మంగళవారం 27 అక్టోబర్ 2020
Editorial - Sep 25, 2020 , 00:17:03

అంతర్జాలంలో ఆడుకుందాం

అంతర్జాలంలో ఆడుకుందాం

కరోనా కారణంగా పని విధానం కూడా మారింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోని ఉద్యోగులందరూ ‘వర్క్‌ ఫ్రం హోమ్‌' (ఇంటి నుంచి పని) చాలా తొందరగా అలవాటు చేసుకున్నారు. అట్లాగే కాలానుగుణంగా పండుగలు జరుపుకొనే విధానాన్ని కూడా మార్చుకోవాలి. ఆడపడుచులు సామూహికంగా ఇంటర్నెట్‌లో సమావేశమై బతుకమ్మ పాటలు పాడుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలె. ఆ పాటల ద్వారా కరోనాపై అవగాహన వచ్చేలా బతుకమ్మ పాటలు రాసి, పాడినవారికి బహుమతులు ఇవ్వాలి.

ఈ ఏడాది అధికమాసం రావడం వల్ల బతుకమ్మను ఎప్పటిలాగే భాద్రపద మాసంలో కాకుండా ఆశ్వయుజ మాసంలో ప్రారంభించాలని మన తెలంగాణ విద్వత్సభకు చెందిన పెద్ద అయ్యగార్లు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో జరిగిన సభలో నిర్ణయించారు. కవిత ఈ మేరకు తేదీలలో గందరగోళం లేకుండా ఉండేందుకు బతుకమ్మను అక్టోబర్‌ 16 నుంచి జరుపుకోవాలన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగలో వివిధ విషయాల పట్ల అవగాహన కల్పిస్తూ పాటలు రాస్తూ, పాడించేలా మహిళామణులను ప్రోత్సహించాలి.

ప్రతి సంవత్సరం లాగే నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి పూజ చేసి చిన్న బతుకమ్మ రూపంలో ప్రార్థించుకోవాలి. సామూహిక ఆట కు దూరంగా ఉండాలి. ఈ సామూహిక ఆటపాటలు ఇంటర్నెట్‌ సాయంతో జరుపుకోవాలి. ప్రతి రోజు ఆయా రోజు ప్రత్యేకతను బట్టి పాటలు, మహిళా సాధికారితను సాధించేవిధంగా చర్చ, మేధోమథనం ఇంటర్నెట్‌లోనే జరుపుకోవాలి. ఈ విధానాన్ని అమలు చేయడానికి ముఖ్యంగా ఎన్నారై మహిళలు ముందుండాలి. ఎన్నారై మహిళలు, అర్బన్‌ మహిళలు బాధ్యతగ తీసుకొని ఈ విధానాన్ని అమలుపరచాలి. ఎన్నారైలు ‘క్రియేటివ్‌, ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌పార్మేటివ్‌' టీంను ఏర్పాటుచేసుకోవాలి.

ప్రతి రోజు ‘బతుకమ్మ సెలబ్రేషన్‌ ఇన్‌ కొవిడ్‌' అనే అంశంపై క్రియేటివిటీ ఫేస్‌బుక్‌ చాలెంజ్‌ పెట్టుకోవాలి. ఎంగిలిపూల, సద్దుల బతుకమ్మ రోజుల్లో ముఖ్య అతిథులతో పాటలు పాడించాలి. పాటలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రవేశపెట్టాలి. బతుకమ్మ పేర్చేవిధానాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శిస్తే బాగుంటుంది. గ్రామాల్లో అందరూ ఒకేచోట కాకుండా ఆయా గ్రామ జనాభాను బట్టి వీధుల వారీగా లేదా రెండు మూడు చోట్ల జరుపుకోవాలి. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్లాస్టిక్‌ పూలు, రసాయనాలతో కూడిన రంగులు లేకుండా బతుకమ్మలను పేర్చాలి.- బాపు (బద్దం అర్చనా పుల్లారెడ్డి) మెల్‌బోర్న్‌, ఆస్ట్రేలియా.


logo