గురువారం 29 అక్టోబర్ 2020
Editorial - Oct 01, 2020 , 02:29:20

356పై తొందర కూడదు

356పై తొందర కూడదు

తొమ్మిదవ అధ్యాయం కొనసాగింపు..

కరసేవ సందర్భంగా యూపీలో నెలకొన్న పరిస్థితుల గురించి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ పంపిన లేఖలోని సంబంధిత భాగం ఇలా ఉంది: కర సేవకులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నట్లు వార్తలు. అయితే వాళ్లు శాంతియుతంగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టమైన హామీనివ్వటం, దానిని ఆమోదించటం జరిగింది. వివాదంలో ఉన్న కట్టడానికి పూర్తిగా రక్షణ కల్పిస్తామని హామీనిచ్చి అందుకోసం తగిన ఏర్పాట్లు చేసింది.

నా ఉద్దేశంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రద్దుచేయటం, లేదా రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేయటం లేదా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించటం వంటి తీవ్రమైన చర్యలు గైకొనేందుకు సమయమింకా పక్వానికి రాలేదు. ఒక వేళ అలా చేస్తే అది తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. ఈ రాష్ట్రంలోనే గాక దేశమంతటా పెద్ద ఎత్తున హింస ప్రబలే అవకాశం ఉంది. వివాదాస్పద కట్టడానికి ముప్పు వాటిల్లే సంభవనీయతను సైతం కొట్టిపారవేయజాలం. కనుక నా దృష్టిలో మనమంతా ఈ విషయంలో కడుజాగరూకులమై మెలగాలి. ఏ నిర్ణయం గైకొనేందుకైనా సానుకూల, ప్రతికూలతలను, వివిధ ప్రత్యామ్నాయాలను బేరీజు వేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఒక్క విషయం మాత్రం స్పష్టం- ఈనాడున్న వెనుకచూపు ఆ తేదీలలో కేంద్ర ప్రభుత్వంలోని వారికెవరికీ లేవు. వెనుకచూపు అనేది తర చూ ప్రమాదకరమైన మార్గదర్శనమే. దాని ప్రధాన గుణం తప్పుదారి పట్టించటం, గందరగోళపరచటం. జరిగిన తీరును గమనించి దృష్టిని వెనక్కు మళ్లించి ఈ సమ స్య ఎంత సులభమైనటువంటిదో, దీని పరిష్కారమెంత సునాయాసమో అనిపించేట్లు చేస్తుంది. అయితే ఇక్కడ ఉన్న బలీయమైన ఆటంకం ఏమంటే ఆ కీలక సమయంలో ఎలా జరుగబోతున్నదనేది అప్పుడు ఎవరికీ తెలియదు.

మరో ముఖ్యమైన అంశాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. అధికరణం 356 విషయంలో సుప్రీంకోర్టు వైఖరిలో గుణాత్మక మార్పు పొడసూపింది. పూర్వమెన్నడో, ప్రారంభదశల్లో రాష్ట్రపతి పాలన నియమం ‘రాష్ట్రపతి సంతృప్తి చెందితే’ సరిపోయేది; కనుక అది కోర్టు పర్యవేక్షణలోకి పోయేదికాదు. అయితే కాలం గడిచేకొద్దీ అధికరణం 356 మాటిమాటికీ పాలనా యంత్రాంగం ద్వారా దుర్వినియోగం అవుతున్నదనే కారణం వలనగానీ, ఇతర కారణాల వలన గానీ లేక రెంటివలన గానీ ఇవ్వాళ రాష్ట్రపతి చర్య కోర్టు పరిశీలనకు అతీతం అనుకునేందుకు వీలులేకుండా పోయింది. ‘దుర్వినియోగం’ అనే దానిని స్వల్ప విషయంగా కొట్టిపారవేయకుండా చూచేట్లయితే సుప్రీంకోర్టు వైఖరిలోని మార్పు పాలనా యంత్రాంగంపై సహజంగానే వెనక్కు తగ్గే స్వభావాన్ని ప్రవేశపెట్టింది.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo