శనివారం 31 అక్టోబర్ 2020
Editorial - Sep 20, 2020 , 00:03:55

అలా మొదలైంది భాగవతం...

అలా మొదలైంది భాగవతం...

సత్రయాగ దీక్షలో ఉన్న సత్సంగప్రియులైన శౌనకాది మహర్షులు సూతమునితో ‘పౌరాణికోత్తమా! నీవు చిరకాలం వర్ధిల్లు. ఈ సత్రయాగ నిర్విఘ్న పరిసమాప్తి మరియు ఫలప్రాప్తి విషయంలో మాకు సందేహమే కాని విశ్వాసం కాని లేదు. సుదీర్ఘకాలం హోమగుండాల ముందు కూర్చుని-కూర్చుని హోమధూమాలతో మా దేహాలే కాదు, డెందాలు (హృదయాలు) కూడా పొగచూరిపోయాయి. ఇటువంటి మాకు నీవు అనాయాసంగా ఫలమిచ్చే అనంతపద్మనాభుని పాదపద్మాల చింతనమనే అమృతాన్ని ఆస్వాదించే అహో భాగ్యం కలిగించావు. స్వర్గమే కాదు, అపవర్గం (మోక్షం) కూడా భాగవత సంసర్గానికి సాటి రావు. మహానుభావా! వీనుల విందైన వైకుంఠుని వందనాలాపాలు వినటానికి వెనుకాడే వెర్రివాళ్లు ఉంటారా? పరీక్షిత్తు విని తరించిన ఆ విష్ణుగాథను మాకు వినిపించు’ అని వినయంగా విన్నవించుకొన్నారు. సూతుడు సంతసించి ‘సాధుసత్తములారా! నా చిత్తమునకు తోచినంత వినిపిస్తా, వినండి’ అన్నాడు.

ఒకనాడు హస్తినరేడు పరీక్షిత్తు అరణ్యంలో విచ్చలవిడిగా వేటాడి ఆకలిదప్పులతో అలసిసొలసిపోయాడు. చల్లని నీటికై వెదకి-వెదకి వేసారి ఒక పవిత్ర ఆశ్రమంలో ప్రవేశించాడు. అచ్చట అంతర్ముఖుడై అలరుచుకున్న శాంతమూర్తి శమీక మునీంద్రుని చూచి మానవేంద్రుడు ఎండిన దవడలతో, తడి ఆరిన నాలుకతో, డగ్గుత్తికతో మెల్లమెల్లగా-

క. ‘తోయములు దెమ్ము మాకీ

తోయము వేటాడు వేళ దొల్లి పొడమ దీ

తోయము క్రియ జలదాహము

తోయమువారులును లేరు దుస్సహ మనఘా!’

‘ఓ మహర్షీ! నాకు తాగడానికి మంచినీరు ఇప్పించండి. గతంలో వేటకు వచ్చినపుడు ఎప్పుడూ ఈసారివలె దురవస్థ కలుగలేదు- ఇంతగా దప్పికకు లోనుకాలేదు. నా పరిజనులు- పరిచారకలు కూడా తప్పిపోయారు. వెంటలేరు, వెనుకపడ్డారు. దాహం సహింపరానిదిగా ఉంది’- అని జలం అర్థించాడు. సమాధి నిష్ఠలో ఉన్న ముని మాట్లాలేదు. అవనీపతిని ఆశ్రమంలోనికి ఆహ్వానించినవారు లేరు, ఆసనమిచ్చినవారు లేరు. ఆతిథ్యం మాట దేవుడెరుగు, ఆదరణ పూర్వక పలుకులకు కూడా నోచుకోలేదు. భూభర్త భంగపాటుగా భావించాడు. ఆకలిదప్పుల ఆధిక్యత వల్ల వివేకం నశించింది. మహారాజు కనుక లోని రజోగుణం- రాజసం రగుల్కుంది. జీవితంలో మొదటిసారి మనసును క్రోధం ఆక్రమించింది. శమీకుడు సమాధిలో ఉన్నాడని తెలుసుకోలేకపోయాడు సరికదా- మహర్షిననే మిథ్యాగర్వంతో మదించి ఉన్నాడని మహీపతి మదిలో ఇలా తలచాడు-

ఆ. ‘వారి గోరుచున్నవారికి శీతల

వారి యిడుట యెట్టివారికయిన

వారితంబు గాని వలసిన ధర్మంబు

వారి యిడడు దాహవారిగాడు.’

‘దాహంతో (వారి)-మంచి తీర్థం అర్థించిన వారికి చల్లని (వారి) జలం ఇచ్చి దాహం తీర్చుట ఎలాంటివారికైనా (వారితంబుగాని) విడువరాని ధర్మం, తప్పక ఆచరించవలసిన కర్మ. ఈ జాటాధారి (ముని) నాకు (వారి) నుంచినీరు ఇచ్చి ‘దాహవారిగాడు’- నా దాహాన్ని ఎందుకు వారించకుండా అనగా తీర్చకుండా ఉన్నాడు?’ అని లోలోపల ఉడికిపోయాడు ఉర్వీపతి పరీక్షిత్తు. పై రెండూ పోతన సొంత పద్యాలు. మూలంలో ‘ఉదకమయాచత’- (జలం యాచించెను) అని మాత్రమే ఉన్నదానికి ఇవి ఇంపొసగెడి అలంకారికమైన పెంపు. కందపద్యంలోని ‘తోయము’ అన్న పదం నాలుగు పాదాలలో నాలుగు పదాలలో నాలుగు విభిన్న అర్థాలలో కవి అభిమతార్థాన్ని సమర్థవంతంగా వ్యక్తం చెయ్యగల్గింది. ‘వారి’ అంటే సంస్కృతంలో నీరు అని అర్థం. ‘వారితంబు’, ‘దాహవారి’లోని ‘వారి’ కూడా సంస్కృతమే. ఇక, వారికి, ఎట్టివారికయిన- అనేవి తెలుగు భాషలో సర్వనామాలు. సంస్కృతాంధ్ర శబ్దాలు క్షీరనీరముల వలె కలసిపోయిన ఇట్టి కలనేత మహాశైలి ఆంధ్రకవితా సరస్వతికి ఆదికవి నన్నయ అలంకరించిన అజర అమర అమూల్య ఆభరణం! ప్రాస నియమం లేకున్నా ఈ ఆటవెలది ప్రాసతో కందపద్యపు అందం సంతరించుకొని చదువరుల చెవులకు చవులూరిస్తోంది.

పరమ భాగవతుడైన పరీక్షిత్తు వేటాడి మృగాలను చంపవచ్చునా? వేట సప్త వ్యసనాలలో ఒకటి కదా! అంటే, వినోదం కొఱకు ఆడే ఆట వ్యసనం. క్రూరమృగాల బారి నుండి ప్రజలను పంటలను కాపాడటానికి విజ్ఞతతో జరిపే వేట క్షత్రియ వీరులకు విహిత (కర్తవ్యరూప) ధర్మం. ఆ రోజున ఆ రాజు ఎంత విరివిగా వేటాడి ఉంటే అంత అలసట కలుగుతుంది? మూలంలో ‘మృగాననుగతః’ (మృగముల వెంట పడుతూ పడుతూ) అని క్లుప్తంగా పోతన మహాకవి ఈ క్రింది కందపద్యంలో అతిరంజిత- అతిశయోక్తియుత చమత్కార వ్యంజకంగా వర్ణించాడు-

క. ‘మృగయులు మెచ్చు నరేంద్రుడు

మృగరాజు పరాక్రమమున మెఱసి హరించెన్‌

మృగధర మండలమున గల

మృగమొక్కటి దక్క సర్వమృగముల నెల్లన్‌.’

ఆ పరీక్షిన్నరేంద్రడు మృగేంద్ర (సింహ) విక్రమంతో వేటగాళ్లు వెఱగుపడి మెచ్చే విధంగా విధు (చంద్ర) మండలంలో ఉన్న మృగాన్ని (కుందేలు, జింక) తప్ప అరణ్యంలోని అన్ని మృగాలను వేటాడి వధించాడట! చంద్రబింబంలోని మచ్చను మృగముగా వర్ణించుట కవి సమయం (సంప్రదాయం).

పరీక్షిత్తు భరింపరాని అవమానంతో కోపం ఆపుకోలేకపోయాడు. ‘శమీకుని సమాధి నిష్ఠ సత్యమా లేక నటనా?’ అని మనసులో సందేహం కలిగింది. ఆవేశకావేషాలు సత్యాన్ని గోచరింపనీయవు. ఋషి సమాధిని నటన (బూటకం)గానే నిర్ధారించుకుని, చెంతనే పడి ఉన్న చచ్చిన పాముని బ్రహ్మర్షి భుజాన పడవేసి నరపతి నగరానికి నిష్క్రమించాడు. ‘వికారహేతౌ సతి విక్రియంతే యేషాం న చేతాంసి త ఏవ ధీరాః’ [వికారానికి (దుర్బుద్ధి, చెడుభావం) లోను కాగల విషమ పరిస్థితిలో కూడా వివేకం కోల్పోక నిర్వికారంగా నిలువగలిగేవారే ధీరులు] అని కాళిదాస మహాకవి సూక్తి. ఐతే, పరీక్షిత్తు ధీరుడు కాడా? అంటే కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు విషాదానికి లోను కాకుండా ఉండి ఉంటే లోకానికి భగవద్గీత లేదు. అలాగే పరీక్షిత్తు శాపం పొందక ఉండి ఉన్నైట్లెతే భాగవత పురాణం లేదు. కాన, ఇవి స్వామి సంకల్పాలుగా భావించాలి. భగవంతునికి చేసిన అపచారం కంటే భక్తునికి చేసిన అవమానం ఇంకా ఎక్కువ భయంకరం. తండ్రికి జరిగిన అవమానం భరించలేక శమీక పుత్రుడు శృంగి క్రుద్ధుడై ‘ఆ రాజు నేటికి ఏడవనాడు తక్షకుని కాటుకు దగ్ధమైపోగాక!’ అని శపించాడు. శృంగి కర్మఫలానికి ప్రతీకం. లక్షల ఆవుల మధ్యలో ఉన్న తన తల్లి వద్దకే దూడ వెళ్లినట్లు కర్మ కర్తని అనుసరిస్తూ ఫలాన్ని అనుభవింపజేసి కాని నశించదు. శాపఫలంగా పరీక్షిత్తు మెడకు బ్రతికిన పామే చుట్టుకుంది. ముంతంత దప్పికకు తాళలేక మేరువంత శాపం తలెత్తుకున్నాడు పరీక్షిత్తు. శృంగి శాపం పరీక్షిత్తుకు వైరాగ్యకారణమైంది. ‘న వైరాగ్యాత్‌ పరం భాగ్యం’- ఆధ్మాత్మంలో వైరాగ్యాన్ని మించిన భాగ్యం లేదు. భగవంతుడే వైరాగ్యకారణమైన బ్రాహ్మణ శాపరూపంగా తనను అనుగ్రహించాడని పరీక్షిత్తు సమాధానపడ్డాడు. శాపానికి ముందు ఆయన రాజు. శాపానంతరం రాజర్షి! మరి శృంగి ఇచ్చింది శాపమా లేక వరమా? ప్రతిశాపం ఇచ్చే సామర్థ్యమున్నా భక్తుడు కనుక రాజు శృంగిని శపించలేదు. ఒక్క పూట దప్పికకు తట్టుకోలేక శాపం మూటకట్టుకున్న ఆ పరీక్షిత్తే ప్రయోపవిష్టుడై పరమ యోగి శుకునితో ‘మహాత్మా! భాగవతామృతం త్రాగుతుంటే నాకు ఆకలిదప్పులు అంతరించిపోతున్నవి’ అని విన్నవించుకుంటాడు. ‘కాకోదర విషము ముక్తి కారణమయ్యెన్‌'- ఆశ్చర్యకరంగా తక్షక విషమే అమృతమై పరీక్షిత్తుకు మోక్షఫలాన్ని అందించింది.