శుక్రవారం 30 అక్టోబర్ 2020
Editorial - Sep 18, 2020 , 00:08:17

మనవారే కీలకం

మనవారే కీలకం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. నవంబర్‌లో జరుగనున్న ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌, డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థుల మధ్య పోటీ కొత్త పంథాలో సాగుతున్నది. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉండటమేగాక ఆ పార్టీ విజయానికి ప్రధాన వనరుగా మారిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. మరోవైపు, భారతీయ అమెరికన్లు డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు ‘ఇండియాస్పొరా అండ్‌ ఏషియన్‌ అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌ (ఏఏపీఐ)’ డేటా సర్వేలో తేలటం ప్రాధా న్యం సంతరించుకున్నది. రెండోసారి అధ్యక్షపీఠాన్నెక్కాలని ట్రంప్‌ స ర్వశక్తులు ఒడ్డుతున్నా.. కమలాహారిస్‌ రూపంలో ట్రంప్‌ గెలుపునకు ప్రధాన అడ్డంకి ఏర్పడిందనే వాదనలూ వినిపిస్తుండటం విశేషం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటములు భారతీయ అమెరికన్ల ఓట్లపై ఆధారపడి ఉంటున్నాయని గత అనుభవాలు చెప్తున్నాయి. అమెరికాలోని యాభై రాష్ర్టాల్లో దాదాపు ఏడు రాష్ర్టాల్లో ఇండియన్‌ ఓటర్లే జయాపజయాలను నిర్దేశించే స్థితి ఉన్నది. ముఖ్యంగా కాలిఫోర్నియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, ఫ్లోరిడాల్లో నమోదయ్యే ఓటింగే అమెరికా అధ్యక్షుణ్ని నిర్ణయిస్తుంది. అలాగే ‘స్వింగ్‌ స్టేట్స్‌'ల్లోని భారతీయుల ఓటింగ్‌ కూడా కీలకం. పెన్సిల్వేనియా, మిషిగాన్‌, ఫ్లోరిడా, నార్త్‌ కరోలినా రాష్ర్టాలను స్వింగ్‌ స్టేట్స్‌గా పిలుస్తారు. ఈ రాష్ర్టాల్లో చివరి నిమిషంలో ఓటింగ్‌ సరళి ఎటు మొగ్గితే అటు గెలుపు ఖాయమనే అభిప్రాయమున్నది. ఇదిలా ఉంటే, గత ఎన్నికల్లో భారతీయ ఓటర్లు 16 శాతం ట్రంప్‌కు మద్దతు పలికారు. అదిప్పుడు 30 శాతానికి పెరగవచ్చని ‘ఏఏపీఐ’కి నేతృత్వం వహించిన కార్తీక్‌ రామకృష్ణన్‌ చెప్పటం కొసమెరుపు. దీంతో ట్రంప్‌ గెలుపు ఖాయమనే వాదనలకూ బలం చేకూరుతున్నది. 

గత ఎన్నికల్లో జాతి వివాదాన్ని తెరమీదికి తెచ్చి ఊహించని విజయాన్నందుకున్న ట్రంప్‌ ఈసారీ అదే బాటలో సాగుతున్నారు. జాతివివక్ష, జాతీయత, అమెరికాను సమున్నత స్థానంలో నిలుపండి అన్న నినాదాలతో దూసుకుపోతున్నారు. వలసల సమస్య ఆధారంగా సామాజిక విభజనతో ఓటు బ్యాంకును పెంచుకుంటున్నారు. కమలా హారిస్‌పై ట్రంప్‌ కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ జాతివివక్ష వ్యాఖ్యలు చేసేదాకా వెళ్ళారు. హారిస్‌ సంయమనంతో వ్యవహరిస్తూ ట్రంప్‌ దురుసుతనాన్ని రాజకీయంగానే ఎదుర్కొంటున్నారు. అమెరికా అందరిది, అందరికి సమాన అవకాశాలు అన్న నినాదంతో జో బైడెన్‌తో జతకట్టి పోరాడుతున్నారు. డెమొక్రాటిక్‌ పార్టీకి ఒక్క రోజులోనే 194 కోట్ల విరాళాలను సంపాదించిపెట్టిన కమలా హారిస్‌, అధ్యక్ష అభ్యర్థికీ విజయాన్ని అందిస్తారనే ప్రచారం ఉన్నది. ఏదేమైనా అగ్రరాజ్యం అమెరికాలో ఆ దేశ ఆర్థిక, రాజకీయ, విదేశీ విధానాలు ఎన్నికల ప్రచారాస్ర్తాలు కాకుండా వర్ణవివక్ష, జాత్యాహంకార పోకడలు ప్రధానం కావటం ఆక్షేపణీయం.