మంగళవారం 20 అక్టోబర్ 2020
Editorial - Sep 26, 2020 , 00:06:51

కేంద్రంపై రైతులు తిరగబడాలి

కేంద్రంపై రైతులు తిరగబడాలి

రైతులు తమ సొంత భూమిలో కూలీలుగా పనిచేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితిని కల్పిస్తూ కేంద్రం వ్యవసాయరంగంలో సంస్కరణలు తేవడం విచారకరం. విపక్షాల గొంతు నొక్కి మూజువాణి ఓటుతో బిల్లును పాస్‌ చేసుకోవడం పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కడమే. ఈ చట్టం ద్వారా దేశానికి అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టడమే అవుతుంది. మోదీ ప్రభుత్వం ఇప్పటికే టెలికాం, రైల్వే, రక్షణ, అంతరిక్ష రంగాలను ప్రైవేటుపరం చేసింది. తాజాగా దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయరంగాన్ని కూడా కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో సంస్కరణలు తెస్తుంటే, ప్రధాని మోదీ అందుకు భిన్నంగా రైతులను కాదని కార్పొరేట్‌ సంస్థలను బలోపేతం చేసేపని పెట్టుకున్నాడు. 

మనది వ్యావసాయిక దేశం. వ్యవసాయరంగాన్ని ఎంత బలోపేతం చేస్తే దేశానికి ఆర్థికంగా అంత మంచిది. ‘ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన దేశం బాగుపడదు’ అంటారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు రైతును ఏడ్పిస్తూనే ఉన్నారు. అందుకే దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదు ర్కొంటూనే ఉన్నది. ఈ సందర్భంగా జాతీయోద్యమ కాలంలో గాంధీ చెప్పిన మాటలను మనం గుర్తు చేసుకోవాలి. ‘పల్లె సీమలే పట్టుకొమ్మలు, సంపూర్ణ గ్రామీణ వికాసం జరగాలి’ అని జాతిపిత చెప్పాడు. వాటిని తూచా తప్పకుండా అమలుచేయాలనే సంకల్పాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీసుకున్నారు. కానీ ప్రధాని మోదీ అందుకు భిన్నంగా గ్రామీణ ఆర్థికవ్యవస్థను దెబ్బతీసే విధానాలకు పూనుకోవడం విషాదం. స్వదేశీ.. జాతీయత.. అని నిత్యం వల్లించే బీజేపీ, ఆరెస్సెస్‌లు మన గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలహీనపరిచి కార్పొరేట్‌ సంస్థలను బలోపేతం చేసే విధానాలను ఎందుకు అమలు చేస్తున్నట్లు? రైతుల నడ్డి ఎందుకు విరుస్తునట్లు? ఇదెవరో అంటున్న మాట కాదు, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన అకాలీదళ్‌ అంటున్నది. వ్యవసాయ రంగ జీవత్వం తెలియనివారే ఇలాంటి ప్రజా వ్యతిరేక పనులు చేస్తారు. 

కేసీఆర్‌ రైతు బిడ్డ మాత్రమే కాదు స్వయంగా వ్యవసాయం చేస్తాడు. కనుకనే రైతుల కష్టాలు ఏమిటో తెలుసు. అందుకే వ్యవసాయం దండుగ కాదు పండుగ అనేలా చేస్తున్నాడు. రైతు ఆర్థికంగా బలపడాలని రైతుబంధు, రైతు బీమాలతోపాటు సాగునీరు, 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. నియంత్రిత సాగు విధానం ద్వారా సరైన మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నారు. కొత్తగా తీసుకువచ్చిన రెవెన్యూ సంస్కరణలతో రైతుల భూములకు భరోసా దొరికింది. మోదీ తెచ్చిన వ్యవసాయ సంస్కరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే, తెలంగాణ రైతులు మాత్రం కేసీఆర్‌ తెచ్చిన సంస్కరణలను స్వాగతిస్తూ సంబురాలు చేసుకోవటం గమనార్హం. 

కేంద్రం విద్యుత్‌, వ్యవసాయరంగాలలో తెచ్చిన సంస్కరణలను విశ్లేషిస్తే.. అవి రైతులకు ఎలా నష్టం చేస్తాయో, కార్పొరేట్‌ సంస్థలకు ఎలా మేలు చేస్తాయో అర్థమవుతుంది. అనేక రాష్ర్టాలు రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి. తెలంగాణలో అయితే ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది. కొత్త చట్టం ప్రకారం ఇకపై రాష్ర్టాలు క్రాస్‌ సబ్సిడీ ఇవ్వడం సాధ్యం కాదు. రైతులు తాము వ్యవసాయానికి వాడుకున్న కరెంట్‌కు బిల్లు చెల్లించాలి. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారట! అలాగే వ్యవసాయరంగంలో కొత్తగా తెచ్చిన చట్టం ప్రకారం ఇప్పుడున్న వ్యవసాయ మార్కెట్లు పనికిరా కుండా పోతాయి. దీంతో రైతులకు తీరని నష్టం జరుగుతుంది.  కేంద్రం రైతులు తమ పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్తున్నది. ఎక్కడంటే అక్కడ అమ్ముకునే పరిస్థితి రైతులకు ఎలా ఉంటుందో ఏలికలే చెప్పాలి. ఇదిలా ఉంటే నిత్యావసర సరుకుల నిల్వల మీద ఉన్న నియంత్రణను కూడా కొత్త చట్టం ఎత్తేసింది. ఎంతమంది రైతులు తమ సరుకును నిల్వ చేసుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకోగలుగుతారు? మన దేశంలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు. తాము పండించిన పంటలో తమ ఇంటి అవసరాలకు కావాల్సిన వరకు ఉంచుకొని మిగిలినది వెంటనే అమ్ముకుంటారు.  అమ్ముకుంటేనే వారికి గడుస్తుంది. అంతేకాని గోడౌన్లలో నిల్వ చేసుకునే పరిస్థితి మన రైతాంగానికి ఉండదు. ఉంటే గింటే కార్పొరేట్‌ సంస్థలకు ఉంటుంది. దీనిని బట్టి ఇది ఎవరికీ మేలు చేసేదో అర్థం చేసుకోవచ్చు. ఇంకో నిబంధన ప్రకారం కార్పొరేట్‌ సంస్థలు రైతులతో ముందుగానే పంట ఒప్పందం చేసుకోవచ్చు. దానికి చట్టబద్ధత కూడా ఉంటుంది. ఇది కూడా రైతుల ప్రయోజనం కోసమేనని చెప్తున్నారు. ఇది రైతులను వారి పొలంలోనే  కూలీలుగా చేస్తుంది.  ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న మార్కెట్‌ వ్యవస్థను దెబ్బతీసి, నిత్యావసర సరుకుల నిల్వల మీద నియంత్రణ ఎత్తేసి కార్పొరేట్‌ సంస్థలు రైతులతో చేసుకునే పంట ఒప్పందానికి చట్టబద్ధత కల్పించటం రైతును కార్పొరేట్‌ సంస్థలకు తాకట్టు పెట్టడమే. కాబట్టి రైతులు మేల్కొనాలి కేంద్ర దుర్మార్గపు చర్యలపై తిరగబడాలి.

(వ్యాసకర్త: టీ న్యూస్‌ ఇన్‌పుట్‌ ఎడిటర్‌)logo