మంగళవారం 20 అక్టోబర్ 2020
Editorial - Sep 21, 2020 , 00:58:51

బూర్గుల రామకృష్ణారావు సంపూర్ణ మానవుడు

బూర్గుల రామకృష్ణారావు సంపూర్ణ మానవుడు

ఇస్లామిక్‌ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ పరిపలన సాగించాలనకునే నిజాంపై ఆయన పోరాడారు. కానీ అదే సమయంలో ముస్లింలు అందరికీ ఆయన ఆప్తమిత్రునిగా నిలిచారు. ఆయనకు లౌకికవాదం అంటే అమితమైన ఇష్టం. కానీ ఆ విషయంలో ఎలాంటి హంగామా చేసేవారు కాదు. ఆయన డ్రాయింగ్‌ రూం పాతకాలం నాటి హైదరాబాద్‌ రాజ్యవ్యవస్థకు అద్దం పట్టే సాంస్కృతిక సంగ్రహాలయంలా ఉండేది. ఫెజ్‌ టోపీల మౌల్వీలు, గడ్డాలు పెంచిన ముల్లాలు, తలపాగాలు ధరించిన పండిట్లు, మహామహోపాధ్యాయులు అక్కడ నిత్యం కనిపించేవారు. మరోవైపు అరకొరగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, టెరిలిన్‌ ధరించిన ఆధునిక యువకులు తమ కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించేదుకు వచ్చేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మూడుతరాల మధ్య వారధిలా నిలివారు. 

జాం పరిపాలన అంతరించిన తర్వాత హైదరాబాద్‌ రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావుతో పీవీకి ప్రత్యేక అనుబంధం ఉండేది. బూర్గుల న్యాయవాదిగా పనిచేసే రోజుల్లో ఆయన వద్ద సహాయకునిగా పనిచేయడమే కాకుండా రాజకీయాల్లో ఆయన వారసునిగా ఎదిగిన పీవీ ఆ మహానాయకుని శతజయంతి స్మారక సంచికకు రాసిన ప్రత్యేక వ్యాసం ఇది.

బూర్గుల ఎవరు ఏది అడిగినా కాదనేవారు కాదు. తన దగ్గరకు ఏదైనా అసాధ్యమైన  పనిమీద వస్తే ఒక్కమాటతో వెళ్లగొట్టకుండా అవతలి వన్యక్తి చెప్పేది సాంతం ఓపికగా వినేవారు. దీనివల్ల ఇతర ముఖ్య విషయాలకు ఆయన ఖర్చు చేయాల్సిన సమయం చేజారీపోయేది. కానీ ఆయన తీరు అంతే.

తన విస్తృత కుటుంబానికి ఆయన ప్రేమను పంచే కుటుంబ పెద్ద. తన దయతో, విశాల హృదయంతో ఆయన ఎక్కడున్నా కుటుంబ పెద్దలాగే వ్యవహరించేవారు. అన్నిటికీ ఆలస్యంగా వస్తారు అనే ముద్ర  తనమీద పడినా ఆయన పట్టించుకునేవారు కాదు. ఆయన వచ్చి తనదైన శైలిలో ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్మన్‌ ఎప్పటిలాగే ఆలస్యంగా వచ్చాను’ అంటూ మొదలుపెట్టే ఉపన్యాసం వినేందుకు సభికులు ఓపికగా, అభిమానంతో ఆప్యాయంగా వేచిఉండేవారు. 

బూర్డుల కుటుంబంలో ఎన్నో విషాదాలు చోటుచేసుకున్నాయి. అనేక పరిస్థితులు ఆయనను సంఘర్షణల్లోకి దింపాయి. ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితం ఎప్పుడూ సాఫీగా సాగలేదు. అయినా ఆయన మానసిక సమతూకం ఎన్నడూ కోల్పోలేదు. విజయాన్ని చూసి ఆయన గర్వం పడలేదు, పరాజయం వల్ల కృంగిపోలేదు. మిత్రులు దారుణమైన ద్రోహాలకు పాల్పడినప్పుడు, శత్రువులు కుటిల పన్నాగాలతో బాధించినప్పుడు ఆయన నోటి నుంచి కేవలం ‘ఇదంతా ఆటలో భాగమే..’ అనే మాటలు వచ్చేవి. 


డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు దివంగతులైనప్పుడు మిత్రులు సంతాపసభ ఏర్పాటు చేసి నన్ను మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. నేను సజల నయనాలతో మృదువుగా తోసిపుచ్చాను.ప్రస్తుత వ్యాసాన్ని రాసేందుకు ఉపక్రమించినప్పుడు కూడా అలాంటి సందిగ్ధ స్థితికి లోనయ్యాను. ఆలోచనను ఆవేదన పూర్తిగా కమ్మేసింది. నా మనసులో అనేక సంఘటనలు, పరిస్థితులకు సంబంధించిన జ్ఞాపకాలు తుపానులా చెలరేగుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ ఒరవడిలో ఎటూతేల్చుకోలేక పోతున్నాను. అందువల్ల ఈ దిగువ వాక్యాల్లో ఆయన గురించిన విషయాలను చెదురుముదురుగానే వ్యక్తం చేయగలనని అనిపిస్తున్నది..

సమాజంతో తమ సంబంధాల గురించి చాలామంది తమకు తెలిసిన దానికంటే ఎక్కువ చేసి చెప్పుకోవడం పరిపాటి. అందరూ నేనంటే నేనే అనే తరహాలో ఇదే పని చేస్తారు కనుక ఎవరికీ సరైన స్థానం లభించదు. దీనివల్ల ఎవరికీ ఏమీ ఒరుగదు. ఈ దోరణికి రామకృష్ణారావు ఒక అరుదైన మినహాయింపుగా నిలుస్తారు. ఆయన కృతకంగా ఏదీ చూపించలేదు. చివరికి వినమ్రత కూడా. తానేమిటో అలాగే ఉన్నారు. ఇంచుక తక్కువా కాదు, ఎక్కువా కాదు.

ఆయన కొద్దిగా పొట్టి. అది ఆయనను నలుగురిలో ప్రముఖంగా  కనిపించకుండా చేసేదని కొందరంటారు. ఇంతకన్నా సత్యదూరమైన విషయం ఇంకోటి ఉండదు. మధ్యస్థాయి ఎత్తుతో, సగటు శరీరనిర్మాణంతో ఆయన అందరిలోనూ తనదైన ప్రత్యేకతతో విరాజిల్లేవారు. తన ఎత్తు గురించిన జోకులను ఆయనే చెప్పి నవ్వేవారు. ప్రొఫెసర్‌ గాల్‌బ్రేత్‌ తన అసాధారణమైన ఎత్తుగురించి హాస్యంగా మాట్లాడినట్టుగానే.

బేగంపేట విమానాశ్రయంలో సౌదీ రాజు ఇబ్న్‌సౌద్‌కు దండ వేయాల్సి వచ్చిన సందర్భం గురించి చెప్పుకుంటారు. ఆయన ఎత్తు ఆయన ప్రాముఖ్యతలోకి రావడంపై ఎలాంటి ప్రబావం చూపలేదు. ఇది పూర్తి అసందర్భమైన విషయం. అసలు ప్రముఖంగా కనిపించాలని ఆయన అనుకుంటే కదా. 

సందర్భం వచ్చినప్పుడు బూర్గుల వామనుడిలా ఇంతింతై, వటుడింతై విశ్వమంతా వ్యాపించినట్టుగా ఎదిగారు. సందర్భం పూర్తయిందా.. వెంటనే  ఆయన  తన పూర్వస్థితికి వెళ్లిపోయి మళ్లీ తన అవసరం ఏర్పడేదాకా తనమానాన తాను ఉండిపోయేవారు. ఆయన కావాలని మూలకుపోయి ఎవరికీ పట్టకుండా ఉండాలని కోరుకునేవారని కాదు. ఆవశ్యకత ఏర్పడినప్పుడే తన ఘనత వ్యక్తీకరించే మహోదాత్తమైన వ్యక్తిత్వం ఆయనది. అది ఆయనలో సహజంగా ఉండిన అంశం. 

న్యాయవాదిగా ఆయనలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండేవి. ఆయన బ్రహ్మాండమైన ప్రాక్టీసుతో రెండు చేతులా సంపాదించిన లాయరు కాదు. చాలామంది లాయర్లకు ప్రజాజీవితంతో సంబంధం ఉండటం అనేది బంగారు గుడ్లు పెట్టే బాతులా పనిచేస్తుంది. కానీ డాక్టర్‌ రామకృష్ణారావు విషయంలో అది తిరగబడింది. క్లయింట్లు మిశ్రమ భావాలతో ఆయన వద్దకు వచ్చేవారు. ఆయన వాదనా బలం మీద నమ్మకం ఉండేది. అదే సమయంలో ఆయన రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండడం వల్ల సరిగా దృష్టి పెట్టలేరేమోనని సందిగ్ధం కలిగి ఉండేవారు. అయినా కేసులకు కొదవేమీ ఉండేది కాదు. నిజానికి కేసును లోతుగా అధ్యయనం చేసేందుకు ఆయనకు సమయం ఎక్కడిది?కేసు ఒప్పుకునే ముందు ఆయన టైటిల్‌ పేజీ వెనకాల కొన్ని నోట్స్‌ రాసుకునేవారు. సాధారణంగా అది కేసుకు సిద్ధమయ్యే విధానం కాదు. కానీ ఆయన అదే నోట్స్‌ ఆధారంగా  తన అద్భుతమైన ప్రతిభతో, అమేయమైన విజ్ఞతతో, అవతలివారి వాదాలను తుత్తునియలు చేసే విధంగా పకడ్బందీ కేసులు తయారు చేయించేవారు. న్యాయవాద వృత్తిలో ఉండే ఓ మహామేధావి ఎలా పనిచేస్తారో ఆయనను చూస్తే తెలుస్తుంది. ఒక సీనియర్‌గా ఆయన తరహాయే వేరు. ఆయనకు నేను జూనియర్లలోకెల్లా జూనియర్‌ను. ఒక తల్లి తన కడగొట్టు బిడ్డ మీద అవ్యాజ్యమైన ప్రేమను చూపినట్టుగానే నా పట్ల అదనపు ఆదరణ కనబరిచేవారు.  

అలా అలా సీనియర్‌-జూనియర్‌ తేడాలు తొలగిపోయి సమానస్థాయీలో మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. నాలో ఆయన ఆత్మవిశ్వాసం నిండుగా కలిగించారు. తర్వాతి కాలంలో అదే అన్నింటా, ముఖ్యంగా శాసన సభలో మాట్లాడుతున్నప్పుడు నాకు అండగా నిలిచింది. 

అదీ వాత్సల్యపూరితమైన నా సీనియర్‌ తీరు. ఇక రాజకీయాల విషయానికి వస్తే.. ఆయనకు సిద్ధాంత రాద్ధాంతాలు అసలే తెలియవు. స్వయంగా జాగిర్దార్‌ కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్‌ రామకృష్ణారావు నిజాం పరిపాలనకు చిహ్నమైన జాగిర్దారీ వ్యవస్థను కట్టగట్టి అవతల పారేయడానికి ఏమాత్రం సంకోచించలేదు. ఆయనకు భూస్వాములతో దగ్గరి సంబంధాలుండేవి. కానీ ఇప్పటిదాకా ఎవరూ తేవడానికి సాహసించని అత్యంత ప్రగతిశీలమైన చట్టాన్ని ఆయన తెచ్చారు. కౌలురైతుకు భూమి హక్కు కల్పించే నిబంధనను ముందుగా అమలు చేసేందుకు ఆయన తన సొంత బంధువులు లేదా రాజకీయ అనుచరులున్న ప్రాంతాన్నే ఎంపిక చేయడం గమనించదగ్గ విషయం. ఇక అతిముఖ్యమైన మరో విషయం హైదరాబాద్‌ విభజన, విలీనం వల్ల తన పదవికే ఎసరు వస్తుందని ఆయనకు స్పష్టంగా తెలుసు. కానీ ఆయనే ముందుండి నడిపించడమే కాకుండా తన వాదానికి అదే విషయాన్ని ఆలంబనగా చేసుకున్నారు. 

మొత్తంమీద తన ప్రతి నిర్ణయంతో తానే ముందుగా ఇబ్బందులు పడి, రాజకీయ జీవితమంతా తనకు నష్టం కలిగించే చర్యలతో గడిపి, అంతిమంగా క్రియాశీల రాజకీయాలకే దూరమైపోయిన మరో రాజకీయ నేత మనకు కనిపించడు. లోతుగా ఆలోచించి, ఆచరణాత్మకంగా నిర్ణయాలు తీసుకునేవారు. ఆ తర్వాత దానికి దృఢంగా కట్టుబడేవారు. డాక్టర్‌ రామకృష్ణారావు రాజకీయ పటిమకు ఇదే గీటురాయి.

ఆయన వ్యక్తిత్వంలోని మరో అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. పాత వ్యవస్థ లోని ఉత్తమ లక్షణాలన్నీ కలబోసుకున్నారాయన. మూర్తీభవించిన ‘షరాఫత్‌'లా ఉండేవారాయన.  అన్ని వర్గాలకు తలలో నాలుకలాంటి వ్యక్తిత్వంతో ఆయన తనకాలపు రాజకీయాల్లో, విశేషించి ప్రశంసనీమైన రీతిలో భాషల మేళవింపు, నిశితమైన ఆలోచనల నిగారింపుతో కూడిన శాసనసభలో మేరునగంలా వెలుగొందుతూ ఉండేవారు. హైదరాబాద్‌ శాసనసభకు డాక్టర్‌ రామకృష్ణారావు నాయకుడుగా ఉన్న రోజుల్లో జరిగిన చర్చల గురించి ఇప్పటికీ అపురూపంగా గుర్తు చేసుకుంటారు. సభావేదికపై ప్రత్యర్థులను ఆయన నెత్తుటి బొట్టు చిందకుండా చీల్చి చెండాడేవారు. తర్వాత అంతా మామూలే. ఎలాంటి చెడుభావనలు ఉండేవి కావు. పార్లమెంటేరియన్‌గా డాక్టర్‌ రామకృష్ణారావు వాక్పటిమ అలాంటిది!

ఆయనలో ఒక భాషావేత్త ఉన్నాడనేది తెలిసిన విషయమే. ఆయనకు అనేక భాషలు వచ్చు. అవన్నీ కూడా ఆయన సొంతంగా, ఆసక్తితో నేర్చుకున్నవే. అర్ధరాత్రి వరకు ఫైళ్లతో కుస్తీ పట్టిన తర్వాత  బూర్గుల సంస్కృతంలో మునిగితేలేవారు. ఆయనది బహుముఖీన వ్యక్తిత్వం. అంతరంగంలో మాత్రం ఆయన సాహిత్యజీవి అని నా ప్రగాఢ విశ్వాసం. ఆయన సాహితీ వ్యాసంగం ఉండాల్సినంతగా లేనందువల్ల ఈ మాట వింతగా అనిపించవచ్చు. ఆయన స్పృశించని, సుసంపన్నం చేయని రంగం లేదు. ఆయన మేధ సాహితీ సృజనకు అత్యంత అనువుగా ఉన్నప్పటికీ ఆయన సాహిత్య సృష్టి గణనీయమైన స్థాయిలో లేదు. జాతి చరిత్రలో ఉద్వేగభరితమైన, నాటకీయమైన కాలంలో ఆయన పనిచేశారు. ఆ విషయాలకు సంబంధించి ఆయన రాస్తే బాగుండేది. కానీ రాయాల్సినంతగా, రాయాల్సిన విధంగా ఆయన రాయకపోవడం చాలామంది ఇతురల లాగే నన్నూ ఎప్పుడూ బాధిస్తూ ఉంటుంది.

ఈ అసాధారణ మానవుడు తన 69వ ఏట 1967 సెప్టెంబర్‌ 14న అంతిమశ్వాస విడిచారు. ఆయనకు నివాళిగా సంపుటాల కొద్దీ రచనలు చేయవచ్చు. కానీ ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన సంపూర్ణ మానవుడు. 

పాత వ్యవస్థ లోని ఉత్తమ లక్షణాలన్నీ కలబోసుకున్నారాయన. మూర్తీభవించిన ‘షరాఫత్‌'లా ఉండేవారాయన.  అన్ని వర్గాలకు తలలో నాలుకలాంటి వ్యక్తిత్వంతో ఆయన తనకాలపు రాజకీయాల్లో, విశేషించి ప్రశంసనీమైన రీతిలో భాషల మేళవింపు, నిశితమైన ఆలోచనల నిగారింపుతో కూడిన శాసనసభలో మేరునగంలా వెలుగొందుతూ ఉండేవారు. 

కేసు ఒప్పుకునే ముందు ఆయన టైటిల్‌ పేజీ వెనకాల కొన్ని నోట్స్‌ రాసుకునేవారు. సాధారణంగా అది కేసుకు సిద్ధమయ్యే విధానం కాదు. కానీ ఆయన అదే నోట్స్‌ ఆధారంగా  తన అద్భుతమైన ప్రతిభతో, అమేయమైన విజ్ఞతతో, అవతలివారి వాదాలను తుత్తునియలు చేసే విధంగా పకడ్బందీ కేసులు తయారు చేయించేవారు. న్యాయవాద వృత్తిలో ఉండే ఓ మహామేధావి ఎలా పనిచేస్తారో ఆయనను చూస్తే తెలుస్తుంది.

చరిత్ర లేదా రేపటి తరం బూర్గుల గురించి ఏమని చెప్పుకుంటుంది అనేది చాలా సులభంగానే ఊహించి కొట్టిపారేయవచ్చు. ఫలానా తేదీన పుట్టారని, పూనా ఫెర్గూసన్‌ కాలేజీలో పర్షియన్‌ ఐచ్ఛిక అంశంగా ఎంచుకుని చదువుకున్నారని, కొన్నాళ్లు పర్షియన్‌ ట్యూటర్‌గా పనిచేశారని, ఫలానా సంవత్సరం ప్లీడరు వృత్తిలో చేరారని, అనేక సంవత్సరాలు ప్రాక్టీసు చేశారని, హైదరాబాద్‌ సంస్థానంలో అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, సత్యాగ్రహాలు చేసి జైలుకు వెళ్లారని, హైదరాబాద్‌ కాంగ్రెస్‌ ప్రముఖ నాయకుల్లో ఒకరని, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, రెండు రాష్ర్టాలకు గవర్నర్‌గా, రాజ్యసభ సభ్యునిగా, అనేక కమిషన్లకు చైర్మన్‌గా పని చేశారని, 1967 సెప్టెంబర్‌ 14న గుండెపోటుతో కన్ను మూశారని ఇలా ఏవేవో రాస్తారేమో. ఇవన్నీ కూడా కాలక్రమాన్ని బట్టి సరైన వరుసలోనే ఉన్నాయి. కానీ ఇవేవీ ఆయన వ్యక్తిత్వాన్ని ఏమాత్రం పట్టి ఇవ్వలేవు.


logo