బుధవారం 28 అక్టోబర్ 2020
Editorial - Sep 19, 2020 , 00:16:13

కేసీఆర్‌ అప్పుడుండుంటే..

కేసీఆర్‌ అప్పుడుండుంటే..

గాపొద్దు కేసీఆర్‌ సార్‌ ఉండుంటే మాకీ తక్లీఫ్‌ ఉండకపోతుండే! రెండేళ్ల సంది ఏమన్న తిప్పలైతాందా. మా సంగతి ఏమో కని, మా తాతనైతే మస్తు గోస పుచ్చుకున్నడంట గప్పట్ల మా ఊరు పట్వారీ. ఆయనకు కోపమొచ్చినప్పుడల్ల మా పొలంల నాలుగు గుంటలు మాయమైతుండేనట.

పట్వారి అచ్చేసరికి గుళ్ల దీపం కొండెక్కితే రెండు గుంటలు ఒక్క పూట పంచాంగం చెప్పుడు ఆలస్యమైతే మూడు గుంటలు ఆళ్ల సందుల తలెత్తుకు నడుచుకుంట పోతే రెండు గుంటలకు ఎసరు పెడ్తుండేనట!నమ్మించి ఓపాలి, బెదిరించి ఇంకోపాలి.. మా పొలమంత ఆగమాగం చేసిండు. 

ఓ గమ్మతు ముచ్చట.. 70 ఏండ్ల కిందటి సంగతది. మా నాయనమ్మ చెప్పింది. ఓ పొద్దు ఇంటికే అచ్చిండట పట్వారి. ‘ఏం రఘురామయ్య మామా! ఈసారి పొలం శిస్తు గట్టలే. ఏం జెయ్యమంటవ్‌' అన్నడట. మా తాత ‘శిస్తా! మీ నాయన తద్దినానికి వచ్చినప్పుడు నాకిచ్చే దక్షిణ శిస్తు కింద జమ చేసుకుంటా అన్నవ్‌ కదా!’ అన్నడట మా తాత. ‘ఏం మాట్లాడుతాన్నవ్‌ మామా! నేనిచ్చేది రూపాయి. నీ భూమి శిస్తు ఆర్రూపాలు. నేనెట్ల కడ్తానుకున్నవ్‌. నీలెక్క భూస్వామినా’ అని నవ్విండట. అప్పుడు మా తాత బాధపడుతూ ‘అట్లంటవేంది! చెలకల పంటేసింది లేదు. చెరువెనక సగం పడావే ఉంది. ఇప్పుడేం చేయమంటవో నువ్వే చెప్పు’ అని భయంగానే విన్నవించుకున్నడట.

‘మామా! పొద్దున లేస్తే మనం మనం మొహాలు చూస్కుంటం. నువ్వు చిన్నబుచ్చుకుంటే నాకు తృప్తయితదానె! మంచి పైసల్‌ చేస్త గాబరకాకు. నీళ్లు లేక చెలక భూమి ఉట్టిగనే పడుంది. పంట పండని భూమికి శిస్తు కట్టుడంటే ఎవ్వళ్లకైనా దుఃఖమే అస్తది. అందుకే ఆ నాలుగెకరాలు మన అంజన్న పేరుమీదికి మారుస్తా. గదే గుడి పేరు మీదికన్నట్టు. చెరువెన్క మూడెకరాలు ఉన్నది చూడు! దాంట్ల సగం, ఇంటెనకున్న 30 గుంటలు మల్లన్న పేరు మీదికి బదలాయిస్తా. శిస్తు దేవుడే కట్టుకుంటడు. అనుభవదారులు నువ్వు, నీ కొడుకులే ఉంటరు. తేడా అయితే నేనున్న గదా! ఏమంటవ్‌' అన్నడట. మా తాత ‘ఊ..’ అన్నడట. ఎందుకు ఊరుకున్నవ్‌ అని మా నాయనమ్మ అడిగితే ‘అతడి మాటను కాదని బతకగలమా! తను చేయాలనుకున్నదే చెప్పిండు. మనం ఒప్పుకోకపోతే మాత్రం చేయకుండా ఉంటడా! అంతా కృష్ణార్పణం’ అని గుడికి పోయిండట మా తాత.

గప్పట్ల కేసీఆర్‌ సారుంటే గిట్లయ్యేదా! ఎనిమిదెకరాలు.. ఎకరంనరకొచ్చింది. అదన్న సక్కగున్నదా అంటే.. మూడు నెలలకే మరో పిడుగు వేసిండట పట్వారి. మా ఊరు చెరువు పెద్దది. మత్తడి కట్టనికి ఎక్కడినుంచో ఎవరో అచ్చిండ్రట. మంచిగ కట్టిండ్రట. ఆళ్లకు కొంతభూమి ఇయ్యాలె అని ఊళ్ల తీర్మానం చేసిండ్రు. చెరువెన్క ఉన్న మా ఎకరంనర పొలంల 13 గుంటలు ఆళ్లకు బదలాయించి ఇంటికొచ్చిండు పట్వారి. ‘మామా! గరీబోళ్లు.. 13 గుంటలు నీదాంట్లకెళ్లి ఇచ్చిన. నువ్వు ఇదైపోకు.. పొలంకౌలు వాళ్లకే ఇప్పిస్తా! బంగారం పండిస్తరే’ అన్నడు పట్వారి. ఈ తాప మా తాత మనసులోనే కృష్ణార్పణం అనుకున్నాడట.

భూమంత ఆగమైంది. ఆ నాలుగెకరాల చెల్క ఎవరి పరమైందో ఎవ్వళ్లకు తెల్వదు. ఖాస్రా పహాణీ అడ్రస్‌ దిక్కులేదు. చెస్లా పహాణీ ఉన్నా.. రాత అర్థం కాదు, విషయం బుర్రకెక్కదు. గివన్ని కాదనుకొని ఉన్న ఎకరం పావు జాగా మా మనుమల తరంలో అమ్ముకున్నం. ఇంటెనక ముప్పావ్‌ ఎకరానికి యజమానులుగా మిగిలిపోయినం.

పది రోజుల సంది వార్తలు సూస్తాంటే అనిపిస్తాంది. కేసీఆర్‌ సార్‌ అప్పట్ల ఉండుంటే.. గీ చట్టం గాపొద్దు వచ్చుంటే.. మా పొలం మాకు మంచిగ ఉంటుండే కదా! ఇప్పటికైనా మంచి చట్టం చేసిన సర్కార్‌కు దండాలు. దాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్‌ సార్‌కు మొక్కులు.  

- కణ్వస


logo