సోమవారం 26 అక్టోబర్ 2020
Editorial - Sep 30, 2020 , 03:32:03

గవర్నర్‌ సిఫారసు కీలకం

గవర్నర్‌ సిఫారసు కీలకం

తొమ్మిదవ అధ్యాయం కొనసాగింపు..

ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నియమాలకు కట్టుబడి ఉండని స్థితిని ఘటనను లేదా ఉద్యమాన్ని గుర్తించటం సాధ్యపడదనేది నేను గట్టిగా చెప్పగలను. ఇది తరువాత వచ్చిన ఆలోచనగానీ, వాదన కోసం తెచ్చే వాదన కానీ కాదు. అది అత్యంత సహజమైన వాస్తవమైన కష్టదాయకమైన విషయం. బాబ్రీ మసీదును కూల్చిన మరుసటి రోజే లోక్‌సభలో జరుగుతున్న చర్చలో నేను జోక్యం చేసుకొని సభ దృష్టికి నేను తెచ్చిందిదే. జరిగిన సంఘటనల క్రమం ఈ విధంగా ఉంది. 1) కరసేవకులు అధిక సంఖ్యలో చేరుకోవటం 2)కట్టడాన్ని రక్షింపవలసిన బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వపు సందిగ్ధతా ధోరణి 3) కట్టడం చుట్టూ ఆందోళనకర వాతావరణం 4) రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రకటనలు 5) రథయాత్రలు 6) రాముని గుడి నిర్మించేందుకు ప్రజలు తమను ఎన్నుకున్నారనే బీజేపీ ప్రభుత్వ భావన. పై వాటిలో ఏ అంశంగానీ, లేదా ఒకదానితో ఒకటి కలిసిగాని ‘రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా నిర్వహింపబడజాలని స్థితి ఏర్పడిందని’ నిర్ధారింపజాలం.

గవర్నర్‌ రాష్ట్ర వ్యవహారాలు చూస్తూంటారు. గనుక ఇటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి గవర్నర్‌ నివేదిక ప్రామాణికం కాగలదు. గవర్నర్‌ నివేదికలో ఉన్నదానిననుసరించే రాష్ట్రపతి విధిగా నడుచుకోవాలని ఏం లేదు గాని, అధికరణం 356ను అమల్లోకి తెచ్చేముందు గవర్నర్‌ సిఫారసు అత్యధిక విశ్వసనీయతగలదిగా భావించబడి సాధారణంగా ఆమోదించబడుతుంది. ఒక్కో పర్యాయం గవర్నర్‌ నివేదిక కోసం వేచి చూడకుండానే భారత ప్రభుత్వం వద్ద గల సమాచారం ఆధారంగా ఏదో ఒక నిర్ణయం గైకోనేందుకు అవకాశం ఉంది. అయితే గవర్నర్‌ నుంచి నివేదికను కోరటం దానిని క్షుణ్ణంగా పరిశీలించటం ఆ తర్వాత అధ్యక్ష పాలన విధించటం దాదాపుగా ఆనవాయితీగా జరుగుతున్నది. ఏ విధంగా చూసినా గవర్నర్‌ అభిప్రాయం కేంద్రానికి అందినప్పుడు దానికి విలువ ఉంటుందనేది సుస్పష్టం. అధ్యక్ష పాలనకు స్పష్టమైన సిఫారసు సానుకూలంగానూ ఉండవచ్చు. స్పష్టమైన సానుకూల సిఫారసు చేసే సందర్భాలలో పూర్వాపరాల ఆధారంగా నిర్దుష్టమైన వివరాలను కూర్చి వాటి ఆధారంగా అధికరణం 356ను అమలుపరచవచ్చునని తెలియజేయటం జరుగుతుంది. అమలు పరచవలసిన అవసరం లేదన్న సందర్భాల్లో అధ్యక్ష పాలన వల్ల సంభవించే ఉపద్రవాలను, ప్రమాదాలను, పెను సమస్యలను తెలియజేస్తూ అధ్యక్ష పాలనకు వ్యతిరేకంగా సిఫారసు చేస్తారు. అటువంటి సందర్భాల్లో ఆయన చూపే కారణాలు ప్రబలమైనవిగా భావించాల్సి ఉంటుంది. ఎందువల్లనంటే అధికరణం 356ను అమలుపరిచినందువల్ల జరగబోయే బాగుకంటే అదనపు ఓగును పోగేసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరో ముక్కలో చెప్పాలంటే అధ్యక్షపాలన విధించకపూర్వపు స్థితికంటే విధించిన తరువాత అధ్వాన్నంగా ఉంటుందని.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo