బుధవారం 28 అక్టోబర్ 2020
Editorial - Sep 27, 2020 , 00:10:47

పరీక్షిత్తుసప్తాహం

పరీక్షిత్తుసప్తాహం

“ఎండిన మ్రోడులే కిసలయించెనొ! ఏకశిలాపురమ్ములో

బండలు పుల్కరించెనొ! అపార ముదమ్మున తెల్గు తల్లికిన్‌

గుండెలు పొంగిపోయి కనుగొల్కులు నిండెనొ! పచ్చిపైరులే

పండెనొ! జాలువారిన భవత్కవితామృత వర్షధారలన్‌.”

‘సహజ పాండిత్య కవితాశ్రీ’ పోతన్నకిది ‘కరుణశ్రీ’ పాపయశాస్త్రి ఘటించిన ఘనమైన అక్షర కుసుమాంజలి. ఇది అక్షరసత్యం. పోతన లేఖిని భక్తి కవితామృతవర్షిణి. ఆ సుధా ధారలతో తడిసి, తనిసి ఏకత్ర ఏకశిలాపురంలో మాత్రమే కాక తెలుగునాట సర్వత్ర ఎండిన మ్రోడులు కూడా లే చిగుళ్లు తొడిగాయి, పుష్పించి ఫలించాయి. చైతన్య రసప్లావితాలై బతుకు బండలు పులకరించాయి. అమంద ఆనందంతో తెనుగుతల్లి గుండె పొంగి పొరలి కనుగొల్కులు నిండగా పచ్చని పైరులు మెండుగా పండాయి. ఇదీ కవి కర్షకుని వ్యవసాయానికి సంపూర్ణ ఫలసాయం.

పరీక్షిత్తును శపించి శృంగి, తండ్రి శమీకుని మెడలో వేలాడుతున్న మృతసర్పాన్ని చూచి పెద్దగా రోదించాడు. భాగవతంలో సర్పము సంసారానికి ప్రతీక. శమీకుని విషయంలో అది మృతం. కానీ పరీక్షిత్తు పట్ల అదే అమృత స్వరూపం. చిత్రం చూడండి, ఆశ్రమంలో పరీక్షిత్తు ప్రార్థనాలాపాలు, ‘వారి’ కొఱకు చేసిన విన్నపాలు శమీకునికి వినిపించలేదు. మెడలో చచ్చిన పాము వచ్చిపడ్డా సమాధి చెడలేదు. కానీ, రాజు ఆశ్రమం విడిచి వెళ్లగానే ఆత్మజుని ఆక్రందనం ఆలకించి మెల్లగా కళ్లు తెరిచాడు. తన మూపున వేలాడే మృతసర్పాన్ని చూసి నిర్లిప్తంగా- ఏమీ జరగనట్లుగా తీసి దూరంగా విసిరేశాడు. దివ్యదృష్టితో అంతా దర్శించి నందనుని (కొడుకు) నిర్వాకానికి నిర్వేదం చెందాడు. చేసిన తప్పు చిన్నది. పడిన శిక్ష చాలా పెద్దది. అత్యంత క్రూరమైనది. పైగా ఎవరికి? పురుషోత్తముని పూర్ణప్రేమకు పాత్రుడైన పరీక్షిత్తుకి! పరమ భాగవతునికి! ధర్మపాలకుడైన ధరణీపతికి! ఆకలిదప్పికలతో అలమటిస్తూ ఆశతో ఆశ్రమానికి విచ్చేసిన అతిథి దేవునికి సత్కారానికి బదులు శాప ప్రదానమా? తనయుడు తెగించి చేసిన తిరుగులేని- త్రిప్పలేని శాపమనే పాపానికి తండ్రి మిక్కలి సంతాపం చెందాడు. విచారిస్తూ ఇలా అన్నాడు-

ఆ. ‘తల్లికడుపులోన దగ్ధుడై క్రమ్మఱ

గమలనాభు కరుణ గలగినాడు

బలిమి గలిగి ప్రజల బాలించుచున్నాడు

దిట్ట వడుగ రాజు దిట్ట దగునె?’

తండ్రీ! ఆ పరీక్షిత్తు తల్లి గర్భంలో ఉండగానే అశ్వత్థామ అస్ర్తాగ్నికి ఆహుతయ్యాడు. మరల కృష్ణుని కృపతో బ్రతికి బయటపడ్డాడు. (కనుకనే, విష్ణువుచే రక్షితుడు, దత్తుడు కాన విష్ణురాతుడని పరీక్షిత్తుకు పేరు) ప్రభువై ఇప్పుడు పరాక్రమంతో ప్రజలను కంటికి రెప్పలా పాలిస్తున్నాడు. ఓరి పిచ్చినాయనా! అంతటి మంచి మహారాజును ఇలా సాహసించి శపించవచ్చునా? అని తాత్వర్యం.

ఈ ఆటవెలది పద్యం ఆమూలకం. శృంగి చేసిన పాపం ఏ ప్రాయశ్చిత్తానికి పొయ్యేది కాదు. అందుకే ‘పాపము తొలగింపు కృష్ణ! పరమేశ! హరీ!’- అని తమని క్షమించమని శమీక ముని వెన్నుని (విష్ణువు)తో విన్నవించుకున్నాడు. ‘శమము’ అనగా మనోనిగ్రహం. ‘శమార్థం సర్వశాస్ర్తాణి నిర్మితాని’- సకల శాస్ర్తాలకు శమమే, మనోజయమే అంతిమఫలం. శమము కలవాడే శమీకుడు. శాంతచిత్తుడే సర్వశాస్త్రపారంగతుడు. అట్టివారు అందరూ శమీకులే! శృంగిది క్రీడాసక్తమైన బాల్యావస్థ. అతనిని ‘అతి తేజస్వీ’ అని పరిచయం చేస్తాడు సూత పౌరాణికుడు. ‘తపోబలసంపన్నుడు’ అని ఆ మాటని వ్యాఖ్యానించాడు శ్రీధరుడు.

శృంగి పరీక్షిత్తుకి ఇచ్చిన శాపం ఫలించడం మనకు తెలిసిందే. ఐతే, తెలియంది ఒకటుంది. బాలుడైన శృంగి చేసిన తపస్సు ఏముంది? అని. ఐనా వాక్కు ఎలా సిద్ధించింది? ఇక్కడ వ్యాఖ్యాత అపూర్వంగా అద్భుత వివరణ ఇచ్చాడు. శృంగి జన్మించిన అంగిరస వంశంలో పితృ, పితామహాది అనేక తరాల పూర్వీకులలో అసత్యవాదులెవ్వరూ లేరట! ‘సత్యప్రతిష్ఠాయాం క్రియా ఫలాశ్రయత్వమ్‌' అని పాతంజల యోగసూత్రం. సత్యము ప్రతిష్ఠితం అనగా సుస్థిరమైన చోట వాక్కు శుద్ధమై సిద్ధిని పొందుతుంది. అంటే, అన్నమాట ఉన్నమాటై అయి తీరుతుంది. ఆ ఆనువంశిక సంస్కారమే శృంగికి శాపప్రదాన సామర్థ్యం కల్గించింది. ‘వాచి వీర్యం ద్విజానాం’- విప్రులకు వాక్కులోనే వీర్యం!

శమీకుడు శిష్యుని ద్వారా శాపవార్తను బాధ్యతగా భూపతికి చేరవేశాడు. అపరిహార్యమైన- విరుగుడు లేని మరణ శాసనం! స్వయంకృత అపరాధం కనుక శాపానికి వెఱవనూ లేదు, వెఱగు పడనూ లేదు. కాని, తన పాపానికి మాత్రం మిక్కలి సంతాపం పొందాడు. పురుషార్థపరుడు కాన మరణ సమస్యను జీవించి ఉండగానే తీర్చుకోవాలని తీర్మానించుకున్నాడు. స్వర్గభోగాల మీద మోహం ఉండి ఉంటే వారం రోజుల ఆయుర్దాయం ఉంది కనుక పాంచాహ్నిక (ఐదు దినాల) దీక్షతో అగ్నిష్టోమం చేసి ఉండేవాడు. కాని, పరవైరాగ్యం పొంది ఇహ, పర సుఖభోగాల ఆసక్తిని వదిలాడు. జ్యేష్ఠపుత్రుడు జనమేజయునికి రాజ్యభారం అప్పగించి మోక్షాపేక్షతో గంగాతీరంలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు పరిత్యజించాలని ప్రతిన పూనాడు.

క. ‘చిత్తము గోవింద పదా

యత్తము గావించి మౌనియై తనలోనే

తత్తఱము లేక భూవర

సత్తముడు వసించె ముక్తసంగత్వమునన్‌.’

సూతుడు శ్రోతలకు చెప్పుతున్నాడు- సర్వసంగ పరిత్యాగం చేసి ఆ రాజశ్రేష్ఠుడు విష్ణుపదీ (గంగా) తీరంలో ప్రాయోపవిష్టుడై మనసును కృష్ణుని దివ్య పాదారవిందాలతో నివిష్టం (లగ్నం) చేసి మరణభయాన్ని వీడి మాటలుడిగి మౌనంగా కూర్చున్నాడు. ఈ సంగతి తెలిసి అత్రి, అగస్త్య, వశిష్ఠ, విశ్వామిత్ర, పరాశర, వ్యాస, నారదాది బ్రహ్మర్షులు, దేవర్షులు ఇంకా రాజర్షులు వియన్నదీ తీరానికి వచ్చేశారు. వీరంతా పరీక్షిత్‌ నిర్యాణ దర్శనం కొఱకు, భావి వృత్తాంతం తెల్సినవారు కనుక భాగవత అమృతపానం కొఱకు వచ్చారు తప్ప గంగాస్నానం కొఱకు కాదు. ఎందుకని? వారు తీర్థాలకే తీర్థత్వాన్ని చేకూర్చగల పుణ్యతీర్థ స్వరూపులు కనుక. అవనీపతి (రాజు) వారిని అర్చించి, అంజలి ఘటించి- ‘సప్తదినాలలో సంసార బంధాలు సమసిపోయి కంసారి (కృష్ణుని) చరణ సన్నిధానం చేకూరే సాధనం ఏమిటో శెలవియ్యండి’ అని అర్థించాడు. గంగా స్నాన ఫలంగా తనకు మహర్షుల సత్సంగ జ్ఞానగంగా నిమజ్జన మహాభాగ్యం కల్గినందుకు పరమానందం పొందాడు. ఈ సందర్భంగా గంగామాతను వర్ణిస్తూ పోతన తనదైన మరో హృద్యమైన కంద పద్యం పలికాడు. మూలంలో ‘గంగాచదేవీ’ అని మాత్రమే ఉన్నదానికి ఇది ఇంపుసొంపుల పెంపుదల-

క. ‘అమ్మానిను జూచిన నరు

బొమ్మాయని ముక్తి కడకు బుత్తువటక కృపన్‌

లెమ్మా నీ రూపముతో

రమ్మా నా కెదుర గంగ, రమ్యతరంగా.’

‘అమ్మా! గంగమ్మా! నీ తరంగాలే ఇంత అందంగా ఉంటే నీ అంతరంగం ఇంకెంత అనురాగ భరితమో కదమ్మా! ‘అంబ త్వద్దర్శనాత్‌ ము క్తిః’- అలా కానిచో నీ దర్శనమాత్రంతోనే భక్తులకు ముక్తినిస్తావా తల్లీ? కనికరించి కదలి నాకెదురు రావమ్మా! నీ మంగళ మాతృ రూప దర్శనం నాకనుగ్రహించమ్మా!’ అని ప్రార్థించాడు. అమ్మా, బొమ్మా, లెమ్మా, రమ్మా- అని నాలుగుసార్లు ద్విత్వ‘మ’కార ఆవృత్తి వలన పద్యం పఠిస్తుంటే భావుక భక్తుల మనస్సు సుఖపడుతుంది. శ్రవణానందం సరేసరి!logo