బుధవారం 28 అక్టోబర్ 2020
Editorial - Sep 28, 2020 , 00:47:57

హింస వద్దన్న పరమహంస

హింస వద్దన్న పరమహంస

(గాంధీ శత జయంతి సందర్భంగా 23-10-1968న హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో జరిగిన రాష్ట్ర సదస్సులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన ప్రసంగం)

గాంధీజీ పుట్టి నేటికి వందేళ్లయింది. అయితే వారి సిద్ధాంతాల ప్రాముఖ్యతను బేరీజు వేయడంలో గడిచిన రెండు దశాబ్దాల కాలమే ఎంతో ముఖ్యమైనది. ఈ రెండు దశాబ్దాలలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. నిజానికి ఈనాడు గాంధీజీ ఆశయాలు, దృక్పథం అనుసరణీయాలు, కాలానుగుణ్యమైనవి అన్న విషయాలు చర్చనీయాంశాలు అయ్యాయి. గాంధీజీ అభిప్రాయాల మీద ఈనాడు ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయో, ఆయన ఉన్న రోజుల్లోనూ అన్ని అభిప్రాయ భేదాలుండేవి. అయితే ఆనాడు ఆయన సిద్ధాంతాలు ఆనాటికి వర్తిస్తాయా, వర్తించవా అన్న చర్చ అంతగా జరగలేదు. అందుకు ఒక విధంగా ఆయన వ్యక్తిత్వమే కారణం. 

ఆనాటి ఆంగ్ల ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం కూడా గాంధీజీ సిద్ధాంతాల మీద విశ్వాసాన్ని, గౌరవాన్ని కలిగించడానికి దోహదం చేసింది. గడిచిన ఈ రెండు దశాబ్దాలలోనూ మనం మూడు ఘట్టాలను అధిగమించినట్టు కనిపిస్తుంది. గాంధీజీని ఇంచుమించు దేవునిగా భావించగల వాతావరణం అలుముకున్న రోజులు పోయాయి. ఆ తర్వాత గాంధీజీని మహాత్ముడిగా పూజించడం, ఆయన 

ఆశయాలను గౌరవ ప్రపత్తులతో మననం చేసుకోవడం కేవలం నిత్యకృత్యాలుగా మారిన రోజులు కూడా పోయాయి. కొన్నేండ్ల కిందటే మనం మూడో ఘట్టంలోకి కూడా అడుగుపెట్టాం. రానురాను యంత్రతంతుగా జరిపించే ఆ తతంగం కూడా మందగిస్తున్న ఘట్టం ఇది. అందువల్ల ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంలో మనల్ని మనమే వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది. మళ్లీ మనం ఈ శ్రద్ధాసక్తులు లేని కార్యక్రమాలను పునరుద్ధరించడానికి ఈనాడు ప్రయత్నించాలా? లేక నిజమైన విశ్వాసంతో ఈ సిద్ధాంతాలను మనసారా గౌరవించి, గాఢంగా అభిమానించి అవగాహన చేసుకునేందుకు తోడ్పడే వాతావరణం సృష్టించు కోవాలా? అని.

సమాజం అస్తవ్యస్తం కాకుండా కొత్త మార్పులు తీసుకురావడమే మనం ఎప్పుడూ ఎదుర్కొంటూ ఉన్న క్లిష్ట సమస్య. అయితే దురదృష్టవశాత్తు మార్పులు తేకుండా అన్యాయాన్ని ఎదుర్కోవడం కానీ, సంఘ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయకుండా మార్పులు తేవడం కానీ సాధ్యపడలేదు. సాంఘిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయినప్పుడు మానవ సంఘం అనేక ఇక్కట్లకు లోనవుతుంది. 

గాంధీజీ దృక్పథం సమగ్రమైనది సమ్యగ్దర్శనాయుతమైనది అన్నంతమాత్రాన భవిష్యత్తులో ఈ దృక్పథం స్థానమేదో నిర్ణయించడంలో సందిగ్ధాలకు తావుండవలసిన పనిలేదు. ఆయన దృక్పథంలోని కాలాన్ని, ఎల్లలను కూడా అధిగమించి చరిత్రలో గాఢంగా నిలిచే సత్యాలేవో, దేశ కాల పరిధులకు లోబడిన అంశాలేవో గత రెండు దశబ్దాల చరిత్రే ధృవపరిచింది. ఈ దృష్టే ఆయనను ‘మహాత్ముడిని చేసింది’. మన దేశ అవధులను కూడా అధిగమించి సర్వత్రా పరివ్యాప్తం కాగల ఒక ప్రత్యేకతను ఆయన సిద్ధాంతాలకు ఆపాదించింది. ఈ గాంధేయ దృక్పథం ప్రసరింపజేయవలసిన వివిధాంశాలు దేశ కాలాలను బట్టి మారితే మారవచ్చు. ఆ విధమైన మార్పుకు అనుకూలంగా ఉండటం దాని ప్రాథమిక సత్య లక్షణానికే నిదర్శనంగానీ దాని అసమగ్రతకు కాదు. 

అసలు గాంధీజీ దృక్పథానికి సంబంధించిన అత్యంత మూలభూతమైన అంశమేది?.. ఇక్కడ మూలభూతం అనే మాటకు, ఈయన దృక్పథానికి సంబంధించిన ఇతర అంశాలు ఈ ప్రాతిపదిక సిద్ధాంతం నుంచి ఉద్భూతమౌతాయని మాత్రమే అర్థం కాక, వివిధ సమయాల్లోనూ, వివిధ పరిస్థితుల్లోనూ కూడా ఈ సిద్ధాంతాలు క్రియాశీలమైనవిగా ఉంటాయని భావించాలి. దీనిదృష్ట్యా, సాంఘిక పరివర్తన యొక్క గతిశీలతనే గాంధీజీ ప్రసాదించిన మూలసూత్రంగా పేర్కొనవచ్చు. ప్రసిద్ధ సాంఘిక శాస్త్రవేత్త కారల్‌ మార్క్స్‌ వలనే గాంధీజీ కూడా ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడమే కాకుండా దానిని మార్చవలసిన ఆవశ్యకతను కూడా గుర్తించారు. ఇటువంటి మార్పును సాధించడానికై ఆయన చూపించిన సాధనోపాయాలు వేలాది యుగాల మానవ చరిత్రలో అపూర్వమైనవి. సాంఘిక పరివర్తనను సాధించడానికి అప్పటివరకు బలప్రయోగం, యుద్ధం మాత్రమే సాధనంగా ఉండేవి. అయితే, గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన తొలి ప్రవక్త కాదు. ఆయనకు పూర్వం ఎందరో మహానుభావులు అహింసా ధర్మాన్ని ప్రబోధించారు. అయినప్పటికీ వారందరూ ‘అహింస’ను సమాజంలో వ్యక్తిగా మనుగడ సాగించడానికై మానవునికి అందుబాటులో ఉన్న ఒక జీవన విధానంగా మాత్రమే పరిగణించారు. అయితే వ్యక్తిగత జీవితంలో మార్పు తేవడానికే కాకుండా సమాజంలో మార్పు తీసుకొని రావడానికి, అంతర్జాతీయ జీవితంలో వివిధ సామాజిక వ్యవస్థల మధ్యగల సంబంధాలలో మార్పును తేవడానికి కూడా ‘అహింస’ను సాధనంగా వినియోగించవచ్చునని గాంధీజీ రుజువు చేశారు. ఇదే ఆయన విశిష్టత. 

గాంధీజీ ఈ విషయాన్ని కేవలం సిద్ధాంతం రూపంలో మాత్రమే ప్రతిపాదించినట్లయితే అదేమీ కొత్త విషయంగా భావించవలసి ఉండేది కాదు. గాంధీజీ ‘సత్యాగ్రహం’ అనే ఆచరణీయ సాధన ద్వారా తన సిద్ధాంతానికి స్ఫుటమైన, చైతన్యవంతమైన స్వరూపాన్నిచ్చి తద్వారా దానిని సాంఘిక కార్యసాధనకు పనిముట్టుగా రూపొందించారు. అప్పటివరకు సమాజంలో సాంఘిక పరివర్తన తేవడానికి హింసాయుత విప్లవం సాధనంగా ఉన్నట్లుగానే, సమాజాల మధ్య మార్పులు తేవడానికి యుద్ధం సాధనంగా ఉంటూ ఉండేది. ‘సత్యాగ్రహం’ అనేది అహింస ద్వారా సాంఘిక పరివర్తన తేవడానికి ఉద్దేశించిన శాంతియుత సాధనం. ఈ అంశం గాంధీజీని ఆయన తరంలోనే నైతిక, ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపజేసింది. మహర్షులు, మహానుభావులు సూచించిన నైతిక సూత్రాలును విడనాడకుండానే అన్యాయాలకు గురైన పీడిత ప్రజలకు, సామాన్య ప్రజలకు ఒక కొత్త ఆశాకిరణాన్ని సూచించి చైతన్యయుతమైన ఒక మహా సందేశం ఇవ్వగలిగిన సాంఘిక విప్లవకారిగా ఆయనను రూపొందించింది.

సమాజం అస్తవ్యస్తం కాకుండా కొత్త మార్పులు తీసుకురావడమే మనం ఎప్పుడూ ఎదుర్కొంటూ ఉన్న క్లిష్ట సమస్య. అయితే దురదృష్టవశాత్తు మార్పులు తేకుండా అన్యాయాన్ని ఎదుర్కోవడం కానీ, సంఘ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయకుండా మార్పులు తేవడం కానీ సాధ్యపడలేదు. సాంఘిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయినప్పుడు మానవ సంఘం అనేక ఇక్కట్లకు లోనవుతుంది. అయితే అసలు మార్పే కానప్పుడు మరొక విధమైన అవినీతి, అన్యాయం సంఘంలో ప్రబలుతాయి. ఒక అహింసాయుతమైన సహాయ నిరాకరణే సత్యాగ్రహం. అట్టి సత్యాగ్రహం ఈ సందిగ్ధతను తొలగించి; అక్రమాలను, అన్యాయాలను ఎదుర్కోవడానికి, మార్పు తేవడానికి మార్గాన్ని సూచించింది. మానవ వ్యవస్థ యొక్క మూల ప్రాతిపదికకు భంగం లేనిరీతిగా కొత్త మార్పులు తీసుకురావడానికి ఈ సాధనం ద్వారా అవకాశం ఏర్పడింది.

గాంధీజీ మరణించిన తర్వాత అన్యాయాలను, బలప్రయోగ పద్ధతులను, హింసను నైతిక శక్తితో ఎదుర్కొనవలసి వచ్చిన సందర్భాలలో ప్రపంచవాప్తంగా అనేకచోట్ల సత్యాగ్రహమనే ఆయుధాన్ని ఉపయోగించడం జరిగింది. అయితే మనకు స్వాతంత్య్రం లభించినంత మాత్రాన అక్రమాలను, అన్యాయాలను ఎదుర్కోవలసిన పరిస్థితులు అంతం కాలేదు. గ్రామస్థాయిలో సాంఘిక సమైక్యత అనేది ఇప్పటికీ ప్రధాన సమస్యగానే ఉండిపోయింది. గ్రామాలు అభివృద్ధిచెందుతున్న మాట నిజమే. కానీ, దీనివల్ల అసమానతలు ఎక్కువ అవుతున్నాయి. తత్ఫలితంగా ఉద్రేకాలు పెరిగిపోతున్నాయి. మన సాంఘిక వ్యవస్థలో అక్రమాలకు, అన్యాయాలకు గురవుతున్నవారికి చిహ్నంగా నిలిచిన హరిజనులను ఇతరులను పూర్తిగా సంఘంలో సమైక్యం చేయడం జరగలేదు. ఇది జరగనంతకాలం భారత సాంఘిక వ్యవస్థకు గట్టి పునాదులు ఏర్పడ్డాయని చెప్పలేము.

 గ్రామస్థాయిలోని అక్రమాలను, ఎదుర్కొనడానికి సాంఘిక పోరాటంలో గాంధీజీ కొత్త నైతిక ఆయుధాలను ఉపయోగించారు. అయితే ఆ స్థాయిలో ఆ అక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల ఈ సమస్యలు ఎందుకు, ఎక్కడ కొనసాగుతున్నాయనే విషయాలను కూలంకషంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి గాంధీజీ సూత్రాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతోనే ఈ శతజయంతి ఉత్సవాలను మనం నిర్వహించుకోవాలి. స్పష్టంగా చెప్పాలంటే మనం పరిష్కరించుకోవాల్సిన సమస్యలు, నేటి మన గ్రామీణ వ్యవస్థ స్వరూప, స్వభావాలేమిటి? ఈ వ్యవస్థలోని ఉద్రిక్తతలు ఏమిటి? ఈ ఉద్రిక్తతలకు కారణాలేమిటి? గాంధీజీ ప్రబోధాలను అనుసరించి, వీటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ముఖ్యంగా గ్రామాలలోని హరిజనుల స్థితి ఎలా వుంది? గ్రామ జీవితంలో వారు ఎంత మేరకు కలిసిపోయారు? వారు అలా కలవనట్లయితే దానికి గల అడ్డంకులేమిటి? కనీసం ఇప్పటికైనా గాంధీజీ ప్రబోధాల ప్రాతిపదికగా వారిని సంఘంలో సమైక్యం చేసుకోవడానికి మనం ఏమి చేయగలుగుతాము? అదే విధంగా మన పట్టణాల్లో వివిధ కుల, మత వర్గాల మధ్య ఉద్రిక్తతలకు కారణాలేమిటి? ఏ రాజకీయ, లేక ఇతర కారణాలు యీ పరిస్థితులను మరింత క్లిష్టం చేస్తున్నాయి? - ఈ సమస్యలను మనం సమగ్రంగా పరిశీలించినప్పుడు పరిష్కారం నిమిత్తం ఏదో ఒక నిర్దిష్ట కార్యక్రమం రూపొందుతుంది. దానిని కనీసం ప్రయోగాత్మకంగానైనా చేపట్టి అమలు జరుపుకోవచ్చు. 

గాంధీజీ మరణించిన తర్వాత అన్యాయాలను, బలప్రయోగ పద్ధతులను, హింసను నైతిక శక్తితో ఎదుర్కొనవలసి వచ్చిన సందర్భాలలో ప్రపంచ  వాప్తంగా అనేకచోట్ల సత్యాగ్రహమనే ఆయుధాన్ని ఉపయోగించడం జరిగింది.

సమాజంలో సాంఘిక పరివర్తన తేవడానికి హింసాయుత విప్లవం సాధనంగా ఉన్నట్లుగానే, సమాజాల మధ్య మార్పులు తేవడానికి యుద్ధం సాధనంగా ఉంటూ ఉండేది. ‘సత్యాగ్రహం’ అనేది అహింస ద్వారా సాంఘిక పరివర్తన తేవడానికి ఉద్దేశించిన శాంతియుత సాధనం.

జీవితాన్ని సమగ్రమైనదానిగా, సంపూర్ణమైనదానిగా గాంధీజీ దర్శించారు. విశ్వాసం అనేది ఆత్మ ఐక్యతాభావం. ఆయన దృష్టి ఎప్పుడూ హృదయంలోని విశ్వాసంతో గాఢంగా పెనవేసుకొని జీవితంలోకి ఎదిగి చిగుర్లు వేస్తుంది. అందువల్లనే ఆయన పనులు ఆయన హృదయానికి దర్పణాలుగా నిలుస్తాయి. రాజకీయ విషయాలలోనే కాక ఆర్థిక, సాంఘిక, విద్యా విషయాలలోనూ, వ్యక్తిగత, నైతిక విషయాలలోనూ గాంధేయ మార్గం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనదొక సమగ్ర దృష్టి. ముందుగా లోలోపల సమైక్యతను సాధించడం ద్వారా సర్వ ప్రపంచంలోనూ సమ్యక్‌ దృష్టిని సాధించడానికి వీలైన సమగ్ర దృష్టి వారిది. ఇది ఇతర పరిస్థితుల్లోనూ, అభిప్రాయాలను విస్మరించే పిడివాదం కానీ, మూఢ సిద్ధాంతం కానీ కాదు. సంకుచిత ధోరణిని విశ్వమానవ దృక్పథంగా ప్రదర్శించడమూ కాదు. 


logo