సోమవారం 26 అక్టోబర్ 2020
Editorial - Sep 21, 2020 , 23:03:20

రాజ్యాంగ ఉల్లంఘన

రాజ్యాంగ ఉల్లంఘన

వ్యవసాయ మార్కెట్‌ సంస్కరణల పేరిట తేవాలనుకున్న బిల్లుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. వాటికి ఆమోదం కోసం రాజ్యసభలో  కనీస నిబంధనలను పాటించకుండా అన్ని విలువలకు తిలోదకాలిచ్చింది.  రైతుల ప్రయోజనాల కోసమే బిల్లులని చెబుతూ వాటిపై కూలంకష చర్చకు తావివ్వకుండా, ప్రతిపక్షాలు సూచించిన సవరణలను పట్టించుకోకుండా ఆమోద ముద్ర వేసుకోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. సంఖ్యాబలం లేకున్నా మూజువాణి ఓటును ఆశ్రయించటం కేంద్రప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం. ఈ ప్రహసనానికి పార్లమెంట్‌లోని పెద్దల సభ వేదిక కావటం విషాదం.

మోదీ ప్రభుత్వ తీరు మంకుపట్టుతో సాగుతున్నది. అన్ని రాజ్యాం గ సూత్రాలను ఉల్లంఘిస్తున్నది. రాష్ర్టాల ప్రాతినిధ్య సభగా పిలుచుకునే రాజ్యసభలో ప్రతిపాదిత బిల్లులపై పరిపూర్ణ చర్చకు అవకాశం ఇవ్వాలి. విపక్షసభ్యుల అనుమానాలను నివృత్తి చేయాలి. సూచనలు, సవరణలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇది కనీస ప్రజాస్వామిక ప్రక్రియ. విపక్షాలవి గొంతెమ్మ కోర్కెలేమీ కావు. ఎన్డీయేలోని లేని 12 ప్రతిపక్ష పార్టీలు బిల్లులపై చర్చకు పట్టుబట్టాయి. ప్రధాన ప్రతిపక్షాలు కొన్ని సవరణలు సూచించాయి. బిల్లులపై కూలంకష చర్చ కోసం బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశాయి. ఓటింగ్‌కు పట్టుబట్టాయి. దీంతో ప్రభుత్వానికి భయంపట్టుకున్నది. రెండు దశాబ్దాలుగా ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న శిరోమణి అకాళీదల్‌ వ్యవసాయ బిల్లులకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగింది. దీంతో ఆత్మరక్షణలో పడిన బీజేపీ, బిల్లులను గట్టెక్కించుకోవటానికి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించింది.

ఇప్పటిదాకా రైతుకు భరోసానిచ్చే ఒక్క పథకాన్ని కూడా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. తాజా సంస్కరణలు రైతన్నలను మరింత సంక్షోభంలోకి నెట్టేవిగానే ఉన్నాయి. కనీస మద్దతు ధర ఊసే లేని ఈ సంస్కరణలు రైతుల ప్రయోజనాలు ఎలా నెరవేర్చుతాయి? ఇన్నాళ్లూ ఏ కష్టకాలం వచ్చినా, పంట నాణ్యతలో కొంచెం అటూ ఇటూగా ఉన్న రైతుకు వ్యవసాయ మార్కెట్లు దన్నుగా నిలిచాయి. ఇప్పుడవన్నీ కనుమరుగవుతాయి. రైతు కార్పొరేట్‌ కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి వస్తుంది. కాబట్టే ప్రభుత్వం ఎంత అందంగా అబద్ధాలు అల్లినా రైతులోకం తీవ్రంగా నిరసిస్తున్నది. పంజాబ్‌, హర్యానా లాంటి చోట రైతులు రోడ్లమీదికి వస్తున్న తీరు ప్రజాగ్రహాన్ని తెలుపుతున్నది. దేశ భవిష్యత్తు కోసమని పెద్దనోట్లరద్దు, జీఎస్టీ లాంటి చట్టాలను సమర్థించిన టీఆర్‌ఎస్‌ కూడా ఇప్పుడీ వ్యవసాయ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, రైతు పాలిట చీకటిరోజని నిరసిస్తున్నది. ఇప్పటికైనా కేంద్రం కండ్లు తెరువాలి. ప్రజాభిమతాన్ని గౌరవించాలి.


logo