సోమవారం 26 అక్టోబర్ 2020
Editorial - Sep 21, 2020 , 23:03:18

చూసికూడా నేర్చుకోలేరా?

చూసికూడా నేర్చుకోలేరా?

ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం, నియంత్రిత పద్ధతుల్లో డిమాండ్‌కు అవసరమైన పంటల సాగు, 24 గంటల ఉచిత విద్యుత్‌, కాళేశ్వరంతో కాలువల ద్వారా, భూగర్భజలాల పెంపు, రైతుబంధు, రైతు బీమా, వంటి విప్లవాత్మక పథకాలతో రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని పండగలా చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది.

భారత్‌ వ్యవసాయాధారిత దేశం అనే విషయం తెలిసిందే. కానీ ఇందుకోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఏమిటి? తాజాగా కేంద్రం ఆమోదించిన మూడు బిల్లులు స్వేచ్ఛా విక్రయం, ముందస్తు ఒప్పందాలకు చట్టబద్ధత, అత్యవసరాల నిల్వలపై ఆంక్షల ఎత్తివేతల వల్ల రైతుకు ఒరిగేదేమిటి? వ్యాపారికి మిగిలేదెంత? మెక్సికోలో ఆహార సంక్షోభాన్ని అధిగమించడానికి సంకర వంగడాలను, క్రిమి సంహారక, రసాయన ఎరువులను వాడి హరిత విప్లవం పేరుతో పంట దిగుబడులను ఇబ్బడిముబ్బడిగా పెంచింది. ఈ విధానాన్ని 1961లోనే ఉత్తరాది రాష్ర్టాల్లో ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, యూపీ లాంటి చోట్ల సాగునీరు ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను పెంచింది. పింక్‌ రెవెల్యూషన్‌, బ్లూ, రెడ్‌, వైట్‌, ఎల్లో, సిల్వర్‌, గోల్డన్‌ రెవెల్యూషన్ల పేరుతో ఒక్కో వ్యవసాయ ఉత్పత్తికి ఒక్కోరకమైన విధానాన్ని అవలంబించి సాధించిన ప్రగతి రైతు జీవితాల్లో మార్పులు తీసుకువచ్చింది. కానీ అది సంపూర్ణంగా లేకపోవడానికి కారణాలు తెలియాల్సి ఉన్నది. ఇలా ప్రభుత్వం మేధోమథనాన్ని కొనసాగిస్తూ బడుగు, సన్న, చిన్నకారు రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పులు సంభవించకపోవడం శోచనీయం.

స్వతంత్ర భారతంలోని 70 దశకాలు రైతుకు నిర్దిష్టంగా ఏం కావాలనే దానిపై పరిశోధనలతోనే గడిచిపోయాయి. ఈ కాలం లో  భాక్రానంగర్‌, హీరాకుడ్‌, తెహ్రీడ్యామ్‌, జయక్వాడి, కలఘర్‌ వంటి దేశవ్యాప్త ప్రాజెక్టులతో పాటు నాగార్జునసాగర్‌, ధవళేశ్వరం, ఎస్సారెస్పీ వంటి భారీ ప్రాజెక్టులతో కలిపి దాదాపు 3800 ప్రాజెక్టుల ద్వారా అందుబాటులోకి వస్తున్న నీరు కన్నా వృథాగా సముద్రంలో కలిసిపోతున్న నీరే ఎక్కువనే విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న 70 వేల టీఎంసీలను ఎలా ఉపయోగించుకోవాలి. దేశంలోని 70 కోట్ల ఎకరాలను ఎలా సాగులోకి తేవాలనే ప్రణాళికలపై చిత్తశుద్ధి లేకుండా రైతుల కోసం ఏం చేసినా అది తూతూ మంత్రం చర్య అనిపించుకోదా? ఇంతటి విపత్కర పరిస్థితుల్లో దేశంలోని రైతాంగం కొట్టుమిట్టాడుతుంటే, పాలకులు చేసిన కొత్త చట్టాలు రైతులకు ఏ మేరకు ప్రయో జనం చేకూరుస్తాయి? దేశంలోని 90 శాతం కమతాలు చిన్న, సన్నకారు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. కేవలం ఐదెకరాల లోపు కమతాలే ఇందులో ఎక్కువ శాతం బక్క రైతులు తమ పంటలను సుదూర తీరాలకు తరలించుకుపోయి అమ్ముకోగలరా? కనీస మద్దతు ధరను కూడా సాధించుకొని బక్క రైతు పంటలను నిల్వ చేసుకొని ధర వచ్చినప్పుడు అమ్ముకోగలడా? ఇక ముందస్తు ఒప్పందాలకు చట్టబద్ధత ద్వారా నకిలీ విత్తనాలు వేసి మోసపోయినప్పుడు ఎలాంటి పరిహారం వస్తుందో చెప్పని చట్టం, తర్వాత కార్పొరేట్లను ప్రశ్నించి, ఒప్పంద అమలుకు ప్రభుత్వ యంత్రాంగమే లేనప్పుడు ఏం చేయగలుగుతాయి. దీనిద్వారా కార్పొరేట్లకు ఒప్పందం అనే దొడ్డిదారిన రహదారిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమా? రైతులనే వారిని లేకుండా చేసి కేవలం కూలీలను మాత్రమే ఈ చట్టాలు తయారుచేయవనే గ్యారంటీ ఏమిటీ? రైతుల ముసుగులో కార్పొరేట్‌ శక్తుల్లోకి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు వెళ్లిపోతే రక్షించే రక్షణ వ్యవస్థలు ఈ చట్టంలో ఉన్నాయా? ఒకవేళ ఉన్నా, ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థీకృత అవినీతి విధానాలతో లాభం ఎవరికి? అతి సామాన్య వ్యక్తులకు కలుగుతున్న ఈ సందేహాలు చట్టం రూపకల్పన చేసే మేధావులకు రాకపోవడం విచారకరం. కనీసం వీటి నివృత్తికి ఎలాంటి మార్గాలను సూచించారో ప్రజలకు వివరించకపోవడం బాధాకరం.

స్థూలంగా రైతు ప్రయోజనాలే ఈ మూడు చట్టాల్లో కనిపిస్తున్నా ఆచరణలో దీనికి పూర్తి విరుద్ధంగా జరగబోతుందనేది ఈ ఆరు నెలల ఆర్డినెన్స్‌ కాలమే నిరూపించిన ఉదంతాలున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రైతుల బాగోగుల కోసం పలు సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నాయి. ఈ అంశంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందున్నది. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం, నియంత్రిత పద్ధతుల్లో డిమాండ్‌కు అవసరమైన పంటల సాగు, 24 గంటల ఉచిత విద్యుత్‌, కాళేశ్వరంతో కాలువల ద్వారా, భూగర్భజలాల పెంపు, రైతుబంధు, రైతు బీమా, వంటి విప్లవాత్మక పథకాలతో రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని పండగలా చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది. వ్యవసాయానికి అవసరమైన భూమి, నీరు, కల్తీ లేని విత్తనాలు, సకాలంలో ఎరువులు, శ్రమ, సమయాన్ని ఆదా చేసే యాంత్రీకరణ పద్ధతులు, పండిన పంటకు గిట్టుబాటు ధర, రైతులే మార్కెటింగ్‌ చేసుకునే వెసులుబాటు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్నదాతకు అండగా నిలబడటం ముఖ్యమైనవి. వీటిపై ప్రభుత్వాలు శ్రద్ధ కనబరచాలి. అవసరమైన సంస్కరణలు తీసుకురావాలి. రైతును రాజు చేయకపోయినా పర్వాలేదు, కూలీగా మా త్రం మార్చవద్దు. కేంద్రం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలపై సమగ్ర చర్చ జరగాలి. రైతులకు ఉండాల్సిన అన్ని రక్షణలను అందులో చేర్చాలి. అప్పుడే రైతుకు భరోసా లభిస్తుంది. 


logo