బుధవారం 28 అక్టోబర్ 2020
Editorial - Sep 26, 2020 , 00:06:57

దొరకునా ఇటువంటి బాలు!

దొరకునా ఇటువంటి బాలు!

పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తుచేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు పాట పెదవి విప్పింది. గుండె గొంతుకలో వేదన సుడులు తిరిగితే మౌన రోదనగా పాట పుట్టింది. ఆనందం అర్ణవమైతే మనసుకు రెక్కలొచ్చి పాట పుట్టింది. పుడితే ఉయ్యాల పాటనుండి పోతే మొయ్యాల్సిన పాటదాకా బతుకంతా పాటే. 

ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణాన్ని తంత్రీవాద్య సమన్వితంగా పాడుకోవడానికి వీలుగా రాసినట్లు స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు. ఎలా పాడాలో ఆశ్రమంలో మొదట లవకుశులకే నేర్పాడు. ఆ రామగీతాన్ని తొలిశ్రోతగా తానే విని పరవశించి, తృప్తిగా లవకుశుల ముఖతః లోకానికి వినిపించాడు. వచనం ఎంత గొప్పదయినా గుర్తుపెట్టుకోవడం అంత సులభం కాదు. వచనాన్ని రాగంతో పాడటం చాలా కష్టం. శ్లోకం, పద్యం, పాటలో నియతి ఉంటుంది. రాగం ఉంటుంది. యతిప్రాసలు ఉంటాయి. ఛందో అలంకారాలు ఉంటాయి. రాగం తోడయిన పదం అనురాగమై వెంటపడుతుంది. ఒక తూగులో, లయలో ఆ సాహిత్యం వచనం కంటే పదికాలాలపాటు గుర్తుంటుంది. వచనం కంటే సాంద్రమై నెమరువేతకు సులభమవుతుంది. పాట శ్లోకం, పద్యంగా పరిణమించింది. పాటంటే తెలుగులో సినిమా పాటలే అన్నంతగా వ్యాప్తి పొందింది. ఆ పాటల పూదోటలకు ఘంటసాల ఒక తోటమాలి. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మరొక తోటమాలి. 

బాలు జీవితకాలం డబ్భు నాలుగేండ్లు. ఇరవై ఏండ్ల వయసులో పాడటం మొదలుపెట్టి నలభై వేల పాటలు పాడాడు. నలభై వేలను యాభైనాలుగేండ్లతో భాగిస్తే సంవత్సరానికి ఏడు వందల నలభై పాటలు. అంటే నెలకు అరవై రెండు పాటలు. సగటున రోజుకు రెండు పాటలు పాడినట్లు. ఒక మనిషికి ఇది సాధ్యమేనా? బాలుకు మాత్రమే సాధ్యం. 

అతిపరిచయం వల్ల చెప్పడానికి ఏమీ మిగిలి ఉండదు. అలా బాలసుబ్రహ్మణ్యం గురించి, ఆయన పాటల గురించి తెలియనిదెవరికి? ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏముంది? గొప్పగా పాడాడు. కష్టమయినవి పాడాడు. సులభంగా పాడాడు. సున్నితంగా పాడాడు. సంప్రదాయం ఒడిసిపట్టుకుని పాడాడు. స్పష్టంగా పాడాడు. తెలుగును తెలుగులా పలికాడు. అక్షరాన్ని మింగేయకుండా పాడాడు. ఊపిరి బిగబట్టి పాడాడు. 

దిక్కరీన్ద్ర జిత హిమగిరీన్ద్ర సిత 

కంధరా నీలకంధరా

క్షుద్రులెరుగని రుద్రవీణ 

నిర్నిద్రగానమిది అవధరించరా 

విని తరించరా! అన్నాడు. 

ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో

నా మదిలో నీవై నిండిపోయెనే! అన్నాడు. 

పారేసుకోవాలనారేసుకున్నావు..

నీ ఎత్తు తెలిపింది కొండగాలీ.. అన్నాడు. 

ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగిస్తే బాలు పాటల చరిత్ర పూర్తవుతుంది? తెలుగుపాట అప్పుడు ఘంటసాలను కోరుకుంది. ఆయన పోతూ పోతూ ఆ పాటను బాలు చేతిలో పెట్టి వెళ్లాడు. బాలు పోతూ పోతూ ఆ పాటను ఎవరిచేతిలో పెట్టాలో తెలియక వెళ్లిపోయాడు. అయినా.. ‘పిళ్లి పిళ్లకు పెల్లి చేసి, పెల్లీడు పిళ్లకు పెల్లి’ చేసే నేటితరం గాయకులకు, శ ష స అన్నవి దేనికవిగా విడి విడి అక్షరాలని   తెలియని గాయకులకు, ఉండిపోరాదే అని అనలేక ఉం డిప్పోరాదే - గుండెనీదేలే, గుండె కేనన్నే ... అని భాషోచ్చారణ తెలియని పరభాషా పరవశ గాయకులకు తెలుగు చెప్పడం హత్యానేరంతో సమానం. 

పాటంటే నిజానికి ఒక పల్లవి. రెండు చరణాలే. కానీ మాటలు చెప్పలేని భావమేదో పాటలు చెప్పాలి. పాటలో ఒక్కొక్క మాట వేనవేల మాటలుగా ప్రతిధ్వనించాలి. ప్రతిపదం భావార్థంగా ప్రతిఫలించాలి. బతుకంతా పాటలతో ప్రతిధ్వనించి, పాటగా ప్రతిఫలించిన బాలు గురించి మాటల్లో చెప్పడం కష్టం. ఆయన పాటలు వినడం సులభం. మనకు పాటల కర్ణామృతాన్ని పంచడానికి ఆయన ఎంత గరళం గొంతులో దాచుకున్నాడో? 

నిందలేనిదే బొందిపోదు. కరోనా వచ్చింది. భయపడకండి. కోలుకుని వస్తాను- అని వీడియో పెట్టి ఆసుపత్రి మంచం మీద పడుకున్నాడు. ఇక లేవలేదు. లేచాడన్నారు. సైగలు చేశాడన్నారు. పాటలకు ప్రతిస్పందిస్తున్నాడన్నారు. ఏ పాటలను పలవరిస్తూ పాటల ఒడిలో సేదతీరుతున్నాడో? 

నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే.. నాదన్నది ఏమున్నది నాలో

నీవేనాడో మలిచావు ఈ రాతిని.. నేనీనాడు పలకాలి నీ గీతిని

ఇదే నాకు తపమనీ 

ఇదే నాకు వరమనీ

చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది.. అంటూ బాలు మన గొంతులో పల్లవిస్తూనే ఉంటాడు. మన పాటకు పల్లవిగా పలుకుతూనే ఉంటాడు.

నీ పాటలు వింటూ ఉండటం తప్ప- ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం? 

అనగల రాగమై తొలుత వీనులలరించి

అనలేని రాగమై మరలా వినిపించీ.. 

మరులే కురిపించీ 

జీవన రాగమై.. బృందావన గీతమై

కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి

ఇదేనా.. ఇదేనా ఆ మురళీ?

అవును- అదే బాలు మురళి. అవును- అదే బాలు పాటల రవళి. నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు గీతాలు దొరకునా ఇటువంటి సేవ? దొరకునా ఇటువంటి బాలు?
logo