మంగళవారం 20 అక్టోబర్ 2020
Editorial - Sep 29, 2020 , 02:42:51

చెదిరిన స్నేహం

చెదిరిన స్నేహం

‘గుర్రానికి ఎత్తేయాలనిపించింది, రౌతుకు దుంకాలనిపించింది’! మోదీ ప్రభుత్వం నుంచి వైదొలగడమే కాదు, ఎన్డీయే నుంచి కూడా అకాలీదళ్‌ వెళ్లిపోయింది. వ్యవసాయ బిల్లులను కారణంగా చూపినప్పటికీ, ఏదో క్షణాన బీజేపీకి దూరం కావలసిందేనని అకాలీదళ్‌ ముందే నిర్ణయానికి వచ్చింది. బీజేపీకి కూడా మిత్రపక్షాల అవసరం లేదు. అకాలీదళ్‌ను వదిలించుకోవాలనే భావిస్తున్నది. శివసేన తరువాత అకాలీదళ్‌ వంటి మిత్రపక్షాన్ని బీజేపీ కోల్పోవడం సాధారణ విషయం కాదు. వాజపేయి హయాంలో 1990 దశకం నుంచి బీజేపీ- అకాలీ మైత్రి పెనవేసుకున్నది. భారతీయ సమాజపు వైవిధ్యానికి అనుగుణంగా సంకీర్ణ ధర్మా న్ని పాటిస్తూ బీజేపీని ఎర్రకోట మెట్లు ఎక్కించిన వాజపేయి కాలం చెల్లిపోయింది. ఇది మోదీ నాయకత్వంలోని బీజేపీ తన అజెండాను అమలుచేస్తున్న దశ. నిజానికి బీజేపీ ఆట ఇప్పుడే మొదలైంది! 

మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు నాందేడ్‌లోని తఖ్త్‌ హజూర్‌ సాహిబ్‌ గురుద్వారా విషయంలో వ్యవహరించిన తీరు గమనార్హమైనది. ఈ గురుద్వారా బోర్డు అధ్యక్షుడిని నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేలా చట్టం చేసింది. సిక్కు మత వ్యవహారాలలో అకాలీలకు ఉన్న పట్టును సడలించడానికి ప్రయత్నించే ఆర్‌ఎస్‌ఎస్‌ అనుయాయి తారాసింగ్‌ను బోర్డు అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పంజాబ్‌లో బాదల్‌ కుటుంబానికి వ్యతిరేకంగా అకాలీ వర్గాలను ఏకం చేయదలిచిన ఎస్‌ఎస్‌ దిండ్సాకు మోదీ ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారాన్నిచ్చింది. 1984లో సిక్కులపై దాడి కేసులో బాధితుల పక్షాన పోరాడిన ప్రముఖ న్యాయవాది హెచ్‌ఎస్‌ ఫూల్కా కూడా బాదల్‌ కుటుంబానికి బద్ధ వ్యతిరేకి. ఆయనను కూడా పద్మభూషణ్‌తో సత్కరించింది. సిక్కులు హిందూ మతంలో భాగమంటూ 2000 సంవత్సరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత సుదర్శన్‌ వ్యాఖ్యానించడంతో అకాలీలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అప్పుడు కొంత తగ్గినా రాష్ట్రీయ సిఖ్‌ సంగత్‌ ద్వారా సిక్కు సమాజంలోకి చొచ్చుకుపోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నది. 

 మొత్తం భారతీయ సమాజం ఏకశిలా స్వరూపమనే సంఘపరివార్‌ సిద్ధాంతానికి అనుగుణమైన రాజకీయపక్షం బీజేపీ. పంజాబ్‌లోని వ్యవసాయవర్గం సిక్కుజాట్లు కేంద్రకంగా ఏర్పడిన ప్రాంతీయపార్టీ అకాలీదళ్‌. రెండింటికి పొసగదు. ప్రాంతీయ పార్టీలను మింగివేయాలనే బీజేపీ ప్రయత్నిస్తుంది. మరోవైపు పంజాబ్‌ జాట్‌వర్గం బాదల్‌ రాజకీయాల పట్ల విసిగిపోయి ఉన్నది. కాంగ్రెస్‌ నాయకుడు అమరీందర్‌సింగ్‌ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యమంత్రి అయ్యారు. పంజాబ్‌ సమాజంలోని అసంతృప్త వర్గాలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ వేదికగా మారింది. ఉనికి కోసం పోరాడుతున్న అకాలీదళ్‌, బీజేపీకి దూరమైతేనే మనుగడ సాధ్యమని భావిస్తున్నది. వ్యవసాయ బిల్లులు ఇందుకు ఒక సందర్భాన్ని కల్పించాయి. ఈ సందర్భం బీజేపీ సంగతినీ బయటపెట్టింది.


logo