గురువారం 29 అక్టోబర్ 2020
Editorial - Sep 25, 2020 , 00:19:39

పునర్నిర్మాణానికి హామీ

పునర్నిర్మాణానికి హామీ

ఎనిమిదవ అధ్యాయం కొనసాగింపు..

రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కూల్చివేతతోనూ, సంబంధిత ఘటనలతోనూ సంబంధం గల నేరాల దర్యాప్తును సీబీఐకి అప్పగించటం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు 1992 డిసెంబరు 14న జారీ చేయబడినాయి. 3) 1992 డిసెంబర్‌ 6 నాటి అయోధ్యలోని సంఘటనల దర్యాప్తునకు పంజాబ్‌-హర్యానా హైకోర్టుకు చెందిన జడ్జి జస్టిస్‌ మన్మోహన్‌సింగ్‌ లిబెర్‌తో ఒక దర్యాప్తు కమిటీని నియమించినట్లు 1992 డిసెంబర్‌ 16న ప్రకటన జారీ చేయబడింది. 4) చట్ట వ్యతిరేక చర్యలు (నిరోధక) చట్టం 1967 కింద రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌, జమాత్‌-ఏ-ఇస్లామీ హింద్‌, విశ్వ హిందూ పరిషత్‌, ఇస్లామిక్‌ సేవక్‌ సంఘ్‌, భజరంగ్‌దళ్‌లను చట్ట వ్యతిరేక సంస్థలుగా ప్రభుత్వం ప్రకటించింది. చట్టంలోని వివిధ సెక్షన్ల కింద చర్యలు గైకొనే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఈ ఉత్తర్వుల అమలుపై నివేదికలు వచ్చి చేరుతున్నాయి. 5) డిసెంబరు 6న అయోధ్యలో ప్రసార మాధ్యమానికి చెందినవారిపై దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యగా పరిగణిస్తుంది. దర్యాప్తు సంఘం ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు హోదా గల సీనియర్‌ పోలీసు అధికారి నాయకత్వాన ఒక ప్రత్యేక విభాగం పర్యవేక్షిస్తుంది. అయోధ్యలో ఏ ప్రసార మాధ్యమానికి చెందిన వ్యక్తికి సంబంధించిన సామగ్రి ధ్వంసమైనా వాళ్లు ఆ సామగ్రిని దిగుమతి సుంకం లేకుండా తిరిగి దిగుమతి చేసుకునేందుకు అనుమతించటం జరుగుతుంది. పార్లమెంట్‌లో డిసెంబరు 7 నాటి నా ప్రకటన (అనుబంధం XII  చూడండి) ప్రస్తావిస్తూ యస్‌.బి. చవాన్‌ ఇలా అన్నారు.. ‘ఇంతకుముందే ప్రకటించినట్లుగా ప్రభుత్వం కూల్చివేయబడిన కట్టడపు పునర్నిర్మాణం జరిగేట్లు చూస్తుంది. ప్రభుత్వం రామమందిర నిర్మాణానికి తగిన చర్యలు గైకొనేందుకు నిర్ణయించింది.

మైనారిటీల విషయంలో కేంద్ర ప్రభుత్వ వాగ్దానాన్ని ఈ విధంగా తెలియజేస్తూ హోంమంత్రి తన ప్రకటనను ముగించటం జరిగింది. ‘ఈ పవిత్ర భూమిలో ఏ మూలన నివసించే భారతదేశపు మైనారిటీలకైనా మేమిచ్చే సందేశమొకటే. వాళ్ల హక్కులను, ప్రాణాలను, స్వేచ్ఛను కాపాడేందుకు తన కృతనిశ్చయాన్నుండి ఈ ప్రభుత్వం బెసగదు. మన దేశ రాజ్యాంగం ప్రకారమే గాక మన మహా నాయకులు గాంధీజీ, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రీ జీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు వాళ్లకు ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు మేము అదనంగా అడుగులు ముందుకువేస్తాం. మా దృఢ సంకల్పాన్ని, నిశ్చయాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పుగా అర్థం చేసుకోనవసరం లేదు’. పార్లమెంట్‌లో కొనసాగిన చర్చ ప్రత్యేకించి పేర్కొనాల్సి ఉంది; చిత్రంగా అయోధ్యపై చర్చ పార్లమెంట్‌లో బీజేపీ నాయకుడు అటల్‌ బిహారీ వాజపేయి ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై జరిగింది.. ‘ఈ సభ మంత్రిమండలిపై విశ్వాసాన్ని కోరుతున్నది’. (మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo