శుక్రవారం 30 అక్టోబర్ 2020
Editorial - Sep 18, 2020 , 00:08:16

అభాగ్యులకు దారిదీపం

అభాగ్యులకు దారిదీపం

దశాబ్దాలుగా వ్యధలకు గురవుతూ, గుర్తింపు లభించకుండా వివక్షకు గురవుతున్న 17 కులాలను బీసీ జాబితాలో చేర్చడం ఒక గొప్ప ముందడుగు.. తెలంగాణ ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీసీ కమిషన్‌ను ర్పాటుచేసి వెనుకబడిన తరగతులకు న్యాయం చేస్తున్నారు. ఎందుకో ఈ తెలంగాణ.. దేనికోసం ఈ తెలంగాణ అని అడిగినోళ్లకు సమాధానం లభించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఆత్మగౌరవం అనే మాటకు ఆమడ దూరంలో ఉన్న బిడ్డల కల సాకారం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఇదివరలో అనంతరామన్‌ కమిషన్‌, మురళీధరరావు కమిషన్‌ లాంటి ఎన్నెన్నో కమిషన్లు, కమిటీలు ఏర్పడినా ఆయా కులాలకు న్యాయం మాత్రం దక్కలేదు. ఇన్నాళ్లకు.. తాను తలుచుకున్న ఎంతటి కార్యాన్నైనా సమర్థవంతంగా, న్యాయబద్ధంగా పూర్తిచేయగల సామర్థ్యం కలిగిన ఏకైక నాయకుడు  కేసీఆర్‌ తెలంగాణ ఏర్పడిన వెంటనే బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేసి వెనుకబడిన తరగతులకు న్యాయం చేస్తున్నారు. ఎందుకో ఈ తెలంగాణ.. దేనికోసం ఈ తెలంగాణ అని అడిగినోళ్లకు సమాధానం లభించేలా చర్యలు తీసుకుంటున్నారు.

అద్దపువారు, అహీర్‌ యాదవ్‌, బాగోతుల, బైల్‌ కమ్మర, ఎనూటి, గంజికూటివారు, గౌడ జెట్టి, గోవిలి, కాకిపడగల, కుల్లకడిగి, పఠంవారు, సారోల్లు, సన్నాయిల, శ్రీ క్షత్రియ రామజోగి, తోలుబొమ్మలవారు.. ఇలా ఇవన్నీ కూడా ఎంతో గొప్ప చరిత్ర, సాంస్కృతిక వైభవం కలిగిన కులాలు. స్వాతంత్య్రోద్యమంలో సైతం ఊరూరు తిరిగి రోజంతా వ్యవసాయ పనులు చేసి అలసిన ప్రజలకు వారికి తెలిసిన విద్యతో మానసిక ప్రశాంతతను అందించడం, వినోదాన్ని పంచడంలో ముఖ్య భూమిక పోషించారు. ఆధునిక పరిజ్ఞానం, సాంకేతికతతో ఈ ప్రపంచం ముందుకు దూసుకుపోతున్న తరుణంలో వీరికి పూట గడవడమే కష్టమైపోయింది, ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ సాయం పొంది ఏదైనా ప్రత్యామ్నాయ జీవనోపాధికి ప్రయత్నిద్ద్దామంటే అసలు గుర్తింపే లేనివారికి సాయం అందించేది ఎవరు?.. ఇదో విచిత్రమైన ప్రధాన సవాల్‌గా మారింది. ఈ భూమిపైన మేము బతికే ఉన్నాము మమ్మల్ని గుర్తించండి అని ఈ కులాలు దశాబ్దాలుగా మొరపెట్టుకుంటున్నా నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదు. 

తెలంగాణా రాష్ట్రం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే మొదటిస్థానాన్ని సంపాదించి ముందుకు దూసుకుపోతున్న తరుణంలో సంచార జీవనం గడిపేవారికి గుర్తింపు కూడా లేకపోవడం కేసీఆర్‌ మదిని తొలిచింది. ఆయా కులాలకు కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరాలని దృఢంగా సంకల్పించి, గత పాలకుల నిర్లక్ష్యానికి ముగింపు పలుకుతూ ఆయన బీసీల పక్షపాతిగా నిలబడ్డారు. సమాజంలో జీవచ్ఛవాలుగా ఉంటున్న ఈ బిడ్డలకు గుర్తింపు కల్పించడంతోపాటు సంక్షేమ ఫలాలు అందేలా ఒక మహోన్నతమైన కార్యాన్ని భుజాన వేసుకొని భరోసా కల్పించారు. 

సమాజంలో చీత్కారాలకు గురయి ఆర్థికంగా కుంగిపోయిన కులాలను అక్కున చేర్చుకొని వారికి ఆర్ధిక తోడ్పాటును అందించే దిశగా అడుగులు వేసిన మహానాయకుడు కేసీఆర్‌. ఊరూరూ తిరిగి పొట్టపోసుకునే ఎన్నో సంచార కుటుంబాలకు ప్రభుత్వం తరుపున భరోసా కల్పించి ఆర్థికంగా తోడ్పాటును అందించాలనే లక్ష్యంతో రూ.వెయ్యికోట్ల బడ్జెట్‌తో ప్రత్యేకంగా అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అందరికీ అందాలనే భావనతో ఉన్న ముఖ్యమంత్రి బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేసి సమర్థులైన ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. గుర్తింపు లేని కులాలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సేకరించాలని ఆదేశించారు. సమగ్ర నివేదికను సాధ్యమైనంత త్వరగా అందించాలని కోరారు. ఇప్పుడు దానిని అమలుచేసి చూపించనున్నారు. నిబద్ధతతో కూడిన కార్యాచరణను రూపొందించి అమలుపరచడంలో కేసీఆర్‌కు మరెవరూ సాటిరారనే చెప్పాలి. 

ఎన్నో ఏండ్లు ఆశగా గుర్తింపు కోసం ఎదురుచూసిన బిడ్డల కల ఇప్పుడు సాకారమయింది. వారినిప్పుడు కొత్త విశ్వాసం ముందుకు తీసుకెళుతుంది. కులమే లేదన్నవారి పిల్లలు బాజాప్త గురుకుల విద్యాలయాల్లో గర్వంగా చదువుకోవడానికి, సంచారమే జీవనంగా సాగిన విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి ప్రభుత్వం జ్యోతిబాపూలే విదేశీ విద్య స్కీం ద్వారా అవకాశం కల్పించింది. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు ఇప్పుడు వారిని ఆదుకోనున్నాయి. గర్వంగా సంతృప్తిగా జీవించే ఆత్మవిశ్వాసం పెంపొందనున్నది. ఇది కేసీఆర్‌ మార్క్‌ ప్రగతి ఫలం.

(వ్యాసకర్త: ఎంబీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌)

తాడూరి శ్రీనివాస్‌