సోమవారం 30 నవంబర్ 2020
Editorial - Oct 01, 2020 , 02:29:20

నొప్పించక ఒప్పించినవాడు

నొప్పించక ఒప్పించినవాడు

సాహిత్యంలో రాణించినా.. రాజకీయాల్లో రాటు దేలినా.. రాజనీతిలో కీర్తి గడించినా.. పీవీ నిండుకుండ వంటి నిగర్వి. నిరంతరం మదిలో ఆలోచన సాగర మథనం జరుగుతున్నా నిశ్చలమైన మోముతో కనిపించే రూపం. అధ్యయనం, ఆలోచనతోనే ఆపకుండా ఆచరణకు మార్గాల్ని అన్వేషించే పీవీ నరసింహారావు మనకాలం నాటి మేలిమి బంగారం వంటి మేధావి.

అగ్రతః చతురో వేదా, పృష్ఠతాః సశరం ధనుః

ఇదం బ్రహ్మ్యం ఇదం క్షాత్రమ్‌, శాపాదపి శరదాదపి

శాస్త్రజ్ఞానంతో పాటు శస్త్ర పరిజ్ఞానం కలిగిన పరశురాముడి పరాక్రమాన్ని గురించి తెలిపే శ్లోకమిది. ఈ మాటలు పీవీకి సరిగ్గా వర్తిస్తాయని చెప్పడం అతిశయోక్తి కాదు. కారణం.. పరశురాముని లక్షణాలను పీవీలోనూ గమనించవచ్చు. పరశురాముని వలె పాండిత్యంతోపాటు పరిపాలనా దక్షత పీవీ సొంతం. తన మేధస్సుతో ఆలోచించి ఆవిష్కరించిన పరిష్కార అస్ర్తాలతో సమస్యల్ని ఓడించిన పరాక్రమశీలి. మేధస్సుకు అనేక పార్శ్వాలుంటాయి. మేధావి అనే మాటలో మేధస్సు ఓ భాగం మాత్రమే. విచక్షణ, వివేకం, విజ్ఞత ఇతర పార్శ్వాలు. ఓ వ్యక్తి రాణించాలంటే మేధస్సును ఎలా వాడాలనే విచక్షణ, ఎందుకు వాడాలనే వివేకం, ఎప్పుడు వాడాలనే విజ్ఞత కలిగి ఉండాలి. ఇవన్నీ సంపూర్ణంగా కలిగిన పరిపూర్ణ మేధావి పీవీ. ప్రపంచ చరిత్ర, వర్తమాన అంశాలు, పరిష్కారాలపై స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి. సందర్భోచితంగా తన జ్ఞానాన్ని నేర్పుతో వినియోగించి అంతర్జాతీయ యవనికపై తనదైన ముద్ర వేసుకున్నారు. దేశ గౌరవాన్ని ఇనుమడింపచేశారు. 

పీవీ చన్నప్పుడు తెలంగాణ నిజాం పాలనలో మగ్గిపోతున్నది. చుట్టూ అన్యాయాలు, అకృత్యాలు, మావన హక్కుల ఉల్లంఘనలు జరుగుతుండేవి. అప్పటి చీకటిరోజులు పీవీ పసి హృదయాన్ని అమితంగా ప్రభావితం చేశాయి. నిజాం నిరంకుశ పాలనలో సాగుతున్న బానిసత్వం ఆయనను తీవ్రంగా కలచివేసేది. వరంగల్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు సమస్యలపై అవగాహన పెరిగింది. సమాజంలో పరిస్థితులు మారాలంటే సామాజిక అవగాహన పెరగాలనే అభిప్రాయానికి వచ్చారు. బాగా చదువుకొని ప్రజల్లో సామాజిక అవగాహన, అన్యాయాన్ని ఎదుర్కొనే చైతన్యం నింపాల్సిన అవసరం ఉందని భావించారు. అదే సమయంలో కాళోజీ, రాఘవరెడ్డి, పాములపర్తి సదాశివరావు లాంటి వారితో సహవాసం ఏర్పడింది. ఆయనలోని సహజమైన తెలివితేటలకు ఏకసంథాగ్రహ ప్రతిభకు రాణింపు దొరికింది. వరంగల్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడే పీవీ దేశభక్తిని చాటే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఓసారి వందేమాతరం పాడిన పీవీ సహా పలువురు విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరించారు. 

విద్యాభ్యాసం, జ్ఞాన సముపార్జనపై అపరిమిత ఆసక్తి, సాధించాలనే పట్టుదల కలిగిన పీవీ.. నాగ్‌పూర్‌ వెళ్లి విద్యాభ్యాసం కొనసాగించారు. దాదాపు ఆరేడు ఏండ్లు అక్కడే ఉన్నారు. పీవీ జీవితంలో చాలా ముఖ్యమైన కాలమిది. నాగపూర్‌లోని పలువురు మేధావులు, దేశభక్తులతో సాహచర్యం చేశారు. అక్కడి ఎంతోమంది తమ మేధస్సు, విద్వత్తును ప్రజలకు ఎలా అంకితం చేస్తున్నారో గ్రహించారు. ప్రజల్లో వాళ్లు దేశభక్తిని నింపే తీరు, విప్లవతత్త్వాన్ని ప్రబోధించే తీరు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి. ఒకవిధం గా చెప్పాలంటే ఆయన జీవితంలో ప్రజాసేవకు సంపూర్ణంగా అంకితం కావాలని సంకల్పించిన సమయం అది. ఆ సమయంలోనే జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు తెలుసుకునే క్రమంలో అప్పటి సమకాలీన సాహిత్యం పట్ల పీవీకి ఆసక్తి కలిగింది. సాహిత్య తృష్ణ, జ్ఞాన తృష్ణ పెరిగింది. ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఆర్జించిన జ్ఞానాన్ని ప్రజల కోసం ఉపయోగించాలనే తపన అధికమైంది. ఈ గుణాలే ఆయనను ఓ అసాధారణ మేధావిగా నిలిపాయి.

నెల్సన్‌ మండేలా అన్నట్టు.. మంచి మేధస్సు, మంచి చేసే హృదయం- రెండూ చాలా అరుదైన, అద్భుతమైన కలయిక. అలాంటి వ్యక్తులకు తిరుగే ఉండదు. This is a formidable combin-ation. ఇది పీవీ విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమైంది. పీవీకి జన్మతః సంక్రమించిన తెలివితేటలు, జ్ఞానార్జన పట్ల జిజ్ఞాస, ప్రజల కష్టాలకు స్పందించే హృదయం.. వీటికితోడు వినయం, అసాధారణ సహనం, కఠోర పరిశ్రమ.. ఆయనను ప్రపంచం మెచ్చిన నాయకుడిగా నిలిపింది. 

తన మేధస్సును ఉపయోగించి సమాజానికి ఏమైనా చేయాలనే తపనే అనేక సంస్కరణలకు మూలం. ముప్ఫయ్యేండ్లు సాగిన ఆయన సంస్కరణల పర్వం ముఖ్య ఉద్దేశం.. పాలనా వ్యవస్థ ప్రక్షాళన... కొత్త ఊపిరి నింపడం, ప్రజల అవసరాలకు మేరకు కొత్త పంథా అందించడం. తనలోని మేధావికి నూటికి నూరుపాళ్లు తృప్తినిచ్చిన సమయం అదే. ప్రతి సంస్కరణ ఆందరిని ఒప్పిం చి.. ఎవ్వరినీ నొప్పించక సర్వసమ్మతితో ప్రవేశపెట్టారు. అందుకే 1962 నుంచి ఆయన తెచ్చిన ఏ సంస్కరణలైనా శాశ్వతంగా నిలిచిపోయాయి. ప్రధానిగా మైనారిటీ ప్రభుత్వం నడపడానికి తన మేధస్సు సంపూర్ణంగా ఉపయోగపడింది.

మా పి.వి. మేధావి, మధుర కళా జీవి/ అతని వశం వాగ్దేవి, అతని వరం నవభావి అని దాశరథి అన్నారు. పీవీ శత జయం తి సందర్భంగా ఆయన మేధస్సు ను, తత్ఫలితంగా సాధించిన ప్రగతిని, ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును, ఆయన పంచిన వెలుగుల్ని స్మరించుకోవాలి.

(వ్యాసకర్త: పీవీ తనయుడు)


- పీవీ ప్రభాకర్‌రావు