శుక్రవారం 30 అక్టోబర్ 2020
Editorial - Sep 26, 2020 , 00:06:54

అనుమానించిందే అయ్యింది

అనుమానించిందే అయ్యింది

ఎనిమిదవ అధ్యాయం కొనసాగింపు..

సెంబరు 21న చర్చకు సమాధానమిస్తూ.. ఈ వక్రోక్తిని ప్రస్తావించి ఇలా పరితపించాను.

మిస్టర్‌ స్పీకర్‌ సర్‌.. ఈ చర్చ ఇలా అవిశ్వాస తీర్మానం రూపంలో రావటం ఎంతో వింత. భారతీయ జనతా పార్టీకి భారత ప్రభుత్వంపై విశ్వాసం లేదు. ఎందువల్ల? ఎందుకంటే భారత ప్రభుత్వం బీజేపీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం ఉంచింది కనుక. బహుశా ఇలా భారత ప్రభుత్వానికి మంచి న్యాయమే దక్కింది. నేను దానిని భరించక తప్పదు; అంగీకరించక తప్పదు. కానీ మనం దేశాన్ని పాలించేదెలా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు కొనసాగేదెలా? అపనమ్మకంతోనా? సంశయంతోనా? కేంద్రంతో ఘనిష్ఠ సంబంధాలు గల రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్లప్పుడూ మూడు కాళ్ళ పరుగు పందెంతో ఉంటే ఎలా? ఒకళ్ళను వెనక్కునెట్టి మరొకళ్ళు ముందుకు పరుగెత్తలేరు కదా....

ఒక ఫెడరేషన్‌లోని కేంద్రంలో ఒక భాగమైన రాష్ట్ర ప్రభుత్వం వాంగ్మూలం తరువాత వాంగ్మూలాన్ని సమర్పిస్తూ, సత్యనిష్ఠతో కూడిన వాగ్దానాలు చేస్తూ చివరకు వాటిని వమ్ముచేస్తూ వానిని చివరి క్షణం వరకూ గుర్తించలేనంతగా జాగ్రత్తపడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం అటువంటి దానిని ఊహించగలదా? అదసలు సాధ్యమేనా? అందువల్లనే ఈ విషయంలో నా తొలి సందన ఇదంతా ముందుగా వేసిన పథకం ప్రకారమే జరిగినట్లు కన్పిస్తుంది. సర్‌, నేను నిందించబడినాను; నమ్మినందుకు విమర్శించబడినాను. నేను చేసిన పాపం అంతకుమించి మరొకటి లేదు. నేను అంగీకరిస్తాను. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి పొరపాటు చేశానని ఒప్పుకుంటాను. దానిపై నా సంజాయిషీ ఇంకేముంటుంది? కానీ అసలు విషయమేమంటే నేను కేంద్ర ప్రభుత్వంగా విశ్వాసం ఉంచటం కాదు; రాష్ట్ర ప్రభుత్వం చేసే వాగ్దానాలపై విశ్వాసముంచక చేయగలిగేదేముంది గనుక? సుప్రీంకోర్టు కూడా విశ్వాసం ఉంచిన తరువాత మరింకేమైనా మార్గం ఉన్నదా? సుప్రీంకోర్టు వ్యవహారాల్ని పరిశీలన జరుపుతున్న తరుణంలో రాను రాను రాష్ట్ర ప్రభుత్వంపై మరింతగా నమ్మకాన్ని పెంచుకోసాగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని వాంగ్మూలాలతో తిరిగి రమ్మంది. ఒక దశలో అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంది గనుక నన్ను దూరంగా ఉండమంది. వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం. నేనసలు ఆ వ్యవహారంలో వాదినీ కాను, ప్రతివాదినీ కాను. కేంద్ర ప్రభుత్వం కూడ ఆ మాటకొస్తే అసలు సుప్రీంకోర్టులోగాని, హైకోర్టులోగాని కక్షిదారు కాదు. కాని నన్నొక ప్రత్యేక ప్రయోజనం కోసం పిలిచారు. మేం చెప్పాం : సుప్రీంకోర్టు మమ్మల్ని ఏ విధంగా సహకారం అందించమంటే అలా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. అంతవరకే మా పాత్ర. చివరకు డిసెంబరు 6న సుప్రీంకోర్టు నిర్ఘాంతపోయింది. అప్పుడు అసలు రంగు బయట పడింది. నాకు గుర్తున్నంతలో ఒక ఫెడరల్‌ వ్యవస్థలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఆ విధంగా ప్రవర్తించి ఉండలేదు. గతంలో నాకు చెప్పినవాళ్ళు ఇప్పుడు అంటున్నారు- ‘మేము మీకు ముందే చెప్పలేదా’? అని. అవును వాళ్ళు చెప్పిందే నిజమని ఋజువయ్యింది. కానీ జులైలో మాత్రం నా చర్యే సరైనది. కనుక ఎవరి ఆలోచన సరైనదన్నదికాదు ముఖ్యం; అధికరణం 356 ఏమవుతుంది? అది ఛిన్నాభిన్నమవుతుంది. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)