సోమవారం 26 అక్టోబర్ 2020
Editorial - Sep 30, 2020 , 03:32:38

జలపుష్పాల సిరులు

జలపుష్పాల సిరులు

రాష్ట్ర వ్యవసాయరంగంలో స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారు. అనేక వ్యయప్రయాసాలకోర్చి ఆచరణసాధ్యంగా నిలబెట్టుకున్న కాళేశ్వరం బహుళ ప్రయోజనాత్మక నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన ఉపాంత ప్రయోజనాలు ఊహకందని స్థాయిలో బాహ్యప్రపంచం ముందు అనుభవపూర్వకంగా ఆవిష్కారమవుతున్నా యి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వస్తున్న జలసిరుల ద్వారా మత్స్యరంగానికి జవసత్వాలను కలుగజేయడం అత్యంత ప్రధానమైన ప్రయోజనంగా భావించాలి.

ఉమ్మడి పాలనలో దాదాపు అరవై ఏండ్ల పాటు పూర్తి నిరాదరణకు గురైన తెలంగాణ మత్స్యరంగంలో కాళేశ్వరం ప్రాజెక్టులు జలసిరులతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన నీటివనరులతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగా ‘సాంప్రదాయ మత్స్యరంగం’ (ఫిషరీస్‌)తోపాటుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి అవకాశం ఉన్న ‘జలసేద్యం’ (అక్వాకల్చర్‌) రంగాన్ని అభివృద్ధిచేయడానికి కూడా విస్తృతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఫిషరీస్‌, అక్వాకల్చర్‌ రంగాలను సమాంతరంగా విస్తరించేందుకు అవసరమైన ఆచరణాత్మక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం నియమించిన ఐదుగురు మంత్రుల ఉపసంఘం ఈ రంగాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికను రూపొందించింది. మత్స్యరంగం అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో ‘నీలి విప్లవం’ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌తో పాటుగా పలువురు మంత్రులు తెలిపారు. దేశంలో ఇతర రాష్ర్టాల కంటే విభిన్నమైన రీతిలో మన మత్స్యపారిశ్రామిక వ్యవస్థ అనేక వృత్తిపరమైన సాంప్రదాయాలతో ఉన్నది. సముద్రతీరం లేని కారణంగా ఇక్కడి వృత్తి మత్స్యకార కుటుంబాలు పూర్తిగా సాంప్రదాయ ఉపరితల జల వనరులైన చెరువులు, కుంటలు, నదులు, వాగులు, వంకలు లాంటి నీటి వనరుల్లో సహజసిద్ధంగా పెరిగే చేపల మీదనే  ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేపల పెంపకంలో ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న ఆధునిక విధానాల పట్ల అవగాహన అంతంత మాత్రమే. ఫలితంగా చేపల ఉత్పాదకతలో తెలంగాణకు చెందిన సాంప్రదాయ మత్స్యకారులు వెనకబడిపోయారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన నాలుగేండ్లుగా ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం, అనేక ప్రోత్సాహక కార్యక్రమాల అమలు ఫలితంగా సాంప్రదాయ మత్స్యకార కుటుంబాల్లో ఈ రంగంపట్ల ఆసక్తి, ఆదరణ పెరిగింది. పర్యవసానంగా మత్స్యసహకార సొసైటీలో సభ్యత్వం కోసం కొత్తతరం యువకుల్లో పోటీతత్వం పెరుగుతున్నది. మొత్తంగా తెలంగాణ మత్స్యరంగంలో ఒక నూతనోత్తేజానికి తెరలేచింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచిన ‘మిషన్‌ కాకతీయ’పథకం, గడిచిన రెండేండ్లుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా కనీవినీ ఎరుగనిరీతిలో వినూత్న జలదృశ్యాలు అన్నివర్గాల ప్రజల అనుభవంలో నిలిచిపోతున్నాయి. ఈ సానుకూలతలన్నీ రాష్ట్రంలో చేపల ఉత్పత్తికి అనుకూల పరిస్థితులను తీసుకువచ్చాయి. 

మత్స్యరంగానికి సంబంధించినంత వరకు గడిచిన రెండేండ్ల కాలం కీలకమైనది. ఇందులో ప్రధానమైనది కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీరు అందుబాటులోకి రావడమైతే, మరొక ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల భారీ నిధులతో అమలుజరిపిన ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ ముఖ్యమైనది. ఈ రెండు మౌళిక కారణాల పర్యవసానంగా రాష్ట్రంలో గడిచిన రెండేండ్లలో చేపల ఉత్పత్తిలో దాదాపు 24 శాతం వృద్ధి రేటును సాధించటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ కాలంనాటికి రాష్ట్రంలో వార్షిక చేపల మొత్తం ఉత్పత్తి గరిష్ఠంగా 2.46 లక్షల టన్నులుగా నమోదు కాగా, గత ఆర్షిక సంవత్సరం (2019-20)లో సుమారు 3.20 లక్షల టన్నుల ఉత్పత్తిగా నమోదైనది. అయితే ఈ వృద్ధి రేటును కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన నీటి సౌలభ్యానికి ముందున్న వనరుల నుంచి మాత్రమే సాధించిన ప్రగతి. ఇక అన్ని జల వనరుల్లో చేపల పెంపకం జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తే మత్స్య పరిశ్రమ గతంలో ఎన్నడూ లేని స్థాయిలో స్వయం సమృద్ధి సాధించనున్నది.   

(వ్యాసకర్త: ‘తెలంగాణ ఫిషరీస్‌ సొసైటీ’ వ్యవస్థాపక  అధ్యక్షుడు)


- పిట్టల రవీందర్‌


logo