మంగళవారం 20 అక్టోబర్ 2020
Editorial - Sep 21, 2020 , 00:58:50

కేంద్ర బలగాలపై నిరసన

కేంద్ర బలగాలపై నిరసన
  • (ఎనిమిదవ అధ్యాయం కొనసాగింపు..)

 1992 నవంబరు 23, 24 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన లక్నో బెంచికి ఓ దరఖాస్తు చేసుకుంది. అందులో కోర్టు వారిని రామజన్మభూమి - బాబ్రీ మసీదు కట్టడం, చుట్టూ సేకరించిన భూమి వివాదం కేసుల్ని వెనువెంటనే పరిష్కరించమని లేదా 25-10-1991న, 15-7-1992న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్ని మార్పు చేయటమో లేక రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రయోజనం కొరకు ఆ భూమిని సేకరించిందో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చేందుకు తగిన చర్యలు తీసుకునే వీలు కల్పించటమో చేస్తూ తిరిగి ఉత్తర్వులు జారీచేయమని విన్నవించింది. 1992 నవంబరు 24న కోర్టు ఆ దరఖాస్తును తిరస్కరించినా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అందులో విన్నవించిన ఈ క్రింది రెండు అంశాలను ప్రధానంగా గమనంలోకి తీసుకోవలసి వుంది. అవి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యాన్ని స్పష్టంగా తెల్పటమేగాక వాళ్ళ అభిమతాన్ని నెరవేర్చుకునేందుకు చూపే సాకులు కూడ అర్థమవుతాయి.

ఇంతలో ఈ విషయమై ఉత్తరప్రదేశ్‌ గవర్నరు డిసెంబరు 1న తేటతెల్లంగా కేంద్రప్రభుత్వానికి వ్రాసిన లేఖ అందింది. వివాదానికి పూర్వాపరాలను వివరించి ‘రాష్ట్రంలో మామూలు శాంతిభద్రతల పరిస్థితి, ప్రత్యేకించి మతవర్గాల విషయంలోనూ సంతృప్తికరంగానే ఉంది’ అని చెప్తూ యింకా ఈ క్రింది విషయాలు తెలియజేయటం జరిగింది:

కరసేవకులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారని వార్తలందుతున్నాయి. అయితే వాళ్ళంతా శాంతియుతంగానే మెలుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీని ఇవ్వగా సుప్రీంకోర్టు దానిని ఆమోదించింది. వివాదాస్పద కట్టడానికి పూర్తి రక్షణ కల్పించబడుతుందనే గట్టి హామీని కూడ రాష్ట్రప్రభుత్వం యిచ్చింది. దాని రక్షణకు సరిపడినంతగా ఏర్పాట్లు చేయబడినాయి. 

నా ఉద్దేశ్యంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రద్దుచేయటం, లేదా రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేయటం లేదా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించటం వంటి తీవ్రమైన చర్యలు గైకొనేందుకు సమయమింకా పక్వానికి రాలేదు. ఒకవేళ అలాచేస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఈ రాష్ట్రంలోనేగాక దేశమంతటా పెద్ద ఎత్తున హింస ప్రబలే అవకాశం ఉంది. వివాదాస్పద కట్టడానికి ముప్పు వాటిల్లే సంభవనీయతను సైతం కొట్టిపారవేయజాలం. కనుక నా దృష్టిలో మనమంతా ఈ విషయంలో కడు జాగరూకులమై మెలగాలి. ఏ నిర్ణయం గైకొనేందుకైనా సానుకూల ప్రతికూలతల్ని వివిధ ప్రత్యామ్నాయాల్ని బేరీజు వేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా వుండాలి.

అసలీ గవర్నరు ఎవరు? నిజానికి వీ.పి. సింగ్‌ ప్రధానిగా వున్న కాలంలో సత్యనారాయణరెడ్డి అనే ఈ గవర్నరును ఎంపిక చేసుకొని నియమించటం జరిగింది. ఆ నియామకానికి ముందు ఆయన రాజకీయాల్లో వున్నారు, ఆయన బీజేపీ సానుభూతి సిద్ధాంతాలకు అంతగా అనుకూలుడుకాదు గనుక ఆయన్ని బీజేపీ సానుభూతిపరునిగా ముద్రవేసేందుకు వీలులేదు. ఒకవేళ గవర్నరుకు ఏదయినా రాజకీయపరమైన మొగ్గుకలదనుకున్నా అది ఆయన చేసే నిర్ణయాలపై ఎటువంటి ప్రభావమూ ప్రసరింపజేయరాదు. ఈ విషయం యిక్కడ ఎందుకు నమోదు చేయవలసి వచ్చిందంటే మనస్సుల్లోనయినా పొంచివుండే అనుమానాల్ని పటాపంచలు చేసేందుకే.

ఈ నివేదిక తయారుచేసినవారు స్పష్టం చేసేదేమంటే శాంతి విషయంలోనూ, వివాదాస్పద కట్టడం రక్షణ విషయంలోనూ అయోధ్య వద్ద కరసేవ శాంతియుతంగా నిర్వహింపబడగలదనే నమ్మికతోనూ గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి పచ్చజెండా ఊపినట్లు. నిజమే, వాస్తవ స్థితిగతుల ఆధారంగానే, దేశాధ్యక్షునికి గవర్నరు అటువంటి హామీలనిచ్చి చివరలో హెచ్చరించసాగారు. తాను వివరించిన పరిస్థితుల్లో 356వ అధికరణం క్రింద అధ్యక్షుడు తీసుకునే ఏ చర్య అయినా అనవసరమే గాక దుష్ఫలితాలనిస్తుందని, వాటిలో బాబ్రీ కట్టడానికి ముప్పువాటిల్లే ప్రమాదం కూడ వుందని తెలియజేసారు. భారత దేశాధ్యక్షునికి ఓ గవర్నరు నుండి కఠినతరమైన హెచ్చరికల్ని ఊహించజాలం.

భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించినదానికి అనుగుణంగా 1992 నవంబరు 24న చర్యలు ప్రారంభించింది. కేంద్ర పారామిలటరీ దళాల్ని ఉత్తరప్రదేశ్‌లోని అనువైన తావులకు తరలించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు అమలుపరిచేందుకు స్వల్ప వ్యవధిలో ఆ దళాలు అందుబాటులో వుండేందుకే ఆ తరలింపు. 1992 నవంబరు 24నే ఈ విషయం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలియజేయటం జరిగింది.

అంతకుముందే తయారుచేసి పెట్టుకున్న అత్యవసర ప్రణాళిక ప్రకారం పారామిలటరీ దళాల తరలింపు జరుగుతూ పోయింది. 191 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలు (112 కంపెనీలు సీఆర్‌పీఎఫ్‌; 54 కంపెనీలు సీఐయస్‌యఫ్‌, 25 కంపెనీలు ఆర్‌పీఎఫ్‌) వివిధ ప్రాంతాల నుండి ఫైజాబాద్‌/ అయోధ్యల వైపు 1992 నవంబరు 24, 25 తేదీల్లో తరలించబడినాయి. అక్కడి నుండి వాటిని కేటాయించిన శిబిరాలకు- ఫైజాబాద్‌, చుట్టుప్రక్కల ప్రాంతాలకు పంపటం జరిగింది. వాటిలో జగదీష్‌పూర్‌, మన్కాపూర్‌, రాయ్‌బరేలీ వంటి ప్రాంతాలు కూడ ఉన్నాయి. దాదాపుగా 500 వాహనాలు వాళ్లను శిబిరాలకు తరలించేందుకు, ఆ పిమ్మట అవసరమైతే రంగంలోకి దించేందుకుగాను ఫైజాబాద్‌/ అయోధ్యలకు పంపబడినాయి. కావలసిన ప్రాథమిక సహాయక సదుపాయాలకు ఏర్పాట్లు చేసారు. 25 ఉదయానికి ఫైజాబాద్‌/ అయోధ్యలకు దళాలు చేరుకోవటం ప్రారంభమయ్యింది.

1992 నవంబరు 25న, నవంబరు 30న, డిసెంబరు 2న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి వ్రాసిన జాబుల్లో ఉత్తరప్రదేశ్‌లోని పలుప్రాంతాల్లో కేంద్ర పారామిలటరీ దళాల్ని దించటాన్ని గట్టిగా నిరసిస్తూ ఆ చర్య అనవసరమయినదిగా, రాజ్యాంగ విరుద్ధమైనదిగా, ఏకపక్ష చర్యగాను పేర్కొన్నారు. ఆయన వాదన ఏమంటే ఈ చర్య రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమైనటువంటిదనీ, ఫెడరల్‌ స్వభావంపై గొడ్డలివేటు వంటిదని, ప్రజాస్వామిక సంప్రదాయాలకు వ్యతిరేకమనిన్నూ, రాష్ట్రప్రభుత్వం కోరకుండానే కేంద్ర దళాలను తరలించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదుగనుక ఆ దళాలను వెనక్కు పిలిపించవలసిందిగా ఆయన గట్టిగా కోరటం జరిగింది. 


logo