బుధవారం 28 అక్టోబర్ 2020
Editorial - Sep 19, 2020 , 00:16:11

రైతు గుండెల్లో కొలువు

రైతు గుండెల్లో కొలువు

మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాస్‌ అయిన రెవెన్యూ చట్ట సంస్కరణ గురించి మాట్లాడుకోని తీరాలె. ఎందుకంటే కోట్ల మంది జీవితాలతో ముడిపడి ఉన్న ముచ్చట అది.రెవెన్యూలో ఉద్యోగమంటే బంపర్‌ ఆఫర్‌గా భావిస్తరు. కింది నుంచి పై వరకూ కొందరిని మినహాయించి దోపిడీ విస్తరించి వుంటుంది. రెవెన్యూ విభాగంలో వ్యవసాయ భూములు అనుసంధానం కావడం చాలామందికి పండుగ అయింది.మోసం ఎవరిని చెయ్యవచ్చంటే.. మనకు బాగా తెలిసినవాళ్ళని గానీ.. ఏమీ తెలియని అమాయకులను గానీ. ఇక్కడ ఏమీ తెలియని అమాయకులు, నిరక్షరాస్యులు బక్క రైతులు.  

ప్రగత పది పదిహేనేండ్లుగా భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నయ్‌. రాష్ట్రం వచ్చాక ప్రగతి పట్టాలెక్కిన తరుణంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరింత మోసాలకు, ప్రాణహానులకు దారితీసే ప్రస్తుత తరుణంలో బిల్లు రావడం ఊరట కలిగించే మంచి పరిణామం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప సంకల్పాలలో ఒకటి రెవెన్యూ వ్యవస్థ సంస్కరణ. గతంలో రెవెన్యూను కదిలిస్తే తమ పవర్‌ ఎక్కడ పడిపోతుందోనని ఆ ఆలోచనకే సాహసించేవాళ్లు కాదు. 

చాలాకాలంగా ఈ విషయం మీద కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి ఏడాది కిందట రెవెన్యూ ప్రక్షాళన అని అనౌన్స్‌ చేయ్యగానే కొన్ని నిరసనలొచ్చాయి. అయినా, ఆయన బెదరలేదు. కసరత్తు ఆపలేదు. చిత్తశుద్ధికి ధైర్యమెక్కువ కదా..! అదే సమయంలో ఎవరికి తోచిందోగానీ.. నమస్తే తెలంగాణ పత్రికలో ‘ధర్మగంట’ మోగింది.

నిజంగా అది అధర్మంతో పీడింపబడుతున్న పేదరైతుల పాలిట దేవుడి గంట. ప్రజలనుండి విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా అవకతవకలతో, అన్యాయంతో అల్లాడుతున్న బక్క రైతులు కాపాడండి నాయనో.. అన్నట్లు భూములకు సంబంధించిన కాగితాలతో బయటకు వచ్చి, జరిగిన అన్యాయాలను పేపరు ద్వారా ప్రభుత్వానికీ ప్రజానీకానికీ చెప్పుకున్నారు. హృదయవిదారకమైన కథనాలు వెలుగు చూశాయి. చదువుతుంటే కడుపు తరుక్కుపోయేది. కండ్లు జలధారలయ్యేవి. రైతులే.. చట్ట సవరణను వ్యతిరేకిస్తూ అరుస్తున్న రెవెన్యూ ఉద్యోగుల నోళ్ళను తమ కథనాలతో మూయించారు. అటునుండి మళ్ళీ అరుపుల్లేవ్‌. భూమి కడుపున పెట్టుకొని లాలించే అమ్మలాంటిది. తరతరాలుగా ఒకరినుండి ఒకరికి అందే ధైర్యం. రైతుకు ఆ మట్టినీ, ఆ నేలనీ ప్రేమించడం, సాగుచేసి పండించడం, జీవనం సాగించడం తప్ప మరొకటి తెలియదు. అలాంటి భూమిపోతే ఎలా బతుకాల్నో తెలియదు. 

రియల్‌ ఎస్టేట్‌ పేరుతో దొడ్డిదారిన దొంగలు జొరబడి అధికారులతో కుమ్మక్కై పేపర్లు మార్చి ఇది నీది కాదు మాదంటే.. రైతేం కావాలి. తరాల తరబడి నడిచిన నేల కాళ్ళ కింది నుండి జారిపోతుంటే ఎవరికి చెప్పుకొంటాడు. ఎన్నెన్నో మరణాలకు భూ సమస్యలు కారుణమయ్యాయంటే అతిశయోక్తి కాదు. బడాబాబులు, రౌడీలు పెద్ద పెద్ద కార్లలో వచ్చి భూమి వదిలి వెళ్ళిపొమ్మంటే పాపం ఆ రైతుకు ఎదిరించే శక్తి ఎక్కడిది. కాపాడవలసిన చట్టం కాసులకమ్ముడు పోయినప్పుడు, ఓడిపోయి, మానసికంగా చచ్చిపోయి, వాళ్ళు రాల్చిన చిల్లరను కన్నీళ్ళతో తడుపుకొంటూ తలవంచుకు వెళ్ళిపోవడం తప్ప మార్గంఏది..? భూముల విషయంలో మన తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి. రిజిస్ట్రేషన్లు వుండేవి కావు. తెల్లకాగితమే భూమి యాజమాన్య ధ్రువీకరణ పత్రం. పైగా వందల ఎకరాలు ఇనాములుగా రాసి ఇచ్చేవారు. ఇంకా చాలా లొసుగులతో కూడిన వ్యవస్థ అది. అక్రమార్కులకు ఆట విడుపుగా మారడానికి ఇదీ ఒక కారణం. దుర్మార్గుల పదఘట్టనల కింద నలిగి పోయిన జీవితాలెన్నో.. విడిచిన ప్రాణాలెన్నో.

రాష్ట్రవ్యాప్త భూముల సర్వేకు ప్రభుత్వం ఆదేశించడం ఎందరికో ధైర్యాన్నిచ్చింది. స్థలాల రూపంలో, పొలాల రూపంలో ఆస్తులు కొనుక్కున్నవారికి, వాటిని కబ్జాల నుండి కాపాడుకోలేక అవస్థలు పడుతున్నవారికి గొప్ప రిలీఫ్‌. లొసుగులతో కూడిన రెవెన్యూ చట్టాలతో, స్వార్థపరుల ధనదాహంతో ఎన్నో విలువైన భూములు అన్యాక్రాంతం కావడం మనకు తెలిసిందే. హైదరాబాద్‌ రోడ్లు ఎంత రక్తంతో తడిచాయో, ఎన్ని హాహాకారాలు విన్నాయో అందరం సాక్షులమే. ఇప్పుడు చాలావరకు తగ్గాయిగానీ బెదిరించి అదిరించి కొన్ని జరుగుతూనే వున్నాయి. మళ్ళీ ఆ పరిస్థితులు రాకుండా చట్టం కఠినతరంగా రూపొందించాలన్నది ప్రజల కోరిక.

ముఖ్యంగా మన దేశంలో రైతుకు- భూమితో వున్న అనుబంధం గొప్పది. ప్రాణంతో సమానం. బతకగలననుకొంటే భూమిని, ఊరినీ వదులుకొని వలస వెళ్ళాలని ఏ రైతూ అనుకోడు. అలా అనుకోకపోవడం వల్లనే, పండినదాంతో బతకగలనూ, బతికించగలనన్న దమ్ము వుండటం వల్లనే ఎంతో మేలు జరుగుతున్నది. ప్రపంచ దేశాలు వ్యాపారాల్లో, ఐటీ రంగాల్లో నష్టపోయి ఆర్థిక మాంద్యంతో విలవిల్లాడినా భారత్‌ ఎప్పుడూ అంత దిగజారలేదు. రైతు చిన్న కమతాలతో దేశ ఆర్థిక మాంద్యాన్ని ఎన్నోసార్లు తన భుజాల మీద మోశాడు. ఇది ఆర్థిక సత్యం. ఇందుకు మనమందరం కృతజ్ఞతలతో నిలబడి రైతుకు సెల్యూట్‌ చెయ్యాలి. రైతు మనందరి కడుపునింపి బతికిస్తున్న రారాజు.

ఇప్పటివరకూ ఏ పాలకులూ పట్టించుకోని విధంగా రైతుల పట్ల ప్రేమాభిమానాలతో.. అమాయకులయిన పసిబిడ్డలను తండ్రి భుజాలమీద కెక్కించుకొని పొలం గట్లమీద నడుస్తూ తనకు తెలిసిన విషయాలను తెలియచేస్తున్నట్లు, మార్గదర్శనం చేస్తున్నట్లు రైతులను నడిపిస్తున్నారు కేసీఆర్‌. ఏ పొలంలో ఏ పంట ఎంత వెయ్యాలో, ఎక్కడ అమ్మాలో, చాలినన్ని నీళ్ళిచ్చి, తాగినన్ని మంచినీళ్ళు పంచి.. ఇప్పుడింక ‘నీ భూమికెవడడ్డొస్తడో నేను చూస్త బిడ్డా’ అంటూ కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన తండ్రి, గురువూ అన్నీ అయి పసిబిడ్డల్లాంటి రైతుబిడ్డల్ని కాపాడుకొంటున్న మన నాయకుణ్ణి రైతులోకం చేతులెత్తి నమస్కరిస్తూ గౌరవించుకొంటున్నది..! ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుని కాపాడుకొంటుంది..!!

-రావులపల్లి సునీత


logo