సోమవారం 26 అక్టోబర్ 2020
Editorial - Sep 20, 2020 , 00:03:53

షితాబ్‌ఖాన్‌గా మారిన సీతాపతి!

షితాబ్‌ఖాన్‌గా మారిన సీతాపతి!


కాకతీయుల తర్వాతి కాలంలో... చిన్న చిన్న రాజ్యాలను కలుపుకొని 

ఓ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నించినవాడు సీతాపతిరాజు. ఇతను మొదట బహమనీల కింద వరంగల్లు సుబేదారుగా ఉన్నా 

క్రమంగా వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం కోటల మధ్య ఉన్న ప్రాంతాలను స్వతంత్రంగా పరిపాలించడం ప్రారంభించాడు. కుతుబ్‌షాహీల పాలనా కాలంలో... అనేక ప్రాంతాలను, కోటలను జయించినట్లుగా తెలుస్తుంది. ఇంతకీ సీతాపతిరాజును షితాబ్‌ఖాన్‌ అని ఎందుకు పిలుస్తారు?

సీతాపతిరాజు సాధించిన విజయాలను గమనించిన గోలకొండ సుల్తానులు తనకు ఖాన్‌ అనే బిరుదు ఇచ్చి ఉండవచ్చు, ముస్లింల ఉచ్చారణలో సీతాపతి కాస్తా షితాబ్‌గా మారి ఉండవచ్చు. లేదా సీతాపతే తాను సుల్తానులతో సమానమనే ఉద్దేశంతో షితాబ్‌ఖాన్‌గా పేరు మార్చుకున్నాడేమో! వరంగల్లు కోటలో లభించిన శాసనాన్ని బట్టి ఇతడు ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లుగానీ, హిందూ వ్యతిరేక చర్యలు చేసినట్లుగా కానీ అనిపించడం లేదు. శ.సం. 1425లో వేయించిన ఈ శాసనంలో... వరంగల్లు కోటను ఆక్రమించడం, అక్కడ ఉన్న దేవాలయాల పునరుద్ధరణ గురించి తెలుస్తుంది.

భోగికులానికి చెందిన చిత్తాపుఖాన్‌ను పృథ్విలోని రాజులందరిలో శ్రేష్ఠుడిగా, విక్రమాదిత్యునితో సమానమైన రాజుగా పేర్కొన్నారు. యవనులు ఆక్రమించిన అందమైన రాజధాని (ఏకోపల) వరంగల్లును వశం చేసుకున్నాడు. అదే విధంగా భర్గుడి ఆశీస్సులతో రాజాద్రి, ఇంకా ఇతర కోటలను జయించి అవిచ్ఛిన్నంగా చాలా సంవత్సరాలు పరిపాలించినట్లు తెలుస్తుంది. పూర్వం ఏకశిలను ఏలిన కాకతీయ రాజుల వలె ఇతను కూడా ఏకశిలా నగరంలో ఉన్న దేవుళ్ళను, బ్రాహ్మణులను పూజిస్తూ, సేవిస్తూ ఉన్నాడట. క్షణంలో శత్రువుల సింహాసనాలను స్వాధీనం చేసుకొని ఎంతో ఔదార్యంతో తిరిగి ఇచ్చేసేవాడట. రాముడు లాంటి మహనీయుల సద్గుణాలు కలిగినవాడిగా చిత్తాపుఖాన్‌ ఘనకీర్తి ప్రపంచం మొత్తం వ్యాపించిందని పేర్కొన్నారు. సీతాపతి రాజు బాణం శబ్దం వినగానే శత్రురాజుల భార్యలు ఏడ్చేవారట. అతను ఈ రాజ్యాన్నంతా తన విల్లుబలంతోనే గెలిచాడట. ఎవరైనా అడిగితే చిన్న వెండి నాణాన్ని ఇవ్వడానికి ఆలోచిస్తారు. కానీ షితాబ్‌ఖాన్‌ ఎంతో దానగుణంతో ఎల్లప్పుడు వందలు, వేలకొద్ది బ్రాహ్మణులకు దానం చేసేవాడట.

ఏకశిలా నగరంలో ముస్లింలు ధ్వంసం చేసిన, తొలగించిన కాకతీయుల కాలం నాటి పాంచాలరాయ (కృష్ణుడు) విగ్రహాన్ని, మహాలక్ష్మి అమ్మవారిని, స్వయంభూ శివలింగాన్ని పునః ప్రతిష్ఠించాడు. వరంగల్లు కోటలో ఉన్న కుష్‌మహల్‌ను కూడా ఇతడు కట్టించినట్లు తెలుస్తున్నది. ఇంకా ఈ శాసనంలో ఇతని కుటుంబానికి సంబంధించిన సమాచారం కూడా తెలుస్తుంది. ఇతనికి ఇద్దరు భార్యలు... దేవాంబిక, అనుమాంబ. దేవాంబికకు ఇద్దరు పుత్రులు... అవధూతఖాన్‌, పురాంతకుడు. అనుమాంబకు ముగ్గురు పుత్రులు అమర, భోగి, రామ.

ఈ శాసనం ఆపస్తంభ సూత్రుడు, భారద్వాజ గోత్రుడైన అన్నార్యుని కొడుకు మాధవుడు రచించినట్లు తెలుస్తోంది. శాసనంలో నాలుగు వాక్యాలు తప్ప మొత్తం సంస్కృత భాషలో ఉంది. 143 పంక్తుల్లో ఉన్న ఈ శాసనం వల్ల సీతాపతి లేదా చిత్తాపుఖాన్‌ లేదా షితాబ్‌ ఖాన్‌ వ్యక్తిత్వం, దాతృత్వం, పరాక్రమం, శౌర్యం, శత్రురాజుల పట్ల అతను చూపే జాలి తదితర అంశాలన్నీ తెలుస్తున్నాయి.

కాకతీయుల తర్వాత తెలుగు ప్రాంతాలను ఏకం చేయాలనే అతని కోరిక తీరలేదు. కుతుబ్‌షాహీల చేతిలో పరాజయం పాలైన తర్వాత, అతను కళింగ ప్రతాపరుద్ర గజపతి దగ్గర చేరాడు. 1516-17 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు కళింగ గజపతిపై దండెత్తినప్పుడు, అతని పటాలం సీతాపతిరాజు శర పరంపరను తట్టుకోలేకపోయింది. సింహాచలం వద్ద చివరకు సీతాపతిరాజు ఓడిపోయి, అక్కడే మరణించినట్లు తెలుస్తుంది. చరిత్రలో ఇంతటి ఘనకీర్తి కలిగిన షితాబుఖాను కాకతీయుల పరాక్రమాన్ని పుణికిపుచ్చుకుని శత్రువులకు అరివీర భయంకరుడుగా నిలిచాడు.

- డా. భిన్నూరి మనోహరి

9347971177


logo