సోమవారం 26 అక్టోబర్ 2020
Editorial - Sep 21, 2020 , 23:03:18

కంగన.. హంగామా!

కంగన.. హంగామా!

ఇటీవలి లెక్కల ప్రకారం దాదాపు 140 కోట్ల మంది భారత ప్రజలు. వారంతా తమ జ్ఞాపకశక్తిని కోల్పోయారా? కోల్పోయారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరో కొందరు ఏదో అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే అంతగా ఖాతరు చేయవలసిన అవసరం లేదు. 95 ఏండ్ల నుంచి ఒక సామాజిక, సాంస్కృతిక సంస్థగా కొనసాగుతూ, వీలైనప్పుడు, అవకాశం లభించినప్పుడు, అవసరం అనుకున్నప్పుడు దేశ రాజకీయాల్లో తలదూర్చుతున్న ఒక ప్రముఖ సంస్థ అధినేత ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచినప్పుడు నిశ్చయంగా, నిశ్చలంగా ఒక నిమిషం ఆలోచించక తప్పదు.

హిందీ చలనచిత్ర వినీల గగనం లో హఠాత్తుగా తళుక్కున మెరిసి రాజకీయ వివాదాలను సృష్టిస్తున్న, తన కరకంణ నిక్వాణంతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న, ‘మీర జాలగలడా నాయానతి అధిపతి..’ అంటూ నయగారాన్ని, నయా సొబగులను ప్రదర్శిస్తున్న హిందీ సినీ నటి కంగనా రనావత్‌ మాటలను విని, చేతలను చూసి చకితులై దేశ ప్రజలు కోట్లమంది ఇప్పటికే 50 లక్షల మందికి సోకిన, లక్ష మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న మహమ్మారి కరోనా వైరస్‌ను, క్షణక్షణం కొన్ని వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాలను గమ్మున స్వాహా చేస్తున్న కమ్యూనిస్టు చైనా దురాక్రమణను, నానాటికీ భయంకర స్వరూపంతో తీవ్రమవుతున్న భారత్‌ ఆర్థిక తిరోగమనాన్ని (ఈ తిరోగమనాన్ని నిరోధించడానికి మరో ఆర్థిక మాంత్రికుడు, తాంత్రికుడు పీవీ అవసరమవుతారు-హిందీ భాషా భేషజంతో, డాంబిక నినాదాలతో ఈ ఆర్థిక తిరోగమనం నియంత్రణకు రాబోదని పరిశీలకులు భావిస్తున్నారు), వికటాట్టహాసం చేస్తున్న నిరుద్యోగ సమస్యను, జీఎస్టీ డబ్బులు చెల్లించలేక రాష్ట్ర ప్రభుత్వాలను అప్పుల ఊబిలోకి నెడుతున్న కేంద్ర ప్రభు త్వ దివాళాకోరుతనాన్ని, దేశంలోని కోట్లాది రైతులకు నష్టం కలిగిస్తున్న కేంద్ర చర్యలను మరిచిపోతున్నారా? హిందీ సినిమా నటి కంగనా రనావత్‌ స్వస్థలం మనాలీ (హిమాచల్‌ప్రదేశ్‌) నుంచి ముంబై దాద్రాలోని పాలిహిల్స్‌ స్వగృహంలో ప్రవేశించగానే ప్రభంజనం వీచినట్లయింది. ముంబై పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ వలె ఉందని కంగనా చేసిన వ్యాఖ్య మహారాష్ట్రలో పాలక కూటమికి నాయక త్వం వహిస్తున్న శివసేనకు ఆగ్రహం కలిగించింది. ఇంతకాలం అందరిని హడలగొట్టిన శివసేనను ఈ ఒక్క వ్యాఖ్యతో కంగనా హడలగొట్టింది. శివసేన దినపత్రిక సామ్నా వర్కింగ్‌ ఎడిటర్‌, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రావత్‌ కంగనా ముంబై నుంచి వెళ్లిపోవడం మంచిదని ఘాటుగా జవాబివ్వడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఆమె కేవలం సినిమా నటి కాదని స్పష్టమైంది. మోదీజీ ప్రభుత్వం కంగనాకు వెంటనే వై క్యాటగరి భద్రత కల్పించింది. ముంబైలోని కంగనా భవనంలో బృహద్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రారంభించిన అక్రమ నిర్మాణం కూల్చివేత కార్యక్రమాన్ని మహారాష్ట్ర హైకోర్టు వెంటనే నిలిపివేసింది.

దేశంలోని అందరు మహిళలకు, కోట్లాది మహిళలకు కంగనాకు ఉన్న అదృష్టం, అవకాశం లేవు. ఐరాస మహిళా విభాగం ఈ మధ్య 129 దేశాల మహిళల స్థితిగతులపై ఒక సమగ్ర నివేదిక రూపొందించింది. భారత మహిళలలో ప్రస్తుతం దాదాపు 8 కోట్ల మంది దుర్భర దారిద్య్రం, పేదరి కం అనుభవిస్తున్నారని, కరోనా కారణంగా 2021 నాటికి ఈ సంఖ్య 10 కోట్లకు హెచ్చుతుందని ఈ నివేదికలో వివరించారు.

ముందే ప్రస్తావించిన సామాజిక-సాంస్కృతిక సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. ఈ నెల 27న 95 ఏండ్లు నిండుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ భారత స్వాతంత్య్ర, జాతీ య ఉద్యమాలు గాంధీజీ నాయకత్వంలో వినూత్న శక్తితో విజృంభించబోతున్న క్లిష్ట దశలో 1925 సెప్టెంబర్‌ 27న హిందూ మతోద్ధరణ ప్రధా న లక్ష్యంగా స్థాపితమైంది. భారత స్వాతంత్య్ర సాధన తన లక్ష్యమని, ధ్యేయమని నాడుగాని, తర్వాత గాని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించలేదు. బ్రిటిష్‌ పాలనను, బ్రిటిష్‌ శాసనాలను-చట్టాలను, ఆంక్షలను, దమననీతిని, నిర్బంధాలను ఎన్నడూ వ్యతిరేకించని, ఎప్పుడూ గౌరవించిన ఆర్‌ఎస్‌ ఎస్‌ భారత స్వాతంత్య్ర, జాతీయ ఉద్యమాల్లో ఎన్నడూ పాల్గొనలేదు- ఆ ఉద్యమాలను ఎన్నడూ బలపరచలేదు. భారత స్వాతంత్య్ర ఉద్యమం నుంచి ఉద్భవించిన జాతీయవాదాన్ని అభివృద్ధి నిరోధక వాదమని చిత్రించి, వ్యతిరేకించిన ఆర్‌ఎస్‌ఎస్‌ హిట్లర్‌, ముస్సోలినీల ఫాసిజాన్ని ప్రశంసించింది. గాంధీజీ సత్యాగ్రహాల్లో, శాసనోల్లంఘన కార్యక్రమాల్లో, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనని ఆర్‌ఎస్‌ఎస్‌ పూర్వపు హైదరాబాద్‌ సంస్థానం విముక్తి పోరాటాల్లో కూడా పాల్గొనలేదు-ఇది చారిత్రక సత్యం. బ్రిటిష్‌ పాలనలో ఒకసారి, స్వతంత్ర భారతదేశంలో మూడు పర్యాయాలు (గాంధీజీ హత్య తర్వాత ఒకసారి) ఆర్‌ఎస్‌ ఎస్‌ నిషేధానికి గురైంది. 

భారత రాజ్యాంగ సభ మూడేండ్ల కృషి అనంతరం ఆమోదించిన స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని యథాతథంగా ఆమోదిస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ అధికారికంగా ఎన్నడూ ప్రకటించలేదు. భారత జాతీయ పతాకాన్ని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్తించలేదు, ఆమోదించలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ పొదిలో నుంచి పుట్టిన పలు సంస్థల్లో ఒకటి  బీజేపీ. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చేవరకు ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో ఒక అస్పృశ్య. ఇటీవలి పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకించిన వారు కరోనా కారణంగా ఆ చట్టాన్ని మరచిపోయారని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత భగవత్‌జీ ఈ మధ్య అన్నారట! 20 రోజుల కిందట దివంగతుడైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ మహా మేధావి, విజ్ఞాన సముద్రాలను ఔపోశన పట్టిన మహా మనీషి, సాటిలేని రాజనీతిజ్ఞుడు. 2018లో ఆర్‌ఎస్‌ఎస్‌ తమ కేంద్ర కార్యాలయంలో ప్రసంగించడానికి ప్రణబ్‌ను ఆహ్వానించింది. ఆయన అత్యంత రాజనీతిజ్ఞతతో ఆ ఆహ్వానాన్ని అంగీకరించారు. ప్రణబ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలో ప్రసంగించి దాని ఆశయాల పట్టికలో లోపించిన,  ఆ పట్టికలో చేర్చవలసిన ముఖ్యమైన అంశాలను, విశేషించి మత సామరస్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ తదితర అంశాలను నొక్కి చెప్పారు. ఆ తర్వాత దేశంలో ప్రణబ్‌ను అభినందించని వారు లేరంటే అతిశయోక్తి కాదు.

దేవులపల్లి ప్రభాకరరావు


logo