బుధవారం 28 అక్టోబర్ 2020
Editorial - Sep 19, 2020 , 00:16:13

పశ్చిమాన కొత్త దోస్తీ

పశ్చిమాన కొత్త దోస్తీ

పశ్చిమాసియాలో కొత్త పరిణామం సంభవించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలస్తీనా- ఇజ్రాయెల్‌ వివాదం అలా ఉండగా తాజాగా అమెరికా అనుసంధానంతో ఇజ్రాయెల్‌- యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)- బహ్రెయిన్‌ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ అబ్రహాం ఒప్పందాలు మధ్య ప్రాచ్యంలో నూతనోదయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభివర్ణించారు. ఇజ్రాయెల్‌తో పూర్తిస్థాయిలో సాధారణ సంబంధాలు కొనసాగించేందుకు ఉద్దేశించిన ఒప్పందాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. 1948లో ఇజ్రాయెల్‌ అవతరించిన తర్వాత ఇప్పటివరకు రెండు అరబ్‌ దేశాలు మాత్రమే దానిని గుర్తించగా, తాజా ఒప్పందాలతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది. 1978లో ఈజిప్టు, 1994లో జోర్డాన్‌ దేశాలు ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని ఆ దేశాన్ని గుర్తించాయి. తాజా ఒప్పందం తర్వాత ఇతర అరబ్‌ దేశాలు కూడా ఇదే తీరును అనుసరిస్తాయని ట్రంప్‌ ఆశించగా, తమ వివాదం పరిష్కారం కాకుండా అలాంటి నిర్ణయానికి రాకూడదని పాలస్తీనియన్లు కోరుతున్నారు. 

మొత్తంగా ఈ పరిణామంలో ట్రంప్‌ యంత్రాంగం అత్యంత కీలకమైన దౌత్య విజయం సాధించిందని భావించవచ్చు. పాలస్తీనా అంశం పరిష్కారం కాకుండానే రెండు అరబ్‌ దేశాలను ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలకు ఒప్పించడమనేది విశేషం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్‌ ఈ అంశాన్ని తనకు సానుకూలంగా మలచుకునే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందాలకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు బహిర్గతం కానప్పటికీ మెరుగైన ఆర్థిక, రాజకీయ, భద్రతాపరమైన సంబంధాలకు దారితీసే పరిణామమిది. దౌత్యకార్యాలయాలు, వాణిజ్య ఒడంబడికలు, రవాణా మార్గాల అనుసంధానం వంటివి ఉండే అవకాశముంది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మూడు దేశాల నేతలతో సంతకాలు చేయించిన ట్రంప్‌ మరో ఐదు అరబ్‌ దేశాలు కూడా ఇటువంటి ఒప్పందాల ఖరారు దిశలోనే ఉంటాయని పేర్కొన్నారు. చరిత్రలో ఈరోజు కీలకమని, శాంతిపర్వంలో నూతనోదయమని ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొనగా, ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలిగినప్పుడే మధ్యప్రాచ్యంలో శాంతి సాధ్యమని పాలస్తీనా నేత మహమూద్‌ అబ్బాస్‌ వ్యాఖ్యానించారు. ‘ఇజ్రాయెల్‌ ఆక్రమణలు ముగిస్తే తప్ప ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరత సాధ్యం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. 

ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు, ప్రత్యేకించి సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్‌తో సంబంధాలకు మొగ్గుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయంగా మారింది. ఇప్పటివరకైతే ఆ దేశం సిద్ధంగా లేనట్టే సంకేతాలిస్తున్నది. చాలా గల్ఫ్‌ అరబ్‌ దేశాలు ఇజ్రాయెల్‌లాగే ఇరాన్‌తో విరోధంతో ఉన్నందున ఈ ఒప్పందాలు ఈ ప్రాంతంలో కొత్త భద్రతా సంబంధాలకు దారితీస్తాయనే అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. నిజానికి ఈ దౌత్య చర్యల వెనుక సౌదీ అరేబియాకు ఇరాన్‌కు మధ్యనున్న ప్రాంతీయ స్పర్ధ నేపథ్యం కూడా ఉన్నది. ఇరాన్‌లో చాలా వరకు షియా ముస్లిములు ఉండగా, సౌదీ అరేబియా సున్నీ ఆధిపత్య దేశం. యూఏఈ, బహ్రెయిన్‌ రెండు కూడా సౌదీ మిత్ర దేశాలే. అందువల్ల ఇప్పుడు సౌదీ అరేబియా ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఒప్పందాలు శాంతికి బాటవేస్తాయా లేక ఆయుధపోటీకి దారితీస్తాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధునాతన ఫైటర్‌ జెట్లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు అమ్మాలన్న ప్రతిపాదన ఇందుకు ఆస్కారమిస్తున్నది. 

పాలస్తీనా నాయకత్వం ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందం కుదిరిన రోజు ఈ ప్రాంతానికి చీకటిదినమని అభివర్ణించింది. ఈ ఒప్పందాలు ప్రమాదకర విద్రోహచర్యలని పాలస్తీనియన్లు అభిప్రాయపడుతున్నారు. పాలస్తీనాకు దేశ హోదా రానిదే ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకోమన్న హామీని ఈ అరబ్‌ దేశాలు ఉల్లంఘించాయని అంటున్నారు. పాలస్తీనా విషయంలో తమ వైఖరి మారలేదని యూఏఈ ప్రకటించింది. పాలస్తీనాకు దేశ హోదా అంశం కేంద్ర బిందువేనని స్పష్టం చేసింది. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని కీలక భూభాగాలను కలిపేసుకోవాలన్న వివాదాస్పద ప్రణాళికను ఉపసంహరించుకుంటామన్న ఇజ్రాయెల్‌ హామీ కూడా ఒప్పందంలో ఉన్నదని పేర్కొన్నది. ట్రంప్‌ ప్రతిపాదనలు ఇజ్రాయెల్‌ పక్షపాతాన్ని చూపిస్తున్నాయని పాలస్తీనియన్లు అంటున్నారు. భూభాగాలను కలిపేసుకోవాలన్న ప్రతిపాదన తమ ఆశావహ భవిష్యత్‌ స్వతంత్ర దేశ ఆకాంక్షను దెబ్బతీసేటువంటిదని, అది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని విమర్శిస్తున్నారు. పాలస్తీనా- ఇజ్రాయెల్‌ వివాదంలో అరబ్‌ దేశాల చొరవ తగ్గుతుంటే ఇరాన్‌, టర్కీ, వాటి మిత్రదేశాలు ముందుకొస్తున్నాయి. ఈ పరిణామం కొత్త సమీకరణాలకు దారితీస్తుంది.


logo