సోమవారం 26 అక్టోబర్ 2020
Editorial - Sep 20, 2020 , 00:03:56

మహా మౌనమే కవిత్వం

మహా మౌనమే కవిత్వం


కావ్య కళాశాస్ర్తాన్ని కడుపు నిండా నింపుకొని ‘విమర్శ’లో వినూత్నమైన పద్ధతిని ప్రవేశపెట్టిన సాహితీ విరాణ్మూర్తి ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోట ఆయన పేరు ప్రస్తావించటం సాధారణ గురుస్మరణ మాత్రమే కాదు. అంతటివాళ్లను సైతం ప్రభావితం చేయగల ‘ఆచార్యత్వం’ వీరభద్రయ్యలో ఉంది. విమర్శకుడిగా, 

విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా, సాహిత్య కళాతత్వవేత్తగా గడిచిన ఆయన జీవితం ఇపుడు గొప్ప తత్వవేత్తగా అంతర్ముఖుడిగా కొనసాగుతున్న తరుణంలో మరో మూడు అత్యద్భుత కావ్యాలు వారి కలం నుంచి జాలు వారడం విశేషం. ‘జాతి విపంచీగానం’, ‘కవిత్వ కళాతత్వం’- పేరుతో వెలువడిన ఈ మూడు కావ్యాలు ఇటీవలి కాలంలో మన కవితా ప్రస్థానంలో వచ్చిన మైలురాళ్లు వంటివి. అరుదైన కవిత్వం సంభవించడం జాతి అదృష్టం. అలాగే, విపత్కర పరిస్థితుల విశ్వానికి వారందించిన‘మహామౌనం’ ఓ శాంతిగీతం.

ఒక కవి తిప్పే ఈ ధర్మచక్రం దాని పరిభ్రమణం పరిపూర్ణంగా స్తంభింపబడేందుకు ఏదో ఒక మూలమలుపు కావాలి. మనకంటూ ఏమీ లేనట్టు పరిభ్రమింపచేసే సాహిత్యపు వృద్ధాప్య మూలుగులపై ఇది ఒక దెబ్బలాంటిది. ఈ ధర్మచక్రాలను తిప్పేందుకు, కాలగతిని, చరిత్రగతిని ఒక సూచికలో కొలిచేందుకు అప్పుడప్పుడు కొన్ని సరికొత్త కొలబద్దలు సమాజానికి అవసరం. ఇపుడు అలాంటి కవిత్వ ప్యారామీటర్‌ను వీరభద్రయ్య అందించారు. జాతికి ఎప్పుడు ఏది ఆక్సిజనో దాన్ని ఏదో ఒక ఫార్మ్‌లో అందించడం తాత్వికుల లక్షణం. తాత్వికత లేకుండా, పునాదుల్లో దాని ప్రభావం లేకుండా ఏ కొత్త భవనాన్నీ నిర్మించలేం.

“చరిత్ర నిస్సారపు కాగితాల కట్ట కాదు

ఇప్పటికీ కొన్ని కాగితాలు పిండితే

కన్నీరే కారుస్తుంటాయవి

అవన్నీ కన్నీటి సముద్రాలే- ఉప్పునీళ్లే” 

 అంటారు. ఇక్కడే ప్రతిస్పందన మొదలవుతుంది. సంకర సహవాసం చేయించి మనవి కాని వస్తువును మన మెడలో వేసే ప్రయత్నం చేసినపుడల్లా ఇలాంటి ప్రతిక్రియ తప్పక వచ్చి తీరుతుంది. అలాంటి ఉబికి వచ్చే శతఘ్ని శరాలెన్నో ఇందులో ఉన్నాయి. మహాభారత కురుక్షేత్రం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు అన్నిటిలో ఈ ప్రతిక్రియ ఉండి తీరుతుంది. లేకపోతే దానికి అస్తిత్వం ఉండదు.

“దేశదేశాల జయించి ఐరోపాదేశాలలో

జాతీయతకు హేతువైనాడని అనుకొనే

నెపోలియన్‌కి కల్గినది చివరకు

సద్గతియా? దుర్గతియా-” 

అని ప్రశ్నిస్తాడు. బానిసత్వంలో వెన్నెముక వంగిపోయిన భారతజాతి ఎదుర్కొనే సమస్యలే ఈ జాతిని తీర్చిదిద్దే సోపానాలుగా మార్చుతాయని వీరభద్రయ్య విశ్లేషణ. ఏ జాతి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందో ఆ జాతి ప్రగతికి అవి ముందస్తు సూచనలని వారి అభిప్రాయం. ‘అయితే ,అణచివేసిన వాళ్లు, దురాక్రమణ చేసినవాళ్లు, దేశాలను దొంగదెబ్బతో కబళించివాళ్లూ బావుకునేది ఏమీ లేదు. దండెత్తి వచ్చిన వారిని తేనెటీగలతో పోల్చారు. ధూమకేతువులా మీదపడి కుట్టి చంపితే మిగిలేది రెంటికీ స్థానం లేకపోవడమే. పశుబలంతో ఇతరుల ‘ధర్మం’పై యుద్ధం చేసేవాడు శాశ్వత పరాజితుడే అవుతాడు’ అంటారు. ఇదంతా ఆశామోహాలతో చేసే ఆక్రమణమని వీరభద్రయ్య అంతరంగం.

“ఈ భరతజాతిపై దండయాత్రలలో

అరబ్బులు, మొఘలులు, పఠానులు, సామర్ఖండేయులు

చివరకు నక్కజిత్తుల తెల్ల వ్యాపారులు

వాడిన గజాశ్వదళాల ఘీంకార హేషలు

మ్రోగించిన తుపాకీ ఫిరంగి ధ్వనులు

వారి ఆశల ధ్వనులే సుమా” 

అంటూ కేవలం లౌకిక, భౌతికశాస్త్ర విజ్ఞానంతో సంతృప్తి చెందకుండా ఇతర జాతుల సంపత్తు దోచుకోవడం వారి ప్రవృత్తి; కానీ, ఈ గడ్డపై పుట్టిన యోధులూ, జ్ఞానులు- ఆశ, స్వార్థం... ఆశయం పరార్థంగా తేల్చారని చెప్పుకొచ్చారు. శతాబ్దాల చరిత్రను మథనం చేసినపుడు నైరాశ్యం గరళంగా వస్తే, వెన్నుపోట్లు జాతిని జీవచ్ఛవతుల్యంగా మారిస్తే, ‘సదాశయాల సంజీవని’ ఈ జాతికి చైతన్యం కలిగించిందని ముదిగొండ చెప్తారు. ప్రపంచంలోని మానవ సమాజాలకు ఏక సూత్రత కలిగించే ప్రయత్నం సహస్రాబ్దులుగా మనం చేయడం విశ్వశ్రేయః కావ్యం. “లోకా సమస్తాః సుఖినో భవంత్తు” అన్న వైదిక రుషుల ఆలోచనలను ఈ దురాక్రమణదారులే ముక్కలు చేశారని ఆయన భావన. ‘మన సనాతనుల ఆలోచనల్లో జాతి అంటే భూగోళం కాదు. ప్రాదేశిక సరిహద్దులు కావు. ఇదొక సంస్కృతి. జీవన విధానం. అది అందించడమే మన కర్తవ్యం’ అని బోధిస్తారు. ఆలోచనలు భూభాగానికి పరిమితం కావు.

‘శాక పాకాలకు రుచి కలుగాలంటే

లవణం తప్పనిసరి అయినట్టు’ 

వారు చెప్పిన మాటే మొదట ఈ రెండు కావ్యాలతో ముళ్ల దారి పరచుకొన్నట్టు. దారి ఏర్పాటు చేసుకొని ఆపైన ‘మహామౌనం’తో కమలాసనస్థుడవుతాడు. అది ఆత్మజ్ఞాని ఎదుగుదలలో అత్యున్నత శిఖరం. ప్రయాణమంతా చేసి అలసిసొలసిన మనుస్సుతో అనేక పరిశీలనలయ్యాక ‘నేతినేతి’ పరిజ్ఞానంతో అన్నీ తిరస్కరిస్తూ పోయాక ఇక మిగిలింది ఒక్కటే..

‘చలనం ఆగింది. ఆగిపోయింది

నిశ్చలతలో ఎంతటి చిచ్ఛక్తి!

 ఇక ఎక్కడికీ చేరనక్కరలేదు సుమా

దూర సామీప్యాలు- అన్నది భ్రమే

మనమే- నేనే” 

అంటారు మరొక రమణ మహర్షిలా. నిశ్చలంగా ఉన్నప్పుడే అలల అలికిడి. సంద్రంలోని సడి అర్థమయ్యేది. అలాంటి అవ్యక్త అనుభూతిని వీరభద్రయ్యగారు మహామౌనంలో దర్శించారు.

“అది శాంతో, అశాంతో

మనస్సు కచేరీ చేస్తుంటేనే

మరణ మృదంగం వాయిస్తుంటుంది

పాటపాడే వాడే లేకుంటే

పక్క వాద్యానికి అవసరమేముంటుంది”

అన్న జీవన సూత్రాన్ని ఆధ్యాత్మిక అవలోకనకు అనుబంధించారు. ఇదంతా ఇటీవల నిర్జీవంగా, నిస్సారంగా మారిన సాహిత్యపు మాగాణం నుండి పుట్టిన మహావృక్షప్రబోధం. అర్థం కాని పదాలతో మభ్యపెడుతున్న విమర్శకుల, ఆస్థాన విద్వాంసుల స్తుతులను తుత్తునియలు చేస్తూ ఈ దేశీయమైన సాహిత్య విన్యాసం ఎలా ఉండాలో దిక్సూచిగా నిలబడే పుస్తకాలను అందించి ‘భద్రవీణ’ మోగించారు వీరభద్రయ్య. అది అతని అంతశ్చేతన నుంచి పుట్టిన అమృతగానం.

- డా॥ పి.భాస్కర యోగి

9177823010


logo