గురువారం 22 అక్టోబర్ 2020
Editorial - Sep 18, 2020 , 00:08:24

ఒట్టుమాట.. ఒట్టిమాటే

ఒట్టుమాట.. ఒట్టిమాటే

వ్యాపారాన్ని వృద్ధి చెందిస్తూ లాభాలు కండ్లజూస్తున్న తమ్ముడి దగ్గిరికి పెద్దన్న వచ్చాడు. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామని, లాభాలను పంచుకుందామని చెప్పాడు. ఈ ఒప్పందం వల్ల తనకు లాభం లేదని తెలిసినా కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో తమ్ముడు సరేనన్నాడు. మరి నష్టం వస్తే ఎలా అని తమ్ముడు అడిగితే ‘ఆ మొత్తాన్ని నేనే చెల్లిస్తాను.. ఒట్టు’ అని చెప్పాడు. రెండేండ్లు వచ్చిన లాభాలను తన ఖాతాలో వేసుకున్న అన్న.. ఇప్పుడు నష్టం వచ్చి తమ్ముడు అడుగుతుంటే మాత్రం అప్పు తెచ్చుకోపో అంటూ కసురుతున్నాడు. ఆదుకొని అండగా ఉండాల్సిన అన్న.. చేసిన ఒట్టును గట్టుమీద పెట్టి తమ్మున్ని కష్టాల్లోకి నెట్టాడు.

2017కు ముందు రాష్ర్టాలకు సొంతంగా పన్నుల వ్యవస్థ ఉండేది. వ్యాట్‌, విలాస పన్ను, వినోద పన్ను, కొనుగోలు సుంకం.. ఇలా అనేక రూపాల్లో ఆదాయం వచ్చేది. ఏ వస్తువుపై ఎంత పన్ను విధించాలో రాష్ర్టాలకే అధికారం ఉండేది. తెలంగాణ సహా పలు రాష్ర్టాలు పెట్టుబడులను ఆకర్షిస్తూ, సంపదను సృష్టించి వృద్ధిరేటులో దూసుకుపోయేవి. ఇదే సమయంలో కేంద్రం  జీఎస్టీ ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ఒక వస్తువుపై దేశమంతా ఒకేరకమైన పన్ను ఉండాలని ఆకాంక్షించింది. 

వివిధ రూపాల్లో ఉన్న పన్నులను రద్దుచేస్తూ మూడు రకాలుగా వర్గీకరించింది. సెంట్రల్‌ జీఎస్టీ (సీజీఎస్టీ), రాష్ట్ర జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ), ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ (ఐజీఎస్టీ). ఒక వస్తువుపై కేంద్రం విధించే పన్నును సీజీఎస్టీ అంటాం. ఇది కేంద్రం తీసుకుంటుంది. ఎస్‌జీఎస్టీ రాష్ట్ర ఖజానాలోకి వెళ్తుంది. ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అయ్యే వస్తువులపై విధించే పన్నును ఐజీఎస్టీ అంటాం. దీనిని కేంద్రం వసూలు చేసి ఆయా రాష్ర్టాలకు పంచుతుంది. జీఎస్టీలో చేరడం వల్ల తెలంగాణకు ఆదాయం తగ్గుతుందని తెలిసినా సీఎం కేసీఆర్‌ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సరేనన్నారు. సరళీకృత వ్యవస్థ ఏర్పడుతుందని, పెట్టుబడులు తరలొస్తాయని భావించారు.  

జీఎస్టీలో చేరితే తమ ఆదాయం పడిపోతుందని రాష్ర్టాలు ఆందోళన చెందగా.. నష్టపోయే ఆదాయాన్ని ఐదేండ్లపాటు సర్దుబాటు చేస్తానని కేంద్రం హామీ ఇచ్చింది. 2016లో రాష్ర్టాలకు వచ్చిన ఆదాయం ప్రాతిపదికగా.. ఏటా 14 శాతం వృద్ధిరేటు అంచనాను నిర్ణయించింది. ఒక్క రూపాయి తగ్గినా పరిహారం చెల్లిస్తామని చెప్పింది. 

యూపీఏ హయాంలో ‘సెంట్రల్‌ సేల్స్‌ ట్యాక్స్‌' (సీఎస్టీ) ప్రవేశపెట్టే సమయంలోనూ నష్టపోయే ప్రతి రూపాయిని చెల్లిస్తామని కాంగ్రెస్‌ మాట ఇచ్చి తప్పింది. తెలంగాణకు రూ.5,604 కోట్లు రావాల్సి ఉండగా, రూ.1,957 కోట్లు మాత్రమే ఇచ్చి, రూ.3,647 కోట్లు ఎగ్గొట్టింది. కాబట్టి ఉట్టి హామీలను నమ్మమని రాష్ర్టాలు స్పష్టం చేశాయి. దీంతో రెండు నెలలకు ఒకసారి పరిహారం చెల్లిస్తామని చట్టబద్ధత కల్పించింది. 

పరిహారాన్ని సర్దుబాటు చేసేందుకు కేంద్రం 28శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చే కొన్ని విలాస వస్తువులపై ‘కాంపన్సేషన్‌ సెస్‌' పేరుతో కొత్త పన్ను విధించింది. 2017-18లో సెస్సు రూపంలో కేంద్రానికి రూ.62,611 కోట్లు రాగా, పరిహారం కింద రూ.41,146 కోట్లు పంచింది. మిగతా రూ.21,465 కోట్లను భారత ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకున్నది. 2018-19లో రూ.95,081 కోట్లు రాగా, రూ.69,275 కోట్లు పంచింది. రూ.25,806 కోట్లు మిగిలాయి. ఇలా రెండేండ్లలో కేంద్రానికి రూ.47,271 కోట్లు అదనపు ఆదాయం వచ్చింది. ఈ రెండేండ్లలో తెలంగాణ 20 శాతానికిపైగా వృద్ధిరేటు సాధించడంతో పరిహారం అడుగలేదు. 

2019-20లో ఆర్థిక మందగమనం ఛాయలు మొదలయ్యాయి. కేంద్రానికి సెస్సు రూ.95వేల కోట్లు రాగా.. రాష్ర్టాలకు రూ.1.65 లక్షల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. రెండేండ్లు లాభాలు కండ్లజూసిన కేంద్రం.. రూ.70వేల కోట్లు లోటు రావడంతో ఖంగుతిన్నది. ‘పరిహారం విడుదల చేయండి మహాప్రభో’ అంటూ రాష్ర్టాలు మొరపెట్టుకుంటే విడుతల వారీగా ఈ ఏడాది జూన్‌ వరకు విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వాటా రూ.3,200 కోట్లు మాత్రమే. అదే సమయంలో ఈ మూడేండ్లలో సెస్సు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.18వేల కోట్లు అందించింది. 

కరోనా, లాక్‌డౌన్‌తో నాలుగు నెలల్లో తెలంగాణ సగటున 34 శాతం ఆదాయాన్ని కోల్పోయింది. రూ.8వేల కోట్ల వరకు నష్టం వచ్చింది. అన్ని రాష్ర్టాలకు కలిపి కేంద్రం రూ.3 లక్షల కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక్కడే కేంద్రం అతితెలివి ప్రదర్శించింది. ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌' పేరుతో సగటు వృద్ధిరేటును 14శాతం నుంచి 10 శాతానికి కుదించి రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.1.65 లక్షల కోట్లకు తగ్గించింది. 

సుమారు రూ.1.35 లక్షల కోట్లను లెక్కల్లో నుంచి తీసేసింది. ఈ రూ.1.65 లక్షల కోట్లను పరిహారంగా ఇవ్వలేమని.. అప్పుగా తీసుకోవాలని సూచించింది. అసలు కడుతామని, వడ్డీ రాష్ర్టాలు కట్టుకోవాలని చెప్పింది. అప్పులు చేస్తే రాష్ర్టాలకు మూడు రకాలుగా నష్టం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన వడ్డీ ఉంటుంది. దీంతో అన్ని రాష్ర్టాలపై అదనపు భారం పడుతుంది. పైగా ఈ వడ్డీని రాష్ర్టాలే చెల్లించుకోవాలని కేంద్రం చెప్పడం రెండో నష్టం. ఇక మూడోది.. ఈ అప్పులను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో లెక్కిస్తామని కేంద్రం చెప్పింది. పైగా అసలును 2022 వరకు కిస్తీల రూపంలో చెల్లిస్తామని చెప్తున్నది. అయితే అసలు మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తున్నా.. అప్పు మాత్రం రాష్ట్రం పేరుమీదే ఉంటుంది. దీంతో కొత్త అప్పులు తెచ్చుకొనే అవకాశం ఉండదు. ఇది రాష్ర్టాల పరపతిని దెబ్బతీస్తుంది. 

నిజానికి అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీఎస్టీ వల్ల రాష్ర్టాలు సగటున 47 శాతం రెవెన్యూ ఆదాయం కోల్పోతే కేంద్రం నష్టం 31 శాతం మాత్రమే. జీఎస్టీతో రాష్ర్టాలకు సొంతగా నిధులు సమకూర్చుకునే ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. 

కేంద్రానికి మాత్రం ఆదాయంపన్ను, కార్పొరేషన్‌ ట్యాక్స్‌ అండ్‌ కస్టమ్స్‌ డ్యూటీ, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచి డివిడెంట్లు తదితర రూపాల్లో అదనపు ఆదాయం వస్తున్నది. ఇటీవలే దిగుమతి వస్తువులపై సుంకాలు పెంచింది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.13 అదనపు పన్ను విధించింది. చమురు ద్వారానే ఏటా రూ.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలున్న కేంద్రం.. రాష్ర్టాలకు ఉదారంగా నిధులిచ్చి ఆదుకోకుండా హక్కులను కూడా హరిస్తున్నది. అందుకే తెలంగాణ ప్రభుత్వం తిరుగుబాటు జెండా ఎగురవేసింది. పరిహారాన్ని 100 శాతం చెల్లించాలని సీఎం కేసీఆర్‌ ప్రధానికి లేఖ రాశారు. మరోవైపు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన ఐదు రాష్ర్టాల ఆర్థికశాఖ మంత్రుల సమావేశం కూడా కేంద్రంపై పోరాటానికి మద్దతు పలికింది. పార్లమెంట్‌లో ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. అయినా కేంద్రం దిగిరాకుంటే మిగిలిన దారి.. న్యాయపోరాటమే.

‘రాష్ర్టాలకు నిధులు ఇవ్వడం అంటే వ్యక్తిగతంగా ఇచ్చినట్టు కాదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం అంటే దేశ ప్రయోజనాలను కాపాడినట్టే. రాష్ర్టాలు అభివృద్ధి చెందడం అంటే దేశం అభివృద్ధి చెందినట్టే. రాష్ర్టాల్లో వచ్చే ఆర్థిక ప్రగతి దేశ ప్రగతి అని కేంద్రం గుర్తుంచుకోవాలి’ అని సీఎం కేసీఆర్‌ అనేకమార్లు కేంద్రానికి హితవు పలికారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఏ జిల్లా.. ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా దేశం అభివృద్ధి చెందినట్టేనని చెప్పారు. అయినా కేంద్రం సంకుచితంగా ప్రవర్తిస్తున్నది.

కాసాని మహేందర్‌రెడ్డి 


logo