బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Sep 16, 2020 , 23:16:09

రైతులపై కత్తి

రైతులపై కత్తి

కరోనా సంక్షోభ సమయాన్ని సానుకూలంగా మార్చుకోవాలని చెప్పిన ప్రధాని మోదీ. ఈ కష్టకాలాన్ని ప్రజావ్యతిరేక చట్టాల రూపకల్పనకు అవకాశంగా చేసుకున్నట్లు కనబడుతున్నది. వ్యవసాయరంగ సంస్కరణల పేరిట రైతాంగ వ్యతిరేక బిల్లులు మూడు తెచ్చిన మోదీ ప్రభుత్వం, ‘విద్యుత్‌ సవరణ బిల్లు- 2003’ పేరిట మరో వినాశకర చట్టాన్ని తేవటానికి సమాయత్తమవుతున్నది. ఈ బిల్లే చట్టరూపం ధరిస్తే విద్యుత్తు ఉత్పాదన, సరఫరా, రాయితీలవం టివన్నీ కేంద్రం చేతుల్లోకి వెళతాయి. మరో అర్థంలో చెప్పాలంటే విద్యుత్తు వ్యవస్థ అంతా ప్రైవేటుపరం అవుతుంది. విధాన నిర్ణయాధికారమేదీ రాష్ర్టాల చేతుల్లో ఉండదు. వినియోగదారుడైన ప్రతి రైతూ కరెంట్‌ మోటర్‌కు మీటర్‌ను బిగించుకొని రీడింగ్‌ ప్రకారం బిల్లులు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న క్రాస్‌ సబ్సిడీలు, ఉచిత కరెంట్‌ లాంటివన్నీ చట్టవ్యతిరేకమైపోతాయి. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే బిల్లును వ్యతిరేకించాల్సిందిగా బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది.

మోదీ ప్రభుత్వం మొదటినుంచీ రైతులపై కత్తిగట్టినట్లే వ్యవహరిస్తున్నది. వ్యవసాయాధారిత సమాజంలో రైతుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసి, సబ్సిడీ పథకాలు తేవడానికి బదులు కోతలు వాతలు పెడుతున్నది. దీనిలో భాగంగానే మూడు రైతు వ్యతిరేక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పంటలకు గిట్టుబాటు ధరలు; ప్రైవేటు పెట్టుబడులు సమకూర్చుకోవటం, తగిన సాంకేతికతను ప్రోదిచేసుకోవటం; పంట విక్రయానికి స్వేచ్ఛామార్కెట్‌ విధానం ఎంతో మేలు చేస్తుందని మోదీ ప్రభుత్వం ఈ బిల్లుల సందర్భంగా చెప్పుకొచ్చింది. కేంద్రం మాటలన్నీ అబద్ధాలకు అందమైన వేషమేసినట్లుగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ, రైతులకు దన్నుగా ఉన్న రైతు వ్యవసాయ మార్కెట్‌ విధానానికి తూట్లు పొడిచి స్వేచ్ఛామార్కెట్‌ పేర రైతు ప్రయోజనాలను కార్పొరేట్‌ శక్తులకు తాకట్టుపెడుతున్నది. 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటమే పనిగా పెట్టుకున్నది. దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని లాభాల బాటలో నడుస్తూ ప్రజలకు సేవలందిస్తున్న ఎల్‌ఐసీ, రైల్వేలు, వైమానిక రంగాల్లోకి ప్రైవేట్‌ను ఆహ్వానిస్తున్నది. చివరికి ఆత్మనిర్భర్‌ పేరుతో రక్షణ రంగ ఉత్పత్తులను సైతం ప్రైవేటుకు అప్పజెప్పుతున్నది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కాకులను కొట్టి గద్దలకు వేసినట్లుగా ప్రజల ప్రయోజనాలను బలిపెడుతున్నవే. ఈ నేపథ్యంలో రైతాంగ సంక్షేమం కోసం కేంద్రంపై రాష్ర్టాలు ఉమ్మడి పోరుకు సమాయత్తం కావలసిన తరుణం ఆసన్నమైనది. ఇందుకు తెలంగాణతో విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చేయి చేయి కలుపాలి. సమాఖ్యస్ఫూర్తికి సమాధి కడుతున్న మోదీ సర్కార్‌ను నిలదీయాలి.logo