బుధవారం 28 అక్టోబర్ 2020
Editorial - Sep 28, 2020 , 00:47:54

ప్రజాస్వామ్యంపై తిరుగుబాటు

ప్రజాస్వామ్యంపై తిరుగుబాటు

  • ఎనిమిదవ అధ్యాయం కొనసాగింపు..

ఆవిషయాన్ని రాజ్యాంగ నిపుణులు పరిశీలించాల్సి ఉంది. రాజ్యాంగ బద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన చేయలేని స్థితి ఎప్పుడు ఏర్పడింది? అసలు ఖచ్చితమైన అంశమేది? (ప్రసంగం పూర్తి పాఠం కోసం అనుబంధం XIII చూడండి). ఏది ఏమైనా ఇదంతా గతజల సేతుబంధనమే. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆలోచించవలసిందేమంటే జరిగిన తప్పును సరిదిద్ది మైనారిటీల హక్కులకు రక్షణ కల్పించి సమస్యకు ఉభయులకూ ఆమోదయోగ్యమైన సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనేదెలా అనే. దానికోసం కేంద్ర ప్రభుత్వం ద్విసూత్ర పథకాన్ని రూపొందించింది: (1) వివాదంలో ఉన్న ఆస్తిని స్వాధీనపరచుకొని హిందువులకు, ముస్లిములకు ఇరువురకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేవరకు పరిస్థితిని స్తంభింపజేయటం. (2) భారత రాజ్యాంగంలోని అధికరణం 143 కింద దేశాధ్యక్షుని ద్వారా ప్రధాన వివాదాంశాన్ని తేల్చి చెప్పేందుకు సుప్రీంకోర్టును కోరటం.

ఈ రెండు నిర్ణయాలు డిసెంబరు 27న ఇంకా యిలా విపులీకరించబడినాయి: అలహాబాద్‌ హైకోర్టులో పెండింగులో వున్న దావాలలో వివాదంలో ఉన్న స్థలాలనన్నింటినీ ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించింది. వివాదంలోవున్న కట్టడం ఉన్న స్థలాన్ని మినహాయించి మిగతా స్థలాన్ని రామమందిర నిర్మాణం, మసీదు నిర్మాణం చేపట్టే రెండు ట్రస్టులకు అప్పగించి అక్కడ చక్కగా అభివృద్ధి పథకాలను రూపొందించమని తెలియజేయటం. భారత ప్రభుత్వం గైకొన్న మరో నిర్ణయమేమంటే వివాదంలో ఉన్న కట్టడం నిర్మించిన తావున ఒక హిందూ దేవాలయం ఉండేదా లేదా అనే విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని సేకరించవలసిందిగా దేశాధ్యక్షున్ని కోరటం. సుప్రీంకోర్టు సలహాకు కట్టుబడి ఉండాలనీ, ఆ సలహాననుసరించి తగిన చర్యలు గైకొనాలని కూడ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం స్థల సేకరణ నిర్ణయాన్ని అలా వుంచి మిగతా విషయాల్లో ఆర్డినెన్స్‌ జారీ చేయకముందు ఉన్న స్థితి సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని యిచ్చేవరకు కొనసాగుతుంది. ఆ తరువాత కోర్టు అభిప్రాయానికి అనుగుణంగా ఇరువర్గాల హక్కుల విషయం తేల్చబడుతుంది.

ఈ నిర్ణయాలకు అనుగుణంగా ‘ఎక్విజిషన్‌ ఆఫ్‌ సర్టెన్‌ ఏరియా ఎట్‌ అయోధ్య ఆర్డినెన్స్‌' పేరిట 1993 జనవరి 7న రామజన్మభూమి-బాబ్రీ మసీదు సముదాయం వద్ద 67.703 ఎకరాల భూసేకరణ నిమిత్తం ఆర్డినెన్స్‌ జారీచేయబడింది. అదే రోజున రాజ్యాంగంలోని అధికరణం 143 క్రింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరటం జరిగింది.

కేంద్ర ప్రభుత్వపు ఈ రెండు చర్యలు దానిపై తిరిగి దాడికి లక్ష్యాలయ్యాయి. ముస్లిములు, రాజకీయ నాయకులు కూడ తమ వాక్బాణాలను సంధించారు. అంతేగాక భూసేకరణ ఆర్డినెన్స్‌/ చట్టం, దేశాధ్యక్షుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరటాన్ని ప్రత్యర్థులు కోర్టులో సవాలు చేయగా ఐదుగురు సభ్యులు గల ఒక ప్రత్యేక ధర్మాసనం ఒక సంవత్సరంపాటు వారి వాదనలను విన్నది. 1994 డిసెంబరు 24న వెలువడిన తీర్పుతో సుప్రీంకోర్టు వివాదంలో ఉన్న భూమిని, దాని చుట్టుప్రక్కల భూమిని కేంద్ర ప్రభుత్వం సేకరించటంలోని న్యాయసమ్మతాన్ని ధృవీకరిస్తూ తీర్పులో పేర్కొన్న కారణాల వల్ల తనను అభిప్రాయం చెప్పమని కోరిన అంశంలో సమాధానం చెప్పేందుకు నిరాకరించింది.

కేంద్ర ప్రభుత్వం తరఫు వాదన ఏమంటే నెలకొన్న పరిస్థితుల్లో, 1992 డిసెంబరు 6నాటి అయోధ్యలోని సంఘటనల కారణంగా, దేశవ్యాప్తంగా వ్యాపించిన మతకల్లోలాలను దృష్టిలో వుంచుకొని పై రెండు నిర్ణయాలు గైకొనటంలోని ఉద్దేశ్యం సమస్యకు చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనేందుకే. ఒకవేళ అందులో సఫలత చేకూరకపోతే కేంద్ర ప్రభుత్వం వివాదాన్ని పరిష్కరించేందుకు ఇతరత్రా ఏదయినా తగిన చర్యలు గైకొని వివాదాన్ని పరిష్కరించి దేశంలో సామరస్యాన్ని నెలకొల్పేందుకే. వివాదంలో ఉన్న స్థలాన్ని స్వాధీన పరచుకొన్నది దానిపై హక్కున్న వారి హక్కుల్ని హరించివేసేందుకుగానీ, పరిష్కారం లభించిన తరువాత మిగులు భూమిని అట్టే పెట్టుకునేందుకుగానీ, భూసేకరణ ఫలప్రదం చేసేందుకు కాని కానేకాదని వివరణ ఇవ్వటం జరిగింది. దేశవ్యాప్తంగా మత సామరస్యం దిశగా కృషి రాజ్యాంగ పరంగా ప్రధానావశ్యకమనీ, అయోధ్యలో 1992 డిసెంబరు 6 నాటి సంఘటన దృష్ట్యా వివాదాన్ని మరింతగా పెంచకుండా ఉండటమే ఈ దిక్కుగా చేపట్టవలసిన ముఖ్యమైన చర్య అనీ, అలా చేసినందువల్ల లౌకికత్వపు సంప్రదాయాలను విచ్ఛిన్నం చేయకుండా నిస్సందేహంగా అభివృద్ధిపరచాలనే ఆలోచనతో ఆ చర్యలు చేపట్టటం జరిగింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విధంగా ఈ కోర్టు ఉత్తర్వును ఏమాత్రం బిడియం లేకుండా మొండిగా ధిక్కరించి బాబ్రీ మసీదును ధ్వంసం చేయటమన్నది నిజానికి చట్టం, రాజ్యాంగం హుందాతనానికి పెనుసవాలే. ఈ విధమైన ఉల్లంఘన వాస్తవానికి రాజ్యాంగ ఉల్లంఘనేగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగపరమైన అధికారాల ఉల్లంఘన కూడా. కూల్చివేత అన్నది లౌకిక పునాదులపై నిలిచిన ప్రజాస్వామ్యంపై కనీవినీ ఎరుగని తిరుగుబాటు. ఈ కోర్టు హుందాతనంపై, నిర్ణయాధికారంపై తిరుగుబాటు. కోర్టు మునుపెన్నడూ లేని విధంగా మోసానికి గురయ్యింది..’ అంటూ తన తీర్పును యిలా కొనసాగించింది. ‘ఈ అభియోగంలో పరిణామాలు విచారించనవసరం లేకుండానే వెల్లడయ్యేదేమంటే.. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం దాని అధికారులు కూడ కోర్టుకు అనేక బాధ్యతాయుత వాంగ్మూలాలను సమర్పించి కూడా చాలా తీవ్రమైన చర్యలకు పాల్పడటం! అటువంటి చర్యల్ని అనుమతించటం జరిగింది గనుక అప్పటి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌ను కోర్టులో వాంగ్మూలాలు సమర్పించిన అధికారుల్ని లేదా యితరంగా ఈ వ్యవహారంతో సంబంధమున్న వారిని వారిపై కోర్టుధిక్కార నేరం క్రింద ఎందుకు చర్యలు చేపట్టరాదో కారణాలు చూపెట్టవలసిందిగా కోరుతూ స్వయంప్రేరిత నోటీసు జారీ చేయవలసి వచ్చింది’. 

కోర్టుధిక్కారం విషయంలో వివరాల్లోకి వెళ్తూ.. సుప్రీంకోర్టు ఇంకా యిలా వ్యాఖ్యానించింది.. ‘కల్యాన్‌ సింగ్‌ తన వ్యక్తిగత హోదాలోనూ, తన ప్రభుత్వం తరఫున సమర్పించిన వాంగ్మూలాన్ని ఘోరంగా ఉల్లంఘించటం జరిగింది. ఉత్తర్వులకు బుద్ధిపూర్వకంగానే అవిధేయత ప్రకటించటం జరిగింది.’

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo