం కింద రాష్ట్రపతి పాలన అంతా ఒకసారి స్వీకరించటం ఊహించగలిగిన, ఊహించలేని అనేక చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సాయం అందించవలసి వస్తే అటువంటి సాయాన్ని అందించేందుకు సిద్ధమేనని హామీనిచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానిని తిరస్కరించింది. తన బాధ్యతలేవో ప్రజల చేత ఎన్నుకొనబడిన ప్రభుత్వంగా తాను గుర్తెరిగే ఉన్నానంది. కట్టడ భద్రత తన బాధ్యతేనంది. రిసీవరు నియామకం నిరర్థకమంది. ఇటువంటి స్పష్టమైన హామీల కారణంగా సుప్రీంకోర్టు నవంబరు 28 నాటి ఉత్తర్వులలో రిసీవరును నియమించే విషయంలో నిర్ణయం గైకొనక ఆ విషయాన్ని వాయిదా వేసింది. దానికి బదులుగా కోర్టు ఓ న్యాయాధికారిని తమ పరిశీలకునిగా నియమించింది.

కనుక అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ముందు ఐచ్ఛికంగా నిర్ణయించుకునేందుకు రెండు అంశాలున్నాయి: 1) గవర్నరు సలహాకు వ్యతిరేకంగా కట్టడం కూల్చివేత వల్ల జరగబోయే నష్టాన్ని, పైన పేర్కొన్న యితర అంశాలనూ పక్కనబెట్టి తగిన చర్యలు గైకొనటం. 2) కొంచెం వేచి చూసి అవసరమయ్యే పక్షంలో కట్టడాన్ని కట్టుదిట్టంగా ఉంచేందుకు ఫైజాబాదులో వున్న 20,000 మంది కేంద్ర బలగపు సేవల్ని వినియోగించుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అనునయపూర్వకంగా ఒప్పించటం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను వాడుకోననలేదుగాని బలగాలను రంగంలోకి దించలేదు. వాస్తవానికి ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కంపెనీల కేంద్ర బలగాలను కోరగా వెంటనే వాటిని ఇవ్వటం జరిగింది. సహజంగానే అటువంటి చర్య వల్ల అనుమానాలు పటాపంచలవుతాయి.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo